The side effects of సౌందర్య దృష్టి

 



ఏమిటీ ఈమధ్య పగలు రాత్రీ కూడా నల్ల కళ్ళజోడుతో కనిపిస్తున్నావ్‌? కంటి జబ్బా? 

ఓ రకంగా అలాంటిదేరా!

అయ్యో! అలాగా! ఎప్పట్నించీ?

చాలా యేళ్ళుగా ఉంది.
 రెమెడీగా నల్ల కళ్ళజోడు పెట్టుకు తిరుగుతున్నా. 

అయ్యో, ఇంతకీ ఏమిటో ఆ జబ్బు?

సౌందర్య దృష్టి!

హహ, అది జబ్బు కాదే? 

జబ్బు కాక వరం అనుకున్నావా? చెబుతా విను. 

ఆ మధ్య సాహితీ సభలో ఓ అందమైన లేడీ కనిపించింది. శంఖంలాంటి మెడ.
 వెంటనే నాకు “కంబు సౌందర్య మంగళము గళము” అన్న పద్యం గుర్తొచ్చి ఆ పద్యాన్ని,ఆమె కంఠాన్ని పోల్చుకుంటూ చూస్తుండి పోయానా, ఆ లేడీ నా జడ్డి చూపు చూసి చిరాగ్గా మొహం పెట్టి పోయింది! 

అరెరే! 

ఇంకా విను. ఆ మధ్య ఓ లేడీ కన్నులు చూసి ముచ్చట పడ్డా. అంతలో ఆమె కోపంగా చూసింది. అదీ నాకు ముచ్చటగానే తోచింది. వెంటనే నాకు “హెచ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల గుంకుమపత్ర భంగ సంజనిత నవీనకాంతి” అన్న పద్యం గుర్తొచ్చి అలా చూస్తుండి పోయా! ఆవిడ గారు నామీద చూపులతోనే నిప్పులు కురిపించి పోయింది!

ఓరినీ పద్యాలు దొంగలెత్తుకెళ్ళా! 
అలా లేడీస్‌ వంక జెడ్డి చూపులు చూస్తే అపార్థం చేసుకోరూ? 
నీ సౌందర్య దృష్టి common sense ని అధిగమించిందన్న మాట!

ఒక్క లేడీసే కాదురా, జంట్సూ అపార్ధం చేసుకుంటున్నారు. 
ఆ మధ్య ఓ సభలో ఆరడుగుల అందగాడిని చూసి ఆనందించా. మూర్తీభవించిన సౌందర్యమా అన్నట్టు నయన మనోహరంగా ఉన్నాడతడు. వెంటనే ఈ పద్యాన్ని గుర్తు చేసుకొని ఆనందించా-

త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప, ప్రాభాత నీ
రజ బంధు ప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్‌


ఆ పుంసామోహన రూపుని చూస్తూ ఈ పద్యాన్ని ఆనందిస్తున్నానా, నా వెర్రి చూపులు అతనికి ఇబ్బంది కలిగిస్తున్నట్టు మొహం పెట్టేడు అతగాడు.

దాంతో నా ఈ సౌందర్య దృష్టి వల్ల చులకనై పోతున్నానని గట్టిగా తోచింది.  అప్పట్నించీ నల్ల కళ్ళజోడు తగిలించి పరువు కాపాడుకుంటున్నా! 

బావుందిరా! 
సౌందర్య దృష్టి చివరకు నిన్ను గుడ్డి వాడిని చేసిందన్న మాట. 
నల్ల కళ్ళజోడు స్టైల్‌గా ఉందిలే! ప్రొసీడ్‌! 





ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు