పద్యం కట్టిన వాడే పోటుగాడు

 


వచన కవి సుబ్బారావు కాలంలో అలా అలా వెనక్కి వెళ్ళి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళిపడ్డాడు. 

అక్కడో అందమైన దేవదాసీ పూలసజ్జ చేత పుచ్చుకుని దేవళానికి పోతూ కనిపించింది. వెంటనే-

నీ కళ్ళు
నీ కళ్ళు
నా వలపు
వాకిళ్ళు

చెక్కిళ్ళు
చెక్కిళ్ళు
కోర్కెలకు
ఎక్కిళ్ళు

నీ ఒళ్ళు
నా ఒళ్ళు 
ప్రేమలకు
పరవళ్ళు


అంటూ ఓ కవితను ఆశువుగా చెప్పేశాడు.

పద్యం కట్టడం రాదా స్వామీ? అని ఎకసెక్కెమాడింది ఆ దేవదాసి. 

ఆ మాటకు సిగ్గు పడిపోయాడు సుబ్బారావు.


వన్నెల
నెరజాణలు
మీ చిన్నెలు
పదివేలవి
చిలువలు
పలువలు

ఈ మోహము
నాకేల 
హా!
ఇచ్చకపు
మాటలు

పోయి 
వచ్చెద
మరి
ఇంతి,
నా దారి
నాది. 


అంటూ అక్కడినించి కదిలాడు. 


అలా విజయ నగర వైభవం చూస్తూ ఆ వీథులను, ఆ దేవాలయాలను, ఆ మేడలను, ఆ సైనికులను ఆ వైభవాన్ని చూస్తూ చూస్తూ కవిని అని ద్వారపాలకులకు చెప్పుకుని రాయలవారి ఆస్థానంలోకి ప్రవేశించాడు. 


సింహాసనం మీద కూర్చున్న రాయలవారిని చూడగానే, సుబ్బారావులోని కవి ఉవ్వెత్తున పైకిలేచి, 



అటు చూడు
ఇటు చూడు
ఆకాశ హర్మ్యాలు
జేగీయమానాలు
రాయల దేశమిది
రత్న గర్భ!

ఎదురు లేని
దిగ్విజయ
 నగరమిది
సాహో!
గజపతులు
సురపతులు
నీ కాళ్ళ
కింద! 

జయహో!
దేవ రాయ!
జాతి వెలుగు
సరిలేరు మరి
నీకు సార్వభౌమా!

అంటూ చేతులు జోడించి ఓ కవితను ఆశువుగా చెప్పేశాడు.

అది విని ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలతో సహా సభాసదులంతా ఫక్కున నవ్వారు. 

ఉత్పలమాలలో,చంపకమాలను కలిపి అందులో సీసం పోసుకుని త్రాగినట్టుంది ప్రభూ! అని ఛలోక్తి విసిరాడు వికటకవి.

రాయలవారు సైతం నవ్వాపుకోలేక, ఏమిటిది కవిగారు? ఏ ఛందస్సు? అని అడిగారు.

ఇది పద్యం కాదు ప్రభూ, వచన కవిత్వం అని ప్రసిద్ధి అన్నాడు సుబ్బారావు నసుగుతూ.

భళి!భళి! మీ వేషము,మీ తెలుగు కొంత విదేశీయముగనున్ననూ తెలుగు కవిత్వమునకు కొత్త పుంత బాగానే ఉన్నది. కవిత్వము చెప్పుటలో ఇదియొక పద్ధతి అనుకుందుము అంటూ సుబ్బారావును సత్కరించాడు రాయలు.

సుబ్బారావు తిరిగి వెనక్కి మనకాలంలోకి వచ్చి రాయల వారితో తాను దిగిన సెల్ఫీని, తను పొందిన సత్కారాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టుకుని గొప్పలు పోయాడు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన