అంతరిక్షం బాలుడు
అనగా అనగా అంతరిక్షంలో, అంటే భూమికి అవతల అన్నమాట.
వేరే గ్రహాలు, బుధుడు,గురుడు,శుక్రుడు అలాంటివిగుండ్రంగా తిరుగుతూ ఉంటాయే అక్కడ.
ఇంకా చాలా చాలా దూరంగా అక్కడ ఒకటి,అక్కడ ఒకటినక్షత్రాలు వెలుగుతూ ఉంటాయి.
అక్కడన్న మాట. అక్కడంతా చీకటి,ఖాళీ.
అక్కడ అలా తేలుతూ హాయిగా తిరుగుతూ ఉంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏ గ్రహానికీ చెందినవాళ్ళు కాదు.అంతరిక్షమే వాళ్ళ ఇల్లన్న మాట.
చూడ్డానికి మనలాగే ఉన్నా, వాళ్ళు చాలా పొడుగైన వాళ్ళు.
చాలా చాలా పొడుగు.
మన ఎవరెస్టు ఉన్నదే హిమాలయాల్లో ,అంత పొడుగువాళ్ళు.
ఇంకా ఎన్నో వేల టన్నుల బరువున్న వాళ్ళు.
వాళ్లకు తిండి, నిద్ర అక్కరలేదు.
వాళ్లకు దెబ్బ తగిలితే నెప్పి దప్పి ఏమీ ఉండదు.
ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెద్దగాను,చిన్నగానుఅయిపోగలరు వాళ్ళు .
అలా ఉండే వాళ్ళ లోకంలో ఓసారి ఓ బాబుఆడుకుంటున్నాడు.
వాడు చంద్రుడిని ఫుట్బాల్ లాగా కాలితో తంతాడు.
చంద్రుడు గిజగిజలాడతాడు.
సూర్యుడిని పైకి ఎగరేసి పట్టుకుంటాడు.
భగభగలాడతాడు సూర్యుడు.
అప్పుడు గిజగిజలాడే చంద్రుడిని, భగభగాలాడే సూర్యుడిని చూసి పకపకా నవ్వుతాడు వాడు.
వాడు అలా సూర్యుడి తోటి,చంద్రుడి తోటి,ఇంకా వేరే గ్రహాలతోటి,తోకచుక్కలతోటి ఆడుకుంటూ ఉండగా వాడికి భూమి కనిపించింది. బాగా దగ్గరగా వచ్చి చూసాడు. దానిమీద ఏముందో చూడాలని అని వాడికి ఉన్నట్టుండిఆసక్తి కలిగింది. వెంటనే వాడు చిన్నగా అయిపోయిఈకలాగా గాలిలో ఈదులాడుతూ భూమి మీదకు దిగాడు.
రెండు మూడు వాహనాలు మీదికి రావడంతోనే రోడ్డుమధ్యలో నడవకూడదని, ఎప్పుడూ రోడ్డుకి పక్కగా నడవాలని అర్ధం అయింది వాడికి. అంతా కొత్తగా వింతగా ఉంది. రైయ్ రైయ్ మని పోతున్న ఆవాహనాలనే చూస్తూ నిలబడ్డాడు.
ఇంతలో ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు అటుపోతూ ఎవరు బాబు నువ్వు? ఒక్కడివే ఉన్నావు? మీ ఇల్లు ఎక్కడ? అనిఅడిగారు. వాళ్ళేం అడుగుతున్నారో వాడికి అర్ధం కాక దిక్కులు చూస్తూ నిలబడ్డాడు.
అప్పుడు వాళ్ళు అయ్యో! ఎవరి అబ్బాయో ఈ పిల్లవాడు? తప్పిపోయినట్టున్నాడు! అని వాడిని తీసుకువెళ్ళి పోలీస్స్టేషన్ లో అప్పజెప్పి వాళ్ళ దారిన వాళ్ళు పోయారు.
వాడిని పోలీసులు ఎన్నెన్నో ప్రశ్నలు అడిగారు. వాడికిఅంతా అయోమయం అయింది. వాడు అక్కడినించి వెళ్ళిపోవాలనుకున్నాడు. వెంటనే గబుక్కున మాయం అయిపోయాడు.
పోలీసులంతా ఈ వింతకి ఆశ్చర్యపడిపోయి అంతావెదకడం మొదలు పెట్టేరు. స్టేషన్ లో బల్లల కింద,తలుపుల వెనకా. ఎక్కడా కనపడలేదు. పొలీస్స్టేషన్ నించే మాయం అయిపోయిన పిల్లవాడి గురించి పోలీసులే ప్రకటన ఇచ్చేరు టీవీ లో.
వాడు అలా మాయం అయిపోయి పర్వతాల మధ్య మామూలు రూపానికి వచ్చాడు. అయితే చిన్నగాఅయిపోవాలన్న సంగతి మర్చిపోయాడు వాడు. కొండంతఎత్తులోనే గెంతులు వేస్తూ ఆడుకోవడం మొదలు పెట్టాడు.
అప్పుడు వాడి అడుగుల తీవ్రతకి పర్వతాలు అదిగిపడ్డాయి. భూమి,భూకంపం వచ్చినట్టు దద్దరిల్లింది. అంత పెద్ద ఆకారంలో ఉన్నప్పుడు వాడికి ఇంత చిన్నశబ్దాలు ఏవీ వినిపించవు.
ఆ పెద్ద పెద్ద కొండలు,మెత్తని ఇసక,తలని తాకుతూ మబ్బులు అన్నీ భలే తమాషాగా అనిపించాయి వాడికి.
ఇంకా ఇంకా గంతులు వేసాడు వాడు.
మబ్బుల్ని చేతులతో చెదరగొట్టాడు.
కొండల్ని కాలితో తన్నాడు.
భూమి అదిరి పోయింది.
భూమి మీదున్న జనాలు భయ భ్రాంతులకు లోనయ్యారు.
భూకంపం వచ్చిందేమోనని అటూ ఇటూ పరుగులు తీసారు.
ఆ ప్రకంపనలు ప్రపంచంలోని అన్ని ఖండాలకు పాకాయి.
ఆసియా,ఆఫ్రికా,ఉత్తర అమెరికా,దక్షిణఅమెరికా,అంటార్కి టికా,యూరోప్ ఇంకా ఆస్ట్రేలియా ఖండం వరకు.
ఆ ఖండాల్లో నివశించే నానా దేశాల ప్రజలు-
భారతదేశము,ము,చైనా,జపాన్,అమెరి కా,స్పెయిన్,జర్మని,ఫ్రాన్సుఇలా గ అన్ని దేశాలవాళ్ళు భయపడిపోయారు.
శాస్త్రవేత్తలు ఈ ప్రకంపనాలకి మూలం ఎక్కడో కనిపెట్టేరు.
పరుగున పోయిన స్థానికులు ఆకాశం అంత ఎత్తున్న పిల్లవాడిని గురించి ప్రభుత్వానికి చెప్పేరు.
ఆ ప్రభుత్వంలోని రాష్ట్రపతి,ప్రధాన మంత్రి, ఇతరమంత్రులు అంతా సమావేశమై ఆ పిల్లవాడు కచ్చితంగావేరే గ్రహంనించి మన గ్రహం మీద దాడి చెయ్యడానికి వచ్చినట్టు నిర్ధారించి , ఆ దేశపు మిలటరీ వాళ్ళని పంపించారు.
పిల్లవాడు ఒక్కో అడుగు వేస్తూ వస్తూంటే వాడి కాలి కింద పడి పది యుద్ధ టాంకులు నలిగిపోయాయి. తుపాకిగుండ్లు వాడిని తాకి చచ్చిన ఈగల్లా కిందపడ్డాయి. సైనికులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీసారు.
ఈ సంగతి తెలిసి అన్ని దేశాల వాళ్ళూ సహాయానికి వచ్చారు.
వాళ్లకీ ఇదే గతి పట్టింది. వాడు యుద్ధ విమానాలను, పట్టి నలిపి పడేసాడు. వాడికి అదో ఆట అయింది.నవ్వుతూ వాటి వెంటపడ్డాడు. అప్పుడు వాళ్ళ ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవడానికి
పిక్కబలం కొద్ది నాలుగు వైపులకీ పరుగులు తీసారు సైనికులు.
వాడి అడుగులు చేసిన గోతులలో పడిపోయారు బోల్డు మంది.
హాహాకారాలతో తుపాకి చప్పుళ్ళతో గందరగోళంఅయిపోయింది అక్కడంతా.
ఇంతలో అంతరిక్షంలో వాడిని వెదుకుతున్న వాళ్ళమ్మ, వాడు ఎక్కడా కనబడకపోయేటప్పటికి వాళ్ళమ్మ అన్ని గ్రహాలూ వెదుకుతూ చివరికి భూమి వైపుకి చూసింది.
అక్కడ తన పిల్లవాడిని చూసి, ఓరి భడవా! ఇక్కడున్నావూ? అంటూ ఇంక రా నాన్నా! నిద్రపోయేవేళయ్యింది! అని కేక వేసింది.
అమ్మ మాట వినబడగానే వాడు ఢామ్మని అక్కడినించిమాయమై అమ్మ దగ్గిర ప్రత్యక్షమైయ్యేడు.
అటు తరువాత ఎప్పుడూ ఆ భూగ్రహం వైపుకి వెళ్ళొద్దని బుద్ధి చెప్పింది వాళ్ళమ్మ.
భూమి పైని శాస్త్రవేత్తలు మాత్రం ఉన్నట్టుండి భూమి మీద ప్రత్యక్షమై అంతలోనే మాయమైపోయిన మహాకాయుడుఆ పిల్లవాడు,
వాడు ఎవరు,ఎక్కడినించి వచ్చాడు అని ఇప్పటికీపరిశోధన చేస్తూనే ఉన్నారు.
******