పోస్ట్‌లు

జూన్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

యాపిల్లోంచి యాపిల్

గుర్రాన్ని దౌడు తీయిస్తూ గుర్రంలాంటి అబ్బాయి యాపిల్ పళ్ళ బుట్టతో యాపిల్లాంటి అమ్మాయి గుర్రం మీద అబ్బాయికి ఎదురుగా యాపిల్ పండు అమ్మాయి వస్తే గుర్రం ఆగిపోయింది యాపిల్ పళ్ళు దొర్లిపోయాయి అమ్మాయి గుర్రం ఎక్కి మాయమైయింది అబ్బాయి యాపిల్ పళ్ళు ఏరుతూ కూచున్నాడు చుక్కలు పొడిచేదాకా. రోజులు గడిచాయి ఏళ్ళూ దొర్లాయి చుక్కలు రోజూ పొడుస్తూనే ఉన్నాయి ఓ రోజు అబ్బాయి పచ్చ గడ్డిలో పడుకుని చుక్కల్ని చూస్తూ విచారంగా ఓ యాపిల్ని కోస్తే ఆశ్చర్యం! యాపిల్ పండులోంచి యాపిల్ అమ్మాయి గుర్రం ఎక్కి బయటికి దూకి వచ్చింది!

దైవం

కడలి అడుగున వెలిగే చేప కడుపు లోపల తిరిగే పాప రక్తమంటిన సింహపు కోర చచ్చిన దుప్పి జాలి మోర గొంతు చీల్చే హైనా కన్ను ఒడ్డున మొసలి గొగ్గిరి వెన్ను కృష్ణ బిలం రాక్షసి నోరు దడ దడ ఊపే తుఫాను హోరు పిడుగుపాటుకి కూలే వృక్షం రాలే ఉల్క ఊగే పైరు రేగే ఆకలి ఈయనేనట అన్నీ. పువ్వుల విసురుకి గంట గణగణలకి తొణకడసలే అగరొత్తుల పొగల్లోంచి చూస్తూన్నాడు నా ఉలికిపాటు కళ్ళల్లోకి.

కవిత్వం గురించి కవిత

  ఒక్కోసారి కవిత్వ పాదం ఒకటి తడుతుంది కానీ ముందుకు సాగదు, ఎంత ధ్యానించినా. అపుడు బుద్ధి బయటకు వస్తుంది,నేను సహాయం చేస్తానని. తన తెలివితేటలతో రకరకాల సలహాలు ఇచ్చి మిగిలిన పాదాలను పూర్తి చేస్తుంది. కానీ అంతా ఏదో అతుకుల బొంతలా మనకే లోలోపల అనిపిస్తూ ఉంటుంది. సహజంగా లేదని, కవితాధార కాదని, ఎలాగోలా పూరించామని కొరతగానే ఉంటుంది. అంటే కవిత్వపు గువ్వ తలపోతల వల్ల ఎగిరిపోయిందన్న మాట.   దాన్ని గురించే ఈ కవిత- ఆగిన పాట ................. విరగ గాచి ​కనులు మూసి ​వేచి ఉంటాను పసిమి వన్నెల కవిత గువ్వ వచ్చి వాలి గొంతు ఎత్తి ఉండి ఉండి పాట పాడితే పులకలెత్తి పూలు రాల్చాను పాట మాని ఊరికే అది కొమ్మకొమ్మకి దూకుతోంటే కులాసాగా పొడుస్తోంటే పాట ఆగితే నిద్ర లేచే తలపోతలు నాగుబాములు పొంచి పొంచి పాకి వచ్చి ఒక్క పట్టున మింగబోతే పాము చెవుల చిట్టి గువ్వ వదిలి నన్ను ఎగిరిపోతో ఎన్నడూ ఇక తిరిగి రానని కేక వేసింది.

దిన పత్రిక

ఇది రాత్రంతా నిద్ర పోదు ఉదయాన్నే పేజీ పేజీకి వేయించిన అప్పడాల్లాంటివి వేపాకు పచ్చడిలాంటివి సున్నుండల్లాంటివి జీడి పాకంలాంటివి వార్తలు పట్టుకొస్తుంది. తెల్లారితే ఇది ఇక నిద్రే పోతుంది పేజీ పేజీకి సాలె గూళ్ళే ఉంటాయి సాలె గూళ్ళల్లో చచ్చిన సాలీళ్ళు.

నేనే కవిత్వాన్ని

  నేనే కవిత్వాన్ని నిలబడ్డ సత్యాన్ని నిలువలేని హృదయాన్ని రాణిగారి ఒంటి గులాబీ అత్తరుని ఏడు మల్లెలెత్తు కోర్కెల మెత్తని వేయి శరత్తుల వెన్నెల మత్తుని నడిమి సూరీడి వేడి ఆవులింతని సోమరి కలల బికారి కాపరిని చిత్త భ్రాంతుల బంతులాటలో ఆనంద నర్తనని ఎద లోయలో మాగన్ను పాముని మది కొలనులో రహస్యాలు మింగిన చేప పిల్లని అక్షరాల వనంలో విహరించే వ్యాఘ్రాన్ని నిలబడ్డ సత్యాన్ని నిలువలేని హృదయాన్ని కవిత్వాన్ని.

తోపులో పిల్లలు

పోగు చేసేం ఎండిన కాయలు వాటి టోపీలు ఎండు పుల్లలతో ఎండను కాచేం మట్టి గీతలు గీసేం చెట్టు మొదల్లో కూలబడి పుల్ల కలంతో నీడల్ని కోసేం. దులిపేం చొక్కాల మీది గండు చీమల్ని కంగారు గాలిని తోసేం ఎండ దుమ్ముని మీద పోసుకుంటూ పొద్దు పచ్చిక మేసేం. ఎగజల్లేం చూపులు ఎగిరే తూనీగపై పంజా విసిరే టామీని దువ్వేం చెట్ల గుసగుసకి కువకువ సవ్వడికి రిక్కించేం చెవులు కోతుల కొక్కిరింతకి నవ్వేం. నవ్వేం చాలా ఊరూరికే నవ్వేం.

విందు

  జిలుగు చీరంచున వాలనీ  కలకల  నవ్వులని అద్దుకోనీ    బుగ్గలని  మోహాల  లేపనాలని   మసక దీపాల  వెలుగుని దొంగిలించనీ  చూపుల  కౌగిలింతని వగలు పోనీ        చెవి లోలాకులని     పాటల చెలమల్లో   తడవనీ కాళ్ళని హొయలు పోనీ  వేళ్ళని     ఆడనీ  ఇరుసుని  నడుముని  షాండ్లియార్ చిరు గోళాల  చిత్ర కాంతుల్లో    తలకెక్కనీ    జీవన మధువుని ఇంకా  ఇంకా       చుక్కా  చుక్కా.

చూపు

ఎముకలకి  చర్మాన్ని తొడిగిన   ఒంటిని  ఆ ఒంటిని  అలంకరించిన  మాసికల చొక్కాని       రిక్షా తొక్కి తొక్కి  నెర్రెలు విచ్చిన  బతుకుని చూసి   చేప కళ్ళ   కొస కంట  జాలి చుక్క  విడిచి  గిరుక్కున తిరిగి పోబోతుంటే  ఆమె కాలుతోన్న బీడీని  పొగ చూరిన  పెదాల కింది  గారపళ్ళతో  బిగించి  గుంట కళ్ళు చికిలించి  పిల్ల చెక్సీగా ఉన్నాది   అన్నాడు  వాడు.