కాళీ పదములు-3

 

1.

కాలాన్ని ఒడ్డి ఈ గులక రాళ్ళను ఏరుతున్నాను
శక్తిని పోసి ఈ నౌకను నీళ్ళపై నిలుపుతున్నాను

సంకల్పాల పాచికలను నక్షత్రాల వీథుల్లోకి విసురుతున్నాను
పాలపుంతల దారుల్లో నీ పేరే పిలుస్తున్నాను

కాంతిల్లు నీ ఎఱుకలో అమ్మా, రేణువులుగా విడిపోతున్నాను.

2.

కాళీ,
మాటలు
నాకొద్దు

జ్ఞానమనే చెట్టుకు
మౌనమనే పండు కాసిందిట
ఆ పండు కోసుకు
నిశ్శబ్దంగా తిననివ్వు

కాళీ,
మహిమలు
నాకొద్దు

మౌనమనే పండులో
వైరాగ్యమనే గింజ ఉందిట
ఆ గింజని తీసి
నిర్లిప్తంగా
మింగనివ్వు

కాళీ,
మోక్షసాధన
నాకొద్దు

వైరాగ్యమనే గింజనించి
జ్ణానమనే చెట్టు
నాలోంచి పుడుతుందట
ఆ చెట్టు కిందకు
వచ్చి నిలబడు.

3.

పక్షి ఒకటి
క్షణం ఆగి
నీళ్ళు తాగి
వెళుతోంది

లేత ఆకుల తీగె
వెదురు గెడను
అల్లుతోంది

ఝుంఝుం
తుమ్మెదల గుంపు
గాలివాటుకు
చెదురుతోంది

గడియ పడ్డ
మది చెవులకు
ఘల్లు ఘల్లు
గజ్జె సద్దు

తోటలోకి
కాళ రాత్రి
వస్తోందని
కీచురాయి
పదే పదే
అరుస్తోంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన