పోస్ట్‌లు

సెప్టెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

Two poems

  సఖియ రావోయి చందమామ నీ వెన్నెల కౌగిట్లో మద్యం సేవిస్తాను చంద్ర కిరణాల వేళ్ళని ఇలా ఇవ్వు వెచ్చని వూపిరుల హుక్కా అందిస్తాను నీ మచ్చల చెంపని చూపించవోయ్ నిప్పు రవ్వల చిటికెలు వేస్తాను ముద్దెట్టు నా మెడ వొంపులో- నిన్ను సెగలు కక్కే సూర్యుణ్ణి చేస్తాను. కవిత రాయి  మబ్బులని పేర్చి లిఖించు ఏవో కొండగాలులలో అవి చినుకులై రాలి లోతైన లోయలలో మొలకలై లేస్తాయి. ఆ సడి లేని అడవి దారుల్లో అందుకో ఇక ఏదో ఒక గాలి పాటని- పచ్చని చెట్లు మబ్బులని తాకి నిద్ర మత్తు నేల గుండెల మీద రంగు రంగుల పూలు రాల్చి తడి ముద్దులు కానుకిస్తాయి.

భాస్కరభట్ల పాటలో సాహిత్యం

చిత్రం
  కొన్ని పాటలు వినకుండా పక్కన పెట్టేస్తాను,అలాగే వింటూ ఉండిపోతానేమోనని. కొన్ని పుస్తకాలు మళ్ళీ తెరవడానికి సంకోచిస్తాను, అలా చదువుతూ ఉండిపోతానేమోనని. కొంతమంది మనుషులను పలకరించకుండా ఉండిపోతాను, పలకరిస్తే ప్రేమలో పడిపోతానేమోనని. అల్లిబిల్లి ఊహాప్రపంచాలలోకి విసిరివేయడానికి పైవాటిల్లో ఒక్కటి చాలు. ఊహా ప్రపంచం రెక్కలనిస్తే,వాస్తవ ప్రపంచం అప్పుడప్పుడూ కాళ్ళు విరగ్గొడుతుంది.  మీరు మళ్ళీ కవయిత్రిలాగే ఆలోచిస్తున్నారు అని శ్రేయోభిలాషి అయిన కొలీగ్‌ ఒకరు విసుక్కుంటూ ఉండేవారు నన్ను.  అయితే ఊహాప్రపంచం చేయగల మేలు ఒకటి ఉంది అది కఠినమైన ఈ ప్రపంచపు దోషాలనించి రక్షణ కవచంగా మనసును కాచడం.  అలా వింటున్న కాసేపైనా ప్రియభావన కలిగించగల పాట ఇది. నాకు తెలియదు,భాస్కరభట్ల గారు ఇంతమంచి సాహిత్యం రాయగలరని. ఒక లాలన ఒక దీవెన  సడిచేయవా ఎద మాటునా తియ తీయని ప్రియ భావన  చిగురించదా పొరపాటునా ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ పెదవంచు మీదా నవ్వునీ పూయించుకోడం నీ పనీ నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమనీ ఊహాప్రపంచంలో కాసేపైనా విహరింపచేయగలిగేదే ఉత్తమ సాహిత్యం. ఈ పాట తప్పక ఆకోవలోకే వస్తుంది.