కవిత్వము-కవి

 కవిత్వం రాయడం ఒక వృత్తి కాదు. కవుల గురించి చెప్పినట్టు చాలా రకాలైన పాత్రల మీద,వృత్తుల మీద సూక్తులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి అమ్మల మీద,నాన్నల మీద,ఉపాధ్యాయుల మీద,సైనికుల మీద ఇలాగ. దేనికదే దాని పరిధిలో గొప్పది (అని అనుకోకపోతే ఆయా పాత్రలు,వృత్తులు చేపట్టలేరు మరి). అయా వృత్తులు చేసుకుంటూ ఆటో నడిపే అతను,హోటల్ సర్వర్ కూడా కథలు,కవిత్వాలూ రాయొచ్చు. అవి రాసినందుకు ఎవరైనా డబ్బో,అవార్డో,ప్రశంసా పత్రమో ఇస్తే తీసుకోవడం ఎవరికైనా సంతోషమే.కానీ నేను మాట్లాడుతున్నది, కవులు,రచయితలు ఇటువంటి మెప్పుదలల కోసం ఆశ పడ్డం మొదలై తమ భావనా ప్రపంచాలను కలుషితం చేసుకోవడం గురించే. రాయడం ఒక సర్వ స్వతంత్రమైన వ్యాపకం. కీర్తికి,ఆదాయానికి మార్గం కాదు. నీ దోవలో నువ్వు నడుచుకుపోతుంటే అయాచితంగా ఎప్పుడైనా బంగారు నాణాలు దొరకవచ్చు కానీ అప్పుడిక నువ్వు నిధి వేటకు బయలుదేరితే దారి తప్పక తప్పదు. భయపడ్డా,ఆశ పడ్డా కవి కింద పడ్డట్టే.  

దేవుడు 
వీడిని 
గాలి తిని బతికే 
ఆనంద కుమారుడిని 
విషాదప్పవుడరు 
పూసుకున్న       
మోహన మూర్తిని 
గులక రాళ్ళని 
రత్నాలుగా  
దాచుకునే 
వెర్రి వాడిని  
లోక సంచారిని 
బికారిని

చేసి,
అప్పుడు 
నెత్తి  మీద
కుండ పెట్టి 
కుండలో  
అమృతం పోసి
అడిగిన వారికి 
దాహం ఇస్తూ  

తిరుగుతూనే   
ఉండమంటాడు.   

వాడూ కవి!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన