ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

 


నేను ఏ కథ రాసినా అన్నీ తిరగ్గొడుతున్నార్రా సంపాదకులు!
అన్నీ మంచి కథలే కానీ ఈ పత్రికల వాళ్ళకే నచ్చట్లేదు. 
ఏం చెయ్యాలో తెలియడం లేదు.

అలాగా. ఏదీ నువ్వు పత్రికలకి పంపిన కథల్లో ఒక కథ చెప్పు?

ఆమధ్య ఒక కథ రాసి బ్రాందీ జ్యోతికి పంపా. టూకీగా చెప్తా విను.

అనగనగా ఓ గుడి పూజారి. అర్చకత్వం చేసేవారికి ఈమధ్య పిల్ల దొరకడం కష్టంగా ఉంది కనుక అతనికి ఎన్నాళ్ళైనా పెళ్ళి కాలేదు. 

అతని తల్లి చనిపోతూ, చనిపోతూ ఎప్పటికైనా నీకు పెళ్ళైతే 
నా కోడలికి ఈ నగలు పెట్టు అని చెప్పి కన్ను మూసింది. 
ఆ తరువాత కాలం గడిచి అతను నలభై దాటినా అవివాహితుడుగానే ఉండిపోయాడు. చివరకు ఇక తనకు పెళ్ళి కాదని నిర్ణయించుకొని ఆ నగలను భద్రాచలం రామయ్యకు, సీతమ్మకు సమర్పిద్దామని రైల్లో బయల్దేరాడు. 
దారిలో తాను చూసిన సాటి ప్రయాణీకుల మాటలు అవీ అతన్ని ప్రభావితం చేస్తాయి. తనను పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకి మళ్ళించడానికే ఆ భగవంతుడు తనకు వివాహం అనే ఉచ్చు తగిలించి సంసార సాగరంలోకి తోసివేయకుండా కాపాడాడన్న నిశ్చయానికి వచ్చి, భద్రాచలం చేరుకుని తన తల్లి ఇచ్చిన నగలను రామయ్యకు,సీతమ్మకు సమర్పించి, అటునించి అటే సన్యాస దీక్ష తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. 

ఇదీ కథ సంక్షిప్తంగా. ఎలా ఉంది?

చంపావ్‌,పో. అసలు దినుసులేవీ? 

అసలు దినుసులేమిటి?

అభ్యుదయం, ప్రగతి శీలత!

ఆ దినుసులు లేనిదే బ్రాందీ జ్యోతి కాదు కదా, గల్లీ పత్రిక కూడా నీ కథ వెయ్యదు!

హూ, నాకూ అనుమానం వచ్చే, ఈ కథనే మార్చి వ్రాసి ఒక్క పొద్దు పత్రికకు పంపా. వాళ్ళూ ప్రచురించ లేదు. మార్చి పంపండి,వేస్తామన్నారు. అంత మంచి కథలో ఏం మార్చాలో నాకు అర్థం కాలేదు. 

ఈ కథనే మార్చి పంపావా? ఏం మార్చావో చెప్పు?

పెళ్ళి కాని పూజారి అలా రైల్లో వెళుతుండగా ఒక పెళ్ళి కాని సాఫ్ట్వేర్‌ బ్రాహ్మల అమ్మాయే కలుస్తుంది. చదువుకున్న పెళ్ళి కొడుకులతో పెళ్ళి చూపులతో విసిగిపోయి ఉంటుంది. మన హీరో మాటా మర్యాదా మన్నన నచ్చి అతన్నే పెళ్ళి చేసుకుంటానని, అతని జీవన విధానాన్ని తన జీవన విధానంగా చేసుకుంటానని చెబుతుంది. అలా వారి పెళ్ళి కుదరగానే ఆ అమ్మాయికి తన తల్లి నగలు ఇచ్చి అలంకరిస్తాడు. 
ఇదీ కథ, సంక్షిప్తంగా. 
ఇందులో నువ్వు చెప్పిన అభ్యుదయం ఉందిగా? సాఫ్ట్వేర్‌ అమ్మాయి గుడి పూజారిని చేసుకోవడం? మరి ఎందుకు ప్రచురించలేదంటావ్‌?

హహ, పిచ్చివాడా, ఇది వారి దృష్టిలో అభ్యుదయమే కాదు!

నీ కథ ప్రచురింపబడాలంటే ఏం చెయ్యాలో చెబుతా. 

1. అలా నగలను తీసుకెళుతున్న పూజారికి రైల్లో ఓ అభాగ్యురాలు పరిచయమౌతుంది. ఆ అభాగ్యురాలి కథ విని ఆమెని ఉద్ధరించడానికి దేవుడి కోసం తీస్కెళ్తున్న తన తల్లి నగలను ఆమెకిచ్చి ఆమె కన్నీళ్ళు తుడుస్తాడు. ఆమె ఆ నగలన్నీ తీసుకుని పక్క స్టేషనులో దిగిపోతూ ఇతని కోసం ప్రార్థన చేస్తానని కన్నీళ్ళు పెట్టుకోవడంతో కథ ముగుస్తుంది. 

అంటే ఆవిడది వేరే మతమా? 

సరిగ్గా చెప్పావ్‌! ఒకే మతం వాళ్ళకి, ఒకే కులం వాళ్ళకి సహాయం చేస్తే అందులో అభ్యుదయం, ప్రగతి శీలత ఉండవు. ఓకే? 

ఇంకోరకంగా కూడా ఈ కథని అభ్యుదయ కథగా మార్చ వచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు కథ రాస్తే నువ్వు అభ్యుదయ రచైతగా ప్రఖ్యాతి పొందుతావు. కేవలం ఈ ఒక్క కథతోనే నీకు బీభత్స అకాడెమీ అవార్డు, అజ్ఞాన పీట అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదు! 

అవునా? ఏంటది? చెప్పు చెప్పు..

చెప్తా విను. అలా నగలు తీస్కెళ్తున్న పూజారికి రైల్లో ఒకమ్మాయి కలుస్తుంది. ఆ అమ్మాయి పేరు కిర్మిటియా. 

అంటే వేరే మతమేగా? 

సరిగ్గా చెప్పావ్‌!

ఆ అమ్మాయి, ఈ పూజారి అబ్బాయి పెళ్ళి చేసుకోవడం అదంతా dramatic గా, romantic గా రాయాలి. తర్వాత రాముడి కోసం తీస్కెళ్తున్న తన తల్లి నగల్ని ఆమెకి అలంకరించి నువ్వే నా సీతవి! అంటాడు!

ఏమిటీ ఆ కిర్మిటియాని నా సీతా అంటాడా? 

అవును. తన ప్రేమ కోసం అతను కిర్మిటియా మతంలోకి వెళ్ళడంతో కథ ముగుస్తుంది. ప్రేమకు మతాలు అడ్డు రావని ఓ అప్రధాన పాత్రతో ఓ డైలాగ్‌ కొట్టిస్తాం మధ్యలో. 

మరి పూజారి అయిన అబ్బాయి మతం మార్చారుగా? 

అవును, అదే award winning story.
అబ్బాయి కోసం కిర్మిటియా మతం మారిందని రాద్దామనుకుంటున్నావేమో? 
అప్పుడది అభ్యుదయము, ప్రగతిశీలము అవదు. చెత్తబుట్ట పాలవుతుంది! 




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు