ప్రాణాలన్నీ మరుబాణాలైదుగా
పలుకే లేనిది ప్రియభామా అనొచ్చుగా? అంత మంచి తెలుగు పాట అర్థం కాని నాయికని ప్రేమించడం వ్యర్థం.
“ప్రాణాలన్నీ మరుబాణాలైదుగా చేసే ప్రేమకావ్యం” లో “గా” కోసం మళ్ళీ మళ్ళీ వినొద్దూ పాట? వింటు వింటూ ఉంటే మరుని వింటి బాణాల నిట్టూర్పుల కారణాలు తీసుకుపోవూ ప్రాణాలను ఎటెటో?
“కార్తీకాల తెలి కల్హారాలతో వేస్తా ప్రేమ హారం” అంటే పాటలోని విరహం ఒద్దుఒద్దన్నా ఒలుకుతోందే ఆత్మలో?
ఇంత మోహం కలిగిస్తోందిది తెలుగు పాటా మొగలి ఘాటా?
చెవులొగ్గిన మిన్నాగులా నిలబెతోందే మనసును, సంగీతమా ఇది పదాలకు మెత్తమెత్తని పైపూతలాగు పూసిన చల్ల చల్లని మృగమద పంకమా? అప్పుడే కోసిన మరువమా?
ఆరారు కాలాలకిదే కామితమైన కాంక్షితమైన సౌందర్యం,మాధుర్యమంటే తలలూపరూ తెలుగులందరూ?