అనగా అనగా అంతరిక్షంలో, అంటే భూమికి అవతల అన్నమాట. వేరే గ్రహాలు, బుధుడు,గురుడు,శుక్రుడు అలాంటివిగుండ్రంగా తిరుగుతూ ఉంటాయే అక్కడ. ఇంకా చాలా చాలా దూరంగా అక్కడ ఒకటి,అక్కడ ఒకటినక్షత్రాలు వెలుగుతూ ఉంటాయి. అక్కడన్న మాట. అక్కడంతా చీకటి,ఖాళీ. అక్కడ అలా తేలుతూ హాయిగా తిరుగుతూ ఉంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏ గ్రహానికీ చెందినవాళ్ళు కాదు.అంతరిక్షమే వాళ్ళ ఇల్లన్న మాట. చూడ్డానికి మనలాగే ఉన్నా, వాళ్ళు చాలా పొడుగైన వాళ్ళు. చాలా చాలా పొడుగు. మన ఎవరెస్టు ఉన్నదే హిమాలయాల్లో ,అంత పొడుగువాళ్ళు. ఇంకా ఎన్నో వేల టన్నుల బరువున్న వాళ్ళు. వాళ్లకు తిండి, నిద్ర అక్కరలేదు. వాళ్లకు దెబ్బ తగిలితే నెప్పి దప్పి ఏమీ ఉండదు. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెద్దగాను,చిన్నగానుఅయిపోగలరు వాళ్ళు . అలా ఉండే వాళ్ళ లోకంలో ఓసారి ఓ బాబుఆడుకుంటున్నాడు. వాడు చంద్రుడిని ఫుట్బాల్ లాగా కాలితో తంతాడు. చంద్రుడు గిజగిజలాడతాడు. సూర్యుడిని పైకి ఎగరేసి పట్టుకుంటాడు. భగభగలాడతాడు సూర్యుడు. ...