Two poems
సఖియ రావోయి చందమామ నీ వెన్నెల కౌగిట్లో మద్యం సేవిస్తాను చంద్ర కిరణాల వేళ్ళని ఇలా ఇవ్వు వెచ్చని వూపిరుల హుక్కా అందిస్తాను నీ మచ్చల చెంపని చూపించవోయ్ నిప్పు రవ్వల చిటికెలు వేస్తాను ముద్దెట్టు నా మెడ వొంపులో- నిన్ను సెగలు కక్కే సూర్యుణ్ణి చేస్తాను. కవిత రాయి మబ్బులని పేర్చి లిఖించు ఏవో కొండగాలులలో అవి చినుకులై రాలి లోతైన లోయలలో మొలకలై లేస్తాయి. ఆ సడి లేని అడవి దారుల్లో అందుకో ఇక ఏదో ఒక గాలి పాటని- పచ్చని చెట్లు మబ్బులని తాకి నిద్ర మత్తు నేల గుండెల మీద రంగు రంగుల పూలు రాల్చి తడి ముద్దులు కానుకిస్తాయి.