పాటని పాటగాను, శ్లోకాన్ని శ్లోకంగాను,మంత్రాన్ని మంత్రంగాను,పద్యాన్ని పద్యంగాను పాడాలండీ అన్నాడొకాయన నా పద్యాలాపన చూసి. నేను పుట్టేటప్పటికే ఇళ్ళల్లో బళ్ళల్లో ఊళ్ళల్లో తెలుగు పద్యం చచ్చిపోయి చాలాకాలం అయ్యిందనీ, నాకు పద్యం పాడ్డంలో శిక్షణ ఏమీ లేదనీ, ఏదో నా స్వంత పరిజ్ఞానంతో పాడుతున్నాననీ, విన్నవించుకున్నా ఆయనకి పద్యం మీద ఉన్న ప్రేమవల్ల నా మాటలు రుచించలేదు. ఇంతకీ అదికాదు అసలు విషయం. పాటనీ,శ్లోకాన్నీ,మంత్రాన్నీ,పద్యా న్నీ ఒకే గాటన కట్టడమే నాకు నవ్వు తెప్పించింది. పాటని పాటలాగే బాణీ కట్టి పాడాలి,వేద మంత్రాలైతే సుస్వరంగా చదవాలి. కానీ,శ్లోకాన్ని,పద్యాన్ని స్పష్టంగా అర్ధం చెడకుండా చదివితే చాలు. రాగం తీసి పాడగలిగితే అది మిఠాయికి రంగులద్దినట్టు. లేకపోతే జీడిపప్పు అద్దినట్టు. అంతే. ఇందులోను ఒక తిరకాసు ఉంది. పద్యంలో కవి హృదయం వీరికి ఎలా అర్థం అయిందో అలా విరుపులు విరుస్తూ పాడ్డం వల్ల కవి గారి ఆత్మ బదులు ఈ పద్యం పాడేవారి హృదయం పద్యంలో తిష్ఠ వేసుక్కూచుంటుంది. అదీ అసలు ప్రమాదం! అసలు ఎలుగెత్తి పద్యం పాడ్డం అనేది మైకులు లేని రోజుల్లో నాటకాల్లో న...