ఒక రచయిత మనోవేదన


 నాకు చిన్నతనం నుండి ఎన్నో ఆదర్శాలుండేవి. పుస్తకాలు బాగా చదివే వాడిని. కథలు వ్రాయాలన్న కుతూహలం ఉండేది. ప్రయత్నిస్తూ ఉండేవాడిని కూడా. 


మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని నా కోరిక. 

అది చెబితే ప్రేమ గీమ అంటే కాళ్ళు విరగ్గొడతాను వెధవా అని మా నాన్న కేకలు వేసాడు. ఆ బాధతో “ ప్రేమించు-పెళ్ళాడు” అన్న కథ రాసి బ్రాందీ జ్యోతికి పంపితే ఆ కథ చదివి ఇంటినించి లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నామని ఎంతోమంది ఉత్తరాలు రాసారు. నాకెంతో ఆనందం వేసింది. 

పోనీ మా కులంలోనే బీదింటి పిల్లను చేసుకుందామనుకున్నాను. 

ఏం తిక్క తిక్కగా ఉందా? నీ చదువుకి తడిసి మోపెడైంది. అదంతా కట్నం కింద లాగుదామని నేనాశ పడుతుంటే వెర్రి వాగుడు నువ్వూను. నోర్మూసుకుని నేను చెప్పిన పిల్ల మెళ్ళో తాళి కట్టు అని అరిచాడు మా నాన్న. ఆ బాధతో డబ్బున్న పెద్ద ఉద్యోగస్తుడు బీదింటి పిల్లను చేసుకున్నట్టు “బీదింటి పెళ్ళికూతురు” అన్న కథ రాసి విస్కీ ప్రభకు పంపితే ఎంతోమంది పెళ్ళికాని బీదింటి అమ్మాయిలు నాకు ఉత్తరాలు వ్రాసారు. అవి చదువుని ఎంతో ఆనందించా. 

మా నాన్న చెప్పినట్టు విని మా కులంలోనే డబ్బున్న అమ్మాయిని చేసుకోక తప్పింది కాదు. ఆ పిల్లకు చీరలన్నా నగలన్నా పిచ్చి. చీరల నగల వ్యామోహం ఉన్న ఆడవారంటే నాకు తగని చిరాకు. వద్దని వారించే వాడిని. ఆఫీసరు భార్యని, అందుకు తగ్గట్టు దర్జాగా ఉండొద్దు? అనేది. 

ఆడవారూ,చీరల వ్యామోహం, నగల వ్యామోహం వద్దు అని “నిరలంకార సుందరి” అన్న కథ రాసి షాంపైన్‌ మిత్ర పత్రిక్కి పంపితే ఆ కథ చదివిన ఎంతోమంది నా లేడీ ఫాన్సు తాము ఆ కథ చదివినప్పటినించీ చీరలు కొనడం మానేసామని, నగలు కొనడం మానేసామని చెప్పడం నాకు ఎంతో తృప్తినిచ్చింది. 

నాకు మాత్రం మాఆవిడతో చీరల దుకాణాలకు, నగల దుకాణాలకు వెళ్ళక తప్పింది కాదు. ఆ దుకాణాల ముందు అడుక్కునే బిచ్చగాళ్ళని చూసినప్పుడు నా మనసుకు ఎంతో వేదన కలిగేది. రూపాయో అర్ధో వారి చేతిలో పెడదామనిపించేది. కానీ, పెద్ద ఆఫీసరునాయె. జేబులో పెద్ద నోట్లు తప్ప చిల్లర పైసలు ఉండేవి కాదు. మా ఆవిడ డిజైనర్‌ నగలు సెలెక్టు చేయడంలో బిజీగా ఉంటే నేను షాపు అద్దాల్లోంచి బిచ్చగాళ్ళను చూస్తూ ఎంతో ఆవేదన చెందేవాడిని.

 ఓ రోజు ఓ బిచ్చగాడు నన్ను చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేను. వాడికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అని మనసుకు బలంగా అనిపించింది. జేబులు తడిమితే లక్కీగా ఓ ఐదు పైసల బిళ్ళ తగిలింది. వెంటనే అది వాడి చేతిలో పెట్టాలని షాపులోంచి బయటికి పరిగెత్తాను. కానీ అప్పటికే వాడు వెళ్ళిపోయాడు. నాకు ఎంతో ఆవేదన కలిగింది. ఇంటికొచ్చి ఆ సంఘటనపై “బిచ్చగాడిని చేరని ఐదు పైసల బిళ్ళ” అన్న కథ రాసి బ్రాందీ జ్యోతికి దీపావళి కథల పోటీకి పంపితే ప్రథమ బహుమతి కింద ఆ రోజుల్లో వంద రూపాయలు వచ్చింది. దాంతో మా ఆవిడ కిలో వెండి కొని ఆనందించింది. అది చూసి నేనూ ఆనందించాను. ఆవిడ ఆనందమే నా ఆనందం కదా. 

నా లేడీ ఫాన్స్ లో ఒకావిడ నాకు రక్తంతో ఉత్తరాలు వ్రాసేది. ఆవిడ పేరు చాందిని. ఆ ఉత్తరాలు రహస్యంగా చదువుకుని ఆనందించి మా ఆవిడకు తెలియకుండా దాచిపెట్టేసే వాడిని. ఓ రోజు నన్ను వెతుక్కుంటూ మాఇంటికి కూడా వచ్చేసింది. అమ్మో! మా ఆవిడ చూస్తే? అందుకని, దుర్మార్గుడిని, చాందినిని అవమానించి పంపించేసాను. ఆ రోజునుండి ఈ రోజు వరకూ మళ్ళీ కనపడలేదు తను. నేను మాత్రం ఆ తరువాత తన గురించి ఎన్నో కథలు రాసాను. ఆ కథలకు ఎన్నో బహుమతులు వచ్చాయి. నాకు ఎంతో పేరు వచ్చింది.

నేను లంచాలు ఇవ్వడానికి వ్యతిరేకిని. కానీ పనులు అవడానికి ఇవ్వక తప్పింది కాదు. తీసుకోవడానికి కూడా వ్యతిరేకినే. కానీ తీసుకోక తప్పింది కాదు. అందుకే ఆ బాధతో  “అవినీతి భారతంలో లంచాల పర్వం“ అన్న పెద్ద కథ వ్రాసి విస్కీ ప్రభ పత్రిక్కి పంపితే, ఆ కథ ఆ రోజుల్లో పెద్ద తుఫాను సృష్టించింది. 


ఇప్పుడు నాకు ఎనభై ఏళ్ళు. ఇప్పటికీ నా కథల గురించి నా అభిమానులు ఉత్తరాలు రాస్తుంటారు. ఉదయాన్నే కిటికీ తెరవగానే పావురాల గుంపు ఒకటి కిటికీ దగ్గర కూర్చుని ఉంటుంది. వాటి కాళ్ళకు వివిధ ప్రాంతాలనుండి నా అభిమానులు వ్రాసిన ఉత్తరాలు ఉంటాయి. మా ఆవిడ వంట వాడితో చేయించిన టిఫిన్‌ చేస్తూ ఆ ఉత్తరాలు చదువుకోవడం రోజూ నా ఉదయపు అలవాటు.

అన్నట్టు ఈ మధ్య నన్ను కదిలించి వేసిన ఓ సంఘటన జరిగింది. నేనో రోజు నా ఫారిన్‌ ఇంపోర్టెడ్‌ ఏసీ కారులో వెళుతుండగా రోడ్డు పక్కన తెలిసిన మొహంలా అనిపించి మా డ్రైవరును కారు ఆపమన్నాను. చాందినీ! నా హృదయం ఆనందంతో ఉప్పొంగింది.

చేతిలో కూరల సంచీ కాబోలు, ఎర్రటి ఎండలో నడుచుకు పోతోంది. కారు అద్దం దించి, చాందినీ, నేను నీ అభిమాన రచయితను. అప్పట్లో నువ్వు నాకు రక్తంతో ఉత్తరాలు రాసే దానివి అన్నాను ఎంతో అభిమానంగా. నేను ఏ గాడిదకీ ఉత్తరాలు రాయలేదు అంది ఒక క్షణం కూడా నిలబడకుండా. నాకు తల కొట్టేసినట్టైంది. ఎంత పొగరు! కారు దిగి చెంప పగలకొడదామనుకున్నా. కానీ నేను చాలా మంచివాడిని, సంస్కారవంతుడినీ కాబట్టి అలా చేయలేదు. 

చాందినీ నన్ను చూడగానే మునుపటిలాగా అగ్గగ్గలాడి ఉంటే పదో పరకో చేతిలో పెట్టి అప్పుడప్పుడూ కలుద్దామని చెప్పాలనుకున్నా. ఇప్పడా అవకాశం లేకపోయింది. చాలా కోపం వచ్చింది. బాధ కలిగింది. ఇంటికి వెళ్ళి బెడ్‌ రూంలో వెక్కి వెక్కి ఏడ్చాను. యూరోప్‌ ట్రిప్‌కి బట్టలు సర్దుకుని రెడీ అవుతుంటే‌ ఈ ఏడుపు ఏమిటని మా ఆవిడ ఆశ్చర్యపోయింది. ఆవిడకు నా బాధ చెప్పుకోలేను. 

వెంటనే కాగితం కలం తీసుకుని “కృతఘ్నరాలైన అభిమాని” అని కథ రాసి వైన్‌ చిత్ర పత్రికకు పంపితే ఎంతోమంది అభిమానులు, ఆ కృతఘ్నురాలు ఎవరనీ, ఇది నిజంగా జరిగిందా అని ఉత్తరాలు వ్రాసారు. ఆ ఉత్తరాలు నా మనసుకు ఎంతో తృప్తినిచ్చాయి. 

మా యూరోప్ ట్రిప్‌ కి యూ ఎస్‌ నుండి పిల్లలు కూడా జాయిన్‌ అవుతున్నారు. అది అయిపోయి ఇంటికి వచ్చాక నా జీవిత చరిత్ర వ్రాసి జాతికి అంకితమిద్దామనుకుంటున్నాను. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన