భాస్కరభట్ల పాటలో సాహిత్యం


 

కొన్ని పాటలు వినకుండా పక్కన పెట్టేస్తాను,అలాగే వింటూ ఉండిపోతానేమోనని.
కొన్ని పుస్తకాలు మళ్ళీ తెరవడానికి సంకోచిస్తాను,
అలా చదువుతూ ఉండిపోతానేమోనని.
కొంతమంది మనుషులను పలకరించకుండా ఉండిపోతాను,
పలకరిస్తే ప్రేమలో పడిపోతానేమోనని.

అల్లిబిల్లి ఊహాప్రపంచాలలోకి విసిరివేయడానికి పైవాటిల్లో ఒక్కటి చాలు.
ఊహా ప్రపంచం రెక్కలనిస్తే,వాస్తవ ప్రపంచం అప్పుడప్పుడూ కాళ్ళు విరగ్గొడుతుంది. 
మీరు మళ్ళీ కవయిత్రిలాగే ఆలోచిస్తున్నారు అని శ్రేయోభిలాషి అయిన కొలీగ్‌ ఒకరు విసుక్కుంటూ ఉండేవారు నన్ను. 
అయితే ఊహాప్రపంచం చేయగల మేలు ఒకటి ఉంది అది కఠినమైన ఈ ప్రపంచపు దోషాలనించి రక్షణ కవచంగా మనసును కాచడం. 

అలా వింటున్న కాసేపైనా ప్రియభావన కలిగించగల పాట ఇది. నాకు తెలియదు,భాస్కరభట్ల గారు ఇంతమంచి సాహిత్యం రాయగలరని.

ఒక లాలన ఒక దీవెన 
సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన 
చిగురించదా పొరపాటునా

ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ
కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ

పెదవంచు మీదా నవ్వునీ పూయించుకోడం నీ పనీ
నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమనీ

ఊహాప్రపంచంలో కాసేపైనా విహరింపచేయగలిగేదే ఉత్తమ సాహిత్యం. ఈ పాట తప్పక ఆకోవలోకే వస్తుంది. 






ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు