విమానంలో విస్కీ ప్రహసనం
భారత దేశానికి ఒంటరి విమాన ప్రయాణం అవడం వల్ల పక్కన మరో ఇద్దరు అపరిచిత విమానసారులతో ప్రయాణించాల్సి వచ్చింది. సారులిద్దరూ జాతీయ భాషీయులు కనుక ఈ మద్రాసీ లేడీని అక్కడ లేనట్టే కూర్చుని వారి గొప్పను చాటుకుంటుండగా, ఇంతలో అక్కడ పుంసా మంగోలియన్ రూపుడైన “గగన సఖుడు” ప్రత్యక్షమై మీకేం కావాలో కోరుకొమ్మనెను. అన్నాయిలిద్దరూ వివిక్త కంఠాలలో ఒకే మాటగా “విస్కీ” అను పానీయమును ప్రసాదించమనగానే నేను ఒక్కసారిగా అదిరిపడితిని. అప్పటిదాకా ఒకరికొకరు పరిచయం లేని ఆ భయ్యాలు తమ ఇద్దరి మనసులను ఏకం చేసిన విస్కాభిరుచికి విస్తు పోతూ ఒకరినొకరు ముసిముసిగా పరిచయం చేసుకుని విస్కీ రాక కోసం కళ్ళల్లో గుటకలు వేసుకుని ఎదురు చూడసాగిరి. ఇంతలో గగన సఖుడు మోహినీ అవతారం దాల్చి తిరిగి వచ్చి ఆ సురను సురసురమంటూ గళాసులలో పోయగానే అన్నయ్యలిద్దరూ ఆనందం పట్టలేక ఛీర్స్ కొట్టుకుని అప్పటికప్పుడు తలకెక్కిన స్నేహాన్ని ఆస్వాదిస్తూంటే, “ఆహా, సురాభాండమా! నీవు పూజ్యురాలవు. కావుననే, విశ్వామిత్రుని సహాయసంపత్తిచే విశ్వవిశ్వంభరాదేవికి నాస్థానంబగు నా భుజపీఠిపై నిట్లధిష్టించి యున్నావు” అన్న తెలుగు వల్లకాటి కాపరి మాట గుర్తొచ్చి ...