సాగర సంగమమను ఒకానొక మహాకావ్యమందు

 


కృష్ణ శాస్త్రి: జయప్రదా, నా ఊర్వశీ! నా గాఢ వేదనాగ్నిని, బడబాగ్నిని,నాలో నేనే దహించుకొను కుసుమ కోమల భావనాగ్నిని ఏలాగు నే భరించెద? అహో! జయప్రదా, ఈ జగత్తున నీవు పరపత్ని వన్న ఊహ నన్ను కాల్చి, నీ మనసులో మనసునై, కవితలో కవితనై, పాటలో పాట కావలెనన్న నా ఆకాంక్షను నులిమి వేయుచున్ననూ నిన్నే నా ఊర్వశిగ హృదయమున నిల్పెద.నిల్పెద. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు? నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?



శ్రీశ్రీ: నా హృదయంలో నిదురించే చెలీ,జయప్రదా! నీకోసం నాకోసం వస్తున్నాయవిగో జగన్నాధ రథచక్రాల్‌! రాలేవూ మన కోసం?  
ఏవీ చెలీ! నిరుడు కురిసిన చిరునవ్వుల తరగలు? నును సిగ్గు దొంతరలు? పరాధీనవూ నువ్వు? బానిసకొక బానిసవు? 

కనులరమోడ్చి మెదలకుండా నగరం హృదయంలో వృషభంలా అయిపోయెగా నా మనసు! చెలీ! చెలీ! సరి, మరి,ఇక నా హృదయంలోనే నిదురించు!


చలం: అలా మెత్తని నీ పెదవులని చేరిన చిరునవ్వుని చూస్తో, అలలలుగా వస్తోన్న గాలికి అటూ ఇటూ నాట్యం చేస్తోన్న నీ ముంగురులను గమనిస్తో, నెమ్మిలిలాగు పురి విప్పిన నీ కురులను తాకుతో,  రోజులు,యుగాలు గడిపేద్దామని ఆశ పడ్డాను. మరైతే నీవు రాలేవూ? అవునులే నీవు ముగ్ధ మనోహర జయప్రదవు. నా మైదానం రాజీవి కాదుగా. సరేలే, ఈ దుఃఖం నా హృదయాన్ని దహించేయక ముందే అటూఇటూ చూసుకుంటో అరుణాచలం వెళ్ళిపోతాను మరి. 


విశ్వనాథ: అనగనగా ఒక సుందర నగరముండెను. అందు జయప్రదయను రూపవతియు, లావణ్యవతియు అగు స్త్రీ నివసించుచుండెను. ఆమెను కమలహాసనుడను నాట్యకారుడు ప్రేమించెను. కానీ, ఆమె వివాహిత. అదియొక రహస్యము. ఈ రహస్యము తెలియక కమలహాసనుడామెను ప్రేమించెను. వివాహితయను విషయము తెలిసినంతనే ఆతని హృదయము వ్రయ్యలాయెను. బరువెక్కిన డెందముతో  తన ప్రేమను త్యజించుటకు ఆతడు నిశ్చయించుకొనెను.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన