విమానంలో విస్కీ ప్రహసనం

 


భారత దేశానికి ఒంటరి విమాన ప్రయాణం అవడం వల్ల పక్కన మరో ఇద్దరు అపరిచిత విమానసారులతో ప్రయాణించాల్సి వచ్చింది. 

సారులిద్దరూ జాతీయ భాషీయులు కనుక ఈ మద్రాసీ లేడీని అక్కడ లేనట్టే కూర్చుని వారి గొప్పను చాటుకుంటుండగా, ఇంతలో అక్కడ పుంసా మంగోలియన్‌ రూపుడైన “గగన సఖుడు” ప్రత్యక్షమై మీకేం కావాలో కోరుకొమ్మనెను. అన్నాయిలిద్దరూ వివిక్త కంఠాలలో ఒకే మాటగా “విస్కీ” అను పానీయమును ప్రసాదించమనగానే నేను ఒక్కసారిగా అదిరిపడితిని. 

అప్పటిదాకా ఒకరికొకరు పరిచయం లేని ఆ భయ్యాలు తమ ఇద్దరి మనసులను ఏకం చేసిన విస్కాభిరుచికి విస్తు పోతూ ఒకరినొకరు ముసిముసిగా పరిచయం చేసుకుని విస్కీ రాక కోసం కళ్ళల్లో గుటకలు వేసుకుని ఎదురు చూడసాగిరి. 

ఇంతలో గగన సఖుడు మోహినీ అవతారం దాల్చి తిరిగి వచ్చి ఆ సురను సురసురమంటూ గళాసులలో పోయగానే అన్నయ్యలిద్దరూ ఆనందం పట్టలేక ఛీర్స్ కొట్టుకుని అప్పటికప్పుడు తలకెక్కిన స్నేహాన్ని ఆస్వాదిస్తూంటే, 
“ఆహా, సురాభాండమా! నీవు పూజ్యురాలవు. కావుననే, విశ్వామిత్రుని సహాయసంపత్తిచే విశ్వవిశ్వంభరాదేవికి నాస్థానంబగు నా భుజపీఠిపై నిట్లధిష్టించి యున్నావు” అన్న తెలుగు వల్లకాటి కాపరి మాట గుర్తొచ్చి నవ్వు వచ్చింది. 

గళాసులు ఖాళీ అవడమేమిటి, మరల గగన సఖుని పిలవడమేమిటి, మరల విస్కీ ని కోరడమేమిటి, అన్నీ క్షణాల్లో జరిగిపోయినవి. మరోమారు ఆకాశాన ఛీర్స్ దుందుభులు మోగినవి. 

తిరిగి సుర కొరకు వారు విలవిలలాడుతూ, గగన సఖుని పిలువగా అతడీ మారు మునుపటి వలె వెనువెంటనే కరుణించక, తిరిగి భోజనంతో పాటు మాత్రమే ఇవ్వగలనని హామీ ఇచ్చెను. 
అది విని అన్నాయిలు మిక్కిలి హతాశులై కాసేపు నోరు మూసుకొని కూర్చుని తరువాత ఒకరి గొప్పలు మరొకరికి చెబుతూ కాలక్షేపం చేసిరి. 

ఆ భోజనం ఎంతకీ రాక పోవడంతో  ఆ ఆత్రగాళ్ళిద్దరూ మళ్ళా ఆ ఆకాశ సేవన్నను పిలిచి విస్కీ పోయమని వేడుకొనిరి. అతగాడు భోజనంతో పాటు మాత్రమేనని మరోమారు ముక్తాయించి వీరినుండి దూరంగా ఉడాయించి ఎక్కడో దాక్కునెను.

అన్నాయిలిద్దరూ వీస్కీ లేక నాలుక పీక్కు పోతున్నట్టు విలవిలలాడుతుంటేను ఆ విమానంలో దాపెట్టిన విస్కీ అంతా తెచ్చి గరాటాలతో వీళ్ళ గొంతుల్లో పోస్తేగానీ వీళ్ళ దాహం తీరేట్టు లేదని, ఆరాటం ఆరేట్టు లేదని, నేను తలలో తలపోస్తూ ఉండగా, ఇంతలో బిరడా తీయగానే బయటకొచ్చిన జీనీల్లా వారు కోరిన విస్కీలు భోజనంతో పాటు ఎదురుగా వచ్చి పడ్డవి. ఆ సురానంద మకరందాన్ని వారలా వెర్రిగా శాశ్వతానందముగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ వారి పొట్టలను విస్కీతో అభిషేకించిరి. 

గళాసులను ఖాళీ చేసి కొద్దిసేపు గడచినదో లేదో గగన సఖుడు ప్రయాణ బాధితులకు అల్పాహార పొట్లాలు పంచి పెట్టుటకు వచ్చి విస్కీ నిండుకున్నదని తొణకకుండా చెప్పగనే, అయితే  ఈసారి “జిన్‌” తీసుకొని రమ్మని పురమాయించడం చూసి, అది కడుపా కంభాల చెఱువా అన్న తెలుగు సామెత ఒకటి గుర్తొచ్చి, ఫ్రీగా వస్తున్నాయి కదా అని అలా అన్నీ కలిపి పొట్టలో పోస్తే ఛస్తారన్నయ్యలూ అని చెబుదామనిన్నీ అనిపించి పోయింది.

జిన్ను వచ్చి విస్కీ పోయె ఢాంఢాంఢాం అని నేను మనసులో పాట ఒకటి కట్టుకుంటుండగానే, విస్కీతో నింపిన సురాభాండముల వంటి వారి ఉదరములలో చివరాఖరిగా జిన్ను పోసి భయ్యాలిద్దరూ మన్ను తిన్న పాముల వలె నిద్రలోకి జారిపోయి ఆ సురాపాన పారాయణమును అప్పటికి ముగించిరి. 

స్వస్తి. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు