పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

create,trim and modify!

  జీవితమంతా తింగిరిబింగిరిగా తయారైంది గురూజీ!  ఏం చెయ్యాలో తోచక జింగిరిగింగిరి అయిపోతున్నా! చాలా ఈజీ శిష్యా!  నీ లోకాన్ని నువ్వే సృష్టించుకో! అదెలా గురూజీ?  నీ లోకాన్ని నీకు నచ్చిన మనుషులతో నింపుకో.  నచ్చని మనుషుల్ని?    తీసెయ్‌! నాకు నచ్చిన మనుషులు వెళ్ళిపోతే?  ఆ గాప్‌ని వెంటనే ఇంకో నచ్చిన మనిషితో ఫిలప్‌ చెయ్యి! నాకు నచ్చిన వాళ్ళు కొన్నాళ్ళకి మారిపోతే? నీకు నచ్చినప్పుడు ఉన్న మనిషిని నీ లోకంలో పెట్టుకుని  ఈ మారిపోయిన మనిషిని నీ లోకంలోంచి తోసేసెయ్‌!  బాధాకరమైన జ్ఞాపకాలుంటాయ్‌ కదా గురూజీ?  వాటిని నీ లోకంలోంచి చెరిపెయ్‌! చెరిపేసి?  అందమైన జ్ఞాపకాలతో నింపేసెయ్‌! ప్రతి రోజూ నీ లోకాన్ని modify చేస్తూ trim చేస్తూ  నీ లోకాన్ని నీకు నచ్చిన వాటితో నింపుకుని ఆనందంగా గడిపేసెయ్‌!  అంతే శిష్యా, create,trim and modify as per your wish!  ఇంకో విషయం శిష్యా, పక్క వాడి లోకం నుండి గుడ్డిగా copy paste చెయ్యకు.  అప్పుడు నువ్వు నువ్వుగా ఉండవ్‌,  వాడికి copy అయ్యి చివరకు paste అవుతావ్‌. తెలిసిందా?  కొత్తగా ఉన్నా గమ్మత్తుగా ఉంది గురూజీ!  ఈ రోజునుండీ అలాగే try చేస్తా! 

కోపాన్ని జయించడం ఎలా?

  నేను ఎన్నో personality development కోర్సులు చేసి  మొత్తానికి కోపాన్ని జయించగలిగానోయ్‌!  మీరు చాలా great Sir!!  Thank you. నన్ను ఎవడైనా తిట్టాడనుకో.  ఒకటి నించీ వంద దాకా అంకెలు లెక్కబెడతా.  Super Sir! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌? తరువాత అటూఇటూ వంద అడుగులు పచార్లు చేస్తా.  ఓహో! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌?  తరువాత రెండు వందలసార్లు ఊపిరి నెమ్మదిగా పీల్చి వదులుతా.  అలాగా! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌? తరువాత నాలుగు రౌండ్లు జపమాల తిప్పుతా.  ఓ! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌? తరువాత గంటసేపు శీర్షాసనం వేస్తా.  బావుంది Sir! అప్పుడు కోపం పూర్తిగా పోతుంది కదా సార్‌?  తరువాత నన్ను తిట్టిన వాడి ఇంటికి వెళ్ళి కొట్టేసి వస్తా.  అప్పుడు నా కోపమంతా ఏంటో చేత్తో తీసేసినట్టు మాయం అయిపోతుందోయ్‌!

నమ్మకం vs నమ్మకం

  మా దేవుడే నిజమైన దేవుడు. అలాగని ఎవరు చెప్పారు? మా బాదురీ చెప్పాడు. ఆయనకెలా తెల్సు? ఆయన చూసాడా? ఆయన రోజూ దేవుడితో మాట్లాడతాడు. ఆయన దేవుడితో మాట్లాడ్డం నువ్వు చూసావా? లేదు.  రోజూ దేవుడితో మాట్లాడతానని ఆయన చెబితే మేం నమ్ముతాం. సరే, మీ దేవుడిని నమ్మకపోతే? నరకం! మరి నీ తల్లీ తండ్రీ నమ్మట్లేదుగా. వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకీ నరకమే! అవున్లే, నిన్ను కని పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళను నరకంలో వెయ్యాల్సిందే! 

హక్కు vs హక్కు

  పానకాలూ, బావున్నావా? నేనిప్పుడు పానకాలు కాదు. “పాన్‌” అని పిలు. అదేంటి? నీ పేరు పానకాల స్వామి కదా? అది ఇది వరకు.  ఇప్పుడు గోడ దూకి అటు వెళ్ళా.  ఓ! సరే,పోనీలే. అది నీ హక్కు! అవునూ, ఈమధ్య మీ నాన్న పోయాడని విన్నా.  అవును. నేనూ విన్నా. కానీ వెళ్ళలేదు.  మా నాయన మాకిప్పుడు బయటి వాడు.  నేను మీ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చెయ్యకూడదు.  తండ్రి పోతే వెళ్ళలేదా!!! ఎవరు చెప్పారయ్యా ఇదంతా నీకు? మా కొత్త మార్గం బాదురీ చెప్పాడు. అసలు ఫాదర్‌ కన్నా ఇతనెక్కువైయ్యాడన్న మాట. ఈమధ్య మీ అక్క కూతురు పెళ్ళైయ్యిందిగా,  నువ్వు మేనమామవు కదా, మరి వెళ్ళావా?  నేను వెళ్ళలేదు.  నేను మీ ఆచారాలు పాటించరాదని మా బాదురీ చెప్పాడు. పూర్తిగా మారిపోయావ్‌, పానకాలూ, సారీ, పాన్‌! వస్తా!  కొన్నాళ్ళయ్యాక ఇద్దరూ మళ్ళీ కలిసారు-  అరే, పాన్‌! బావున్నావా?  ఏంటలా నీరసంగా కనిపిస్తున్నావ్‌?  నేను పాన్‌ గా మారానని మా నాన్న ఆస్తంతా  పక్కనున్న శివాలయానికి రాసేసాడు రా!  ఓ! సరే పోనీలే. అది మీ నాన్న హక్కు!  

The movie reviewer!

  ఇప్పుడే పల్నాడు కారం మెదటి ఆట మొదటి 15 నిమిషాలు చూసా. బాబు కట్టిన గళ్ళ లుంగీ అదిరిపోయింది  కానీ బాబు ఎంట్రీలో పంచ్‌ డైలాగుల్లేవు.  డైరెక్టర్‌గా పరాక్రమ్‌ టోటల్‌ ఫెయిల్‌!  మిగతా updates after 15 mins -  బాబు యాక్షన్‌ అదుర్స్ గానీ  పరాక్రమ్‌ మాటలు సరిగ్గా రాయలా. బాబు ఫైటింగ్‌ చింపేస్తున్నాడు గానీ  పరాక్రమ్‌ బాబు చేత చీప్‌గా పదిమందినే కొట్టించాడు.   మిగతా updates after 15 mins -  బాబు డాన్సులు ఉతికేసాడు గానీ  పరాక్రమ్‌ డైరెక్షన్‌ ఘోరం.  సినిమా సూపర్‌ స్లో.  రెండో హీరోయిన్‌తో బాబుకి పాటా లేదు,కట్టింగు లేదు.  ఎందుకు పెట్టినట్టో?  డైరెక్టర్‌గా పరాక్రమ్‌ అట్టర్‌ ఫ్లాప్‌!  మిగతా updates after 15 mins -  విలన్స్ అంతా లోకలే, చీప్‌గా.  పల్నాటి కారంలో ఘాటు తక్కువ.  బాబు లుక్స్ కేక గానీ  పరాక్రమ్‌ డైరెక్షనే దొబ్బింది!  ‌మిగతా updates after 15 mins -  ఇదంతా వింటున్న పక్కన కూచున్న ప్రేక్షకుడు,  సినిమా బావుంది కదయ్యా, ఎందుకలా చెబుతున్నావ్‌?  నాలాటి పేరు మోసిన reviewer చెబుతున్నా బావుందంటున్నావంటే నువ్వు ప్రేక్షకుడిగా టోటల్‌ ఫెయిల్‌!  అనగానే- ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు తన కుర్చీలోంచి లేచి నిలబడి,

రామాయణ తాళ వృక్షము - 5

  విమర్శకుడు: రాముని వనవాసము పదమూడేళ్ళా? మహాకావ్యం వ్రాస్తున్న మహాకవి విరాట్టులు ఆమాత్రము సరి చూసుకొనవలదా?  కవి విరాట్‌ శిష్యుడు: ఒక్కసారి వ్రాసిన తరువాత వెనుదిరిగి చూచు అలవాటు మా గురువు గారికి లేదు. విమర్శకుడు: వనవాసం సంగతి విన్నాక మీ గురువు గారు సృజించిన సీత ఇల్లా అంటుంది- ఈ యన్యాయము నింత చేసినను ఈ భూమీశుండు మీరేల యి ట్లే యున్నారలు లక్ష్మణుండయిననున్‌ లేడా! భవచ్చాపశి క్షా యోగ్యంబుగ నెల్ల ధాత్రి గెలువంగా లేరొ! యూహింప లే దా యారీతిగ? నెట్టులోర్వగలరో! ఆశ్చర్య మేపారెడిన్‌‌! ఇంత అన్యాయము చేసాడు గదా మీ నాయన, మీరింకా ఇల్లా ఉన్నారేమిటి? ఎందుకు ఊరుకున్నారు? మీరు కాకపోయినా లక్ష్మణుడు ఎలా ఊరుకున్నాడు? ధనుర్బాణాలు ప్రయోగించి రాజ్యాన్ని గెలుచుకోలేరా? ఆ ఊహే మీకు తట్టలేదా? ఎలా ఓర్చుకుంటున్నారు? అని అంటుంది, ఆస్తి తగాదాల్లో సై అంటే సై అంటూ భర్తలను యుద్ధాలకు ఎగదోసే గయ్యాళి భార్యల వలే!  వాల్మీకి జానకి కాదు మనకి కనబడేది, ఈవిడ ఇంకెవరో!  పాత్రల మూలస్వభావాన్నే మార్చిపారేస్తే ఎల్లాగయ్యా?  కవి విరాట్‌ శిష్యుడు: మా గురువు గారు కొంత వైచిత్రి చూపారు. మీరది మరోలా అర్థం చేసుకోరాదు. విమర్శకుడు: అడవిలో సీత కట్టిన “చ

కృష్ణా జిల్లా కుటుంబం

  “కృష్ణా జిల్లా కుటుంబం” అన్న సినిమా చూడడానికి థియేటరుకు వెళ్ళారు సుబ్బారావు, పాపారావు. “గేందివయ్యా, గట్ల పరేషానవుతున్నవ్‌?” అంటోంది తల్లి పాత్ర. “ఏందిరా, కిండల్‌ బడ్తున్నావ్‌? లత్కోర్‌?” అంటున్నాడు హీరో. “ఏమ్‌టి నువ్‌ మాట్ లాడేద్‍? తోలు తీసి తప్పెట్‌ కేస్తా!” అంటోంది తండ్రి పాత్ర. “ఏంటి నాంగారు, ఏటంటన్నారు మీరు? నా మాటినుకొని ఆడ్నొగ్గేయండీ” అంటోంది చెల్లి పాత్ర. ఏంటండీ, ఒక్క పాత్రా కృష్ణా జిల్లా యాసలో మాట్టాడం లేదు? అన్నాడు సుబ్బారావు పాపారావుతో.  ఏదో ఒకటిలెండి, కనీసం తెలుగు మాట్లాడుతున్నాయి పాత్రలన్నీ. ఈ కుటుంబ సభ్యులంతా వివిధ జిల్లాల నుండీ, రాష్ట్రాల నుండీ వచ్చి కృష్ణా జిల్లాలో స్థిరపడ్డారు అనుకుంటే సరి, అన్నాడు పాపారావు తేలికగా.  మరి పిల్లల పాత్రలు కూడా వేరే వేరే యాసల్లో మాట్లాడుతున్నాయి కదండీ? అన్నాడు సుబ్బారావు పాపారావు సమాధానంతో సమాధాన పడలేక.  వారంతా వేరే వేరే జిల్లాలలోను, రాష్ట్రాల్లోను పెరుగుతూ అప్పుడప్పుడూ కృష్ణా జిల్లాకి వచ్చిపోతుంటారని అనుకుంటే సరి!  అన్నాడు పాపారావు సినిమాలో లీనమౌతూ.

పోనిద్దురూ, మనకెందుకు?

  ఈ విమర్శలు అవీ మీకెందుకు?  చక్కగా మీపాటికి మీరు మీకు తోచినవి రాసుకోండి. మరి ఆ పుస్తకాలను, రచయితలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారుగా? పోనిద్దురూ, మనకెందుకు? మరి ఆ పుస్తకాల గురించి ఆ రచయితలకు అవార్డులు వచ్చేలా పైరవీలు చేస్తున్నారుగా? పోనిద్దురూ, మనకెందుకు? పసలేని సాహిత్యాన్ని గొప్ప సాహిత్యంగా ప్రచారం చేస్తున్నారుగా?  పోనిద్దురూ, మనకెందుకు? ఆ పుస్తకాల్లోని భావాలకు, ప్రచారాలకు  కొంతమందైనా ప్రభావితం అవుతున్నారుగా?  పోనిద్దురూ, మనకెందుకు? ఈ నకిలీ సాహితీవేత్తల జోరులో అసలైన,అందమైన రచనలు ప్రచారం లేక, ఏ గుర్తింపు లేక మరుగున పడిపోతున్నాయి కదా?  పోనిద్దురూ, మనకెందుకు?  రచనల్లోని అసంబద్ధతలను ఎత్తి చూపడం సాహిత్యం చదివే వారి,సాహిత్యాన్ని సృజించేవారి బాధ్యత కాదా? పోనిద్దురూ, మనకెందుకు? ఈ ప్రచార హోరులో, నానావాదాల జోరులో సద్విమర్శ లేకపోతే సాహితీ డింభకాలు పెద్ద మనుషుల్లా సాహితీ పీఠాలెక్కి చెలరేగిపోతే  భాషకు, సాహిత్యానికి తీరని నష్టం కదండీ?  పోనిద్దురూ, మనకెందుకు?

చుక్కల పల్లకిలో!

  కొన్నాళ్ళు సినిమాలే చూసా. తరువాత? అందులో ఏమీలేదని తెలుసుకున్నా.  కొన్నాళ్ళు అమ్మాయిల వెంట తిరిగా.  తరువాత? అందులో ఏమీలేదని తెలుసుకున్నా.  కొన్నాళ్ళు సాయంకాలమైయ్యేటప్పటికి మందు కొడుతూ గడిపా.  తరువాత? అందులో ఏమీలేదని తెలుసుకున్నా.   ఏమీ లేదని తెలుసుకున్నావ్‌గా.   అవన్నీ మానేసావా మరి? ఎలాగూ సగం జీవితం గడిచిపోయింది కదరా, ఇంక అన్నీ మానేసి చేసేదేముందిలే అని ప్రస్తుతం సినిమాలు చూస్తూ, అమ్మాయిల వెనక తిరుగుతూ, సాయంకాలాలు మందు కొడుతూ కాలక్షేపం చేస్తున్నా. 

రామాయణ తాళ వృక్షం - 4

  విమర్శకుడు: వాల్మీకి రచనలో సీతా మహాసాధ్వి పతి ఎక్కడ ఉంటే అక్కడే తనకు స్వర్గమని రామునికి నచ్చజెప్పి రామునితో బాటే అడవి బాట పడుతుంది.  కవి విరాట్టు సృష్టించిన సీత, రాముడు తన తల్లిని చూసుకుంటూ ఇక్కడే అయోధ్యలోనే ఉండమంటే, అబ్బే, భర్త లేకుండా అత్తింటిలో ఉన్న స్త్రీని మరుదులు,అత్తలు చులకనగా చూస్తారని మహా గడుసుగా లాజిక్కు లాగుతుంది! పాత్రల మూలస్వభావాన్నే చంపివేసే అసమంజసమైన ఊహపోహలు.  కవి విరాట్టు శిష్యుడు: మా గురువు గారు రామాయణ రచనలో కొత్త పోకిళ్ళు పోయినారు. అది మీవంటి వారికి అర్థము కాదులెండి.  విమర్శకుడు: కౌసల్య ఎదలో గరడు కరడు                    లై పొంగు లొలయు పయస్స్వాదు నిర్జర                    నిర్ఝర ధారలు నిక్కి నిక్కి  కరళ్ళు కరళ్ళుగా పొంగుతాయా తల్లి పాలు ఎక్కడైనా?  పయస్స్వాదు నిర్జర నిర్ఝర ధారలట!  సున్నితత్వము చచ్చినది!  సౌకుమార్యము,సౌందర్యము వేయి వ్రక్కలైనవి ఈ ధారలలో!  కవి విరాట్టు శిష్యుడు: ఇవన్నీ అర్థము కావలెనన్నచో మీవంటి విమర్శకులు వేయి జన్మలెత్తవలెను.                విమర్శకుడు: పాపమా సీతమ్మ తల్లి అడవిలో నడువలేక నడువలేక నడుస్తూ అలిసిపోయి “ఆ చెఱువు ఒడ్డున కాసేపు విశ్రమిద్దామా” అని అ

రామాయణ తాళ వృక్షము - 3

  విమర్శకుడు: మీ గురువు గారి పద్యాలలో ఒక్కటైనా కుదరైన పద్యము ఉన్నదా? ఒక్కొక్క పద్యంలో నాలుగైదు “వాడు”లు, నాలుగైదు “నీవు”లు! అంతా అతుకుల బొంత యవ్వారము.  సుబాహు మారీచులా?  మారీచసుబాహులు కాదూ?  “ఏడగు లోకము”లేమిటయ్యా?  “ఏడు లోకము”లకు వచ్చిన తిప్పలా?  రామ!రామ!   కవివిరాట్‌ శిష్యుడు: మీ ఆక్షేపణలన్నీ ఉఫ్‌మని ఊది అవతల పారవేస్తారు మా గురువు గారు. మీలాటి విమర్శకులని సరుకు సేయరు వారు.  విమర్శకుడు: అన్ని పాత్రలలోను కవి విరాట్‌ గారే దూరి పాత్రల మూలస్వభావాలను మార్చివేయడం! హా!రామా!  అడుగడుగునా లౌక్యపు మాటలు, ఉపాలంభములు! ఆఖరికి ఆ రామచంద్ర మూర్తిని కూడా వదల్లేదు. నువ్వు నాతో అడవికి వస్తే కైకకు మూడు వరములిచ్చినట్లే అంటాడు సీతతో, లౌక్యమంతా ఒలుకబోస్తూ. రాముని పాత్రకే ఎసరు పెట్టిన కవి విరాట్టులు!  కవివిరాట్‌ శిష్యుడు: మా గురువు గారు రామాయణాన్ని విలక్షణంగా రాసి సలక్షణంగా పేరు తెచ్చుకున్నారని మీవంటి విమర్శకులకు అసూయ. విమర్శకుడు: అడవిలో ఉన్న సీతారామ లక్ష్మణులు “చెంబుతప్పెలలు భుజాన వేసుకొని ధనుర్బాణములు పూని” వెళ్ళారా? సూర్యవంశ రాజకుమారుల చేత వాల్మీకి కూడా చెంబులు,గరిటెలు, తప్పేలలు మోయించలేదే? ఏమిటయ్యా ఈ విపరీ

రామాయణ తాళ వృక్షము - 2

  విమర్శకుడు: రాముడు నాకు స్నానము అని దశరథుడన్నట్టు ఓ పద్యం. రాముడు స్నానమేమిటయ్యా? అర్థం పర్థం లేకుండా?  కవి విరాట్‌ శిష్యుడు: అదంతా మా గురువు గారి కవితాఝరి.  విమర్శకుడు: ఒకానొక చోట “దైత్యజంతువులు”  అని వ్రాసిరి మీ గురువు గారు.  జంతువులన్నీ దైత్యులా? అసలు దైత్యులకి జంతువులకి పోలికేమిటి? సాధు జంతువులు ఉన్నాయిగా ? అవన్నీ దైత్యులా? నువ్వు మనిషివా? పశువ్వా? అనడం ఉంది.  మానవత్వం పశుత్వం కన్నా గొప్పది అని మన భావన కనుక.  అలాగే మనిషివా రాక్షసుడివా అన్న మాట.  కానీ మరి  దైత్యులను జంతువులను పోల్చి ఎలా చెప్పడం?  ఇంత గందరగోళం అవసరమా పాఠకుడికి?  కవి విరాట్‌ శిష్యుడు: అదంతా మా గురువు గారి ఊహాశక్తి.  మీవంటి అజ్ఞానులకు అర్థం కాదు.  విమర్శకుడు: సరేనయ్యా. ఇది చెప్పు. మేనక ఒక దేవకన్య. విశ్వామిత్రుడు ఒక మహర్షి. ఇక వారిరువురి శృంగార వర్ణన మీ గురువు గారి చేతిలో పడి ఏమేమో అయ్యింది.  ఆ పాత చింతకాయ పచ్చడి వెలిగారమును అటుంచితే, మూల కథలో లేని విధంగా మీ గురువు గారి విశ్వామిత్రుడు పరమ నీచంగా పరమ అనౌచితంగా పరమ అసహ్యంగా కావ్యగౌరవానికి భంగం కలిగించేలా రసాస్వాదన అంతా విషమయం అనిపించేలా పరమ ధూర్తంగా, మేనకను, లంజియా! అంట

రామాయణ తాళ వృక్షము - 1

  విమర్శకుడు: ఇది వరకే చాలామంది రామాయణాన్ని ఎంతో సుందరంగా ఇంకెంతెంతో సురుచిరంగా వ్రాసి ఉన్నారు కదండీ.   మీ గురువుగారెందుకు మరలా వ్రాసినట్టు?  కవి విరాట్ శిష్యుడు: తిన్న చపాతీలే రోజూ ఎందుకు తింటున్నాము? తిన్న ఉప్మావే,తిన్న పెసరట్టే ఎందుకు తింటున్నాము? అందుకే రామాయణాన్ని మళ్ళీ వ్రాసానని మా గురువు గారు సెలవిచ్చారు. విమర్శకుడు: భోజనం చెయ్యడం,కాపురం చెయ్యడంలాంటి  హీనమైన ఉపమానాలేమిటండీ?  అవి భౌతికాలు.  అందరూ చేసేవి,చేయగలిగేవి. రామాయణం ఆధ్యాత్మికం.   రోజూ చేసే సంధ్యావందనమే మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్టే,  రోజూ చేసే ప్రాతఃపూజ ప్రతి రోజూ చేస్తున్నట్టే  రామాయణాన్ని మళ్ళీ నేను వ్రాస్తున్నాను  అంటే ఎంత అందంగా ఉండేదండీ?  కవి విరాట్ శిష్యుడు: తమరు నోరు మూయించండి.  మా గురువు గారిని సరి దిద్దే స్థాయి తమకు లేదు. విమర్శకుడు: కైక “అడవి కోడి” కూసినట్టుగా నవ్విందని వ్రాసారేమండీ విడ్డూరంగా? కేకయ రాజకుమార్తె, దశరథుని భార్య,మహా రాణి కైక. ఆవిడ “అడవి కోడి” కూసినట్టు నవ్వడమేమిటండీ? రామ!రామ!  కవి విరాట్ శిష్యుడు: మా గురువు గారు కొంగ్రొత్త ప్రయోగములు చేయుటలో దిట్ట.  విమర్శకుడు: కైక రాముడిని సీతను గదిలోకి తోయడమేమిటి,  మ

వెయ్యి గుళ్ళు ఒక్కసారి పేల్చితే!

  రారారా సిన్మాలో బ్రిటీషోడి ప్రతి తుపాకీ గుండు ఇంగ్లాండు నుంచి రావాలని, అంతుకే చానా ఖరీదని సెప్పారు గదన్నాయ్‌!   జాగ్రత్తగా అచితూచి వాడాలని అన్నారుగదన్నాయ్‌ ఆ సిన్మాలో?  మరి మల్లూరి మింద వెయ్యి గుండ్లు ఎట్టా పేల్చారన్నాయ్‌? వెయ్యంటే నిజంగా వెయ్యని కాదు తమ్మీ.  జనానికి బాగా గట్టిగా తాకాలని  అట్టా రాత్తారు.  అసలికి సైనికుడికి ఒక్క గుండు చాలు గదన్నాయ్‌ గురి జూసి కాల్చేదానికి? మరి ఒక్కడి మీద వెయ్యి గుండ్లు ఒక్కసారి పేల్చితే అని ఎట్టా పాట రాత్తారన్నాయ్‌?  వెయ్యంటే నిజంగా వెయ్యి గాదని సెప్పాగా తమ్మీ! మరి వెయ్యి గానప్పుడు వెయ్యని ఎట్టా రాత్తారన్నాయ్‌? జనానికి ఆవేశం,ఆక్రోశం వచ్చేదానికి అట్టా ఎక్కువ జేసి రాత్తార్రా తమ్మీ! అయితే నిజ్జంగా ఎన్ని గుండ్లు పేల్చుంటారన్నాయ్‌? తెల్వదురా. వెయ్యైతే అయ్యుండదు.  మరి వెయ్యి గాప్పుడు వెయ్యని ఎట్టా రాత్తారన్నాయ్‌? సెప్పాగదా తమ్మీ, జనానికి ఏడుపు రావాలని అట్టా రాత్తారు.  వెయ్యంటే వెయ్యని గాదు.  దేశం కోసం ప్రాణాలిచ్చాడు మల్లూరి.  అది నాటుకోవాల నీలోపల. తెల్సిందా? అవునన్నాయ్‌. ఏడుపొత్తాంది నాకిప్పుడు. వెయ్యి గుండ్లు ఒక్కసారి ఒక మడిసి మీద పేలిత్తే ఒళ్ళంతా జల్లెడైప

ABCD Corporate Hospital

  ఓరి ఎదవన్నరెదవన్నరెదవా! ఏందిరా అట్టా మిడి గుడ్లేసుకుని చూత్తావు. అమాయకుడికి అక్షింతలిత్తే ఆవలికిబోయి నోట్టో ఏసుకున్నాడంట.  జింతాతజితజిత జింతాతతా అనుకుంటా లోకంతో బాటు పోతా ఉండాల గానీ ఇట్టా ఆయుర్వేదం,హోమియోపతీ,సిద్ద వైద్యం,మట్టి తానాలు,సుక ప్రసవోలు అని కూసుంటే ఎట్టగవుద్ది రా,ఈ కార్పొరేటు కాలంలో? ఎవురో ఒకరూ ఎపుడో అపుడూ అనుకుంటా నువ్ ముందుకొచ్చినా?  అక్కన్న మాదన్న గార్లు అందలమెక్కితే సాటిసరప్ప చెరువు గట్టెక్కినాడంట. అట్టుంది నీ యవ్వారం.    అదేమంటే మీ మేనమామ శవాన్ని రెండ్రోజులు అయిసీయూ పెట్టినట్టు నాటకవాడి డబ్బుల్ గుంజారని గింజుకుంటవు. మరింత పెద్ద ఆసుపత్రి నడపాల్నంటే అట్టాటివి కొన్ని జెయ్యాల. అంత తిన్నంగ పోతా ఉన్నాదా లోకం? వంకర టింకర ఓ.వానీ తమ్ముడు సో.నల్లా గుడ్ల మీ.  తెల్సిందా?  ఇంకా మాట్టాడితే మీ నాయినికి గుండె పోటొత్తే ఈళ్ళు లచ్చల్ లచ్చల్ కర్చు జేయించి చివరాకరికి బాడీ ఇచ్చారంటవ్. ఆళ్ళేవన్నా దేవుళ్ళా? చావబోయే వోళ్ళని బతికిస్తాకి? అబ్బిగాడు పోతే ఆ పంచె నాదే అన్నాడని సామిత.    ఏడేడ్నో బోయి నానా తిప్పలు బడి ఇంతింతి బొక్కులు  నవిలీ  మింగీ  డిగ్రీలు తెచ్చుకోని అనేక సకం జుట్టు నెరిసినాక ఇశాలం

తాతాచారి బులుగు శారీ

  మన తాతాచార్యుల పుస్తకం “బులుగు శారీ” ని ఈసారి మన ఒక్క పొద్దు పత్రికలో ఆకాశానికి ఎత్తడం విజయవంతంగా పూర్తి అయ్యింది!   అది వరకు తాతాచారి “పద్య పావడా”, “వచన కోక”లను అంతరిక్షం కన్నా పైకి ఎత్తింది మన ఒక్క పొద్దు!   ఇంకా తాతాచరి విరచిత “రాయల రైక” కు బీభత్స అవార్డు వచ్చిందాకా కృష్ణ బిలాల్లోకి సైతం వినబడేలా అరిచి అరిచి ప్రచారం చేసింది మన ఒక్క పొద్దే! అంటే మన ఒక్క పొద్దు మాత్రమే అంటున్నా! అసలు పండితుడు కావడానికి కవి కానవసరం లేదు, రచయిత కానవసరం లేదు,  భాష మీద భక్తి అవసరం లేదు,  ప్రాచీన కవుల మీద గౌరవం అవసరం లేదు,  తెలుగు సంస్కృతి మీద ప్రేమ అవసరం లేదు,  దేశీయమైన భావనే అక్కర లేదు  అని మనకు అన్నివిధాలా బోధించింది మన గురువు గారైన తాతాచార్యుల వారేనని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను.  వారు ఉగ్గడించిన ఈ విషయాన్నే నా “ఆరు రోజుల్లో పండితుడు కావడం ఎలా?” అన్న వ్యాసంలో రాసేసి మన గురువర్యులు తాతాచారి పాదపద్మాలకు సమర్పించాను.   సాహిత్యంలో చెలామణిలో ఎలా ఉండాలో మనందరికీ నేర్పింది మన గురూజీనే. అది తల్చుకుంటుంటే నా సాహితీరోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి సుమా. అదిగదిగో భాషేష్‌కు,వెంకోజీకి సాహితీ భాష్పాలు రాలుతున్నాయి