శిథిల రాజ్యం


అటు మొన్నెపుడో

పరిఢవిల్లిన
రాజ్యాల్‌
ఏవేవని
అటూఇటూ
వెతికితే
రాళ్ళూరప్పలూ
వాటి మధ్య
పడి మొలిచిన
మొక్కలూ
శిథిలాల్లో
నిద్రిస్తో
భిక్షుకుడో
సన్యాసో
ఆకటితో
అలమటిస్తో
డొక్కలెండిన
ఊర కుక్కో

నగారాల్‌
మోగిన
బుఱుజులపై
పావురాళ్ళ
రెట్టలో
ఆ కిందన
అవయవాలు
కోల్పోయిన
నల్లరాతి శిల్పాలో
పడగొట్టిన
స్తంభాలో

ఆ పక్కన
ఏ చాటునో
మలిన ప్రేమ
కాముకులో
అజ్ఞానంతో
వారు చెక్కుకున్న
పొడి పేర్లో

ఎండకు
ఎండీనీ
వానకు
తడిసీనీ
రుబ్బురోళ్ళ
కిందను
కాలి మెట్ల
కిందను
పోయినవేవో
పోగా
రాజు మాటే
శాసనంగ
మసక మసక
మసగ్గా మిగిలిన
తెలుగక్షరాలో

సరిగ్గా ఇక్కడనే
ఏ మహారాజు
మూలుగులో
ఏ మహారాణి
రోదనలో
ముష్కర మూకల
మృత్యు పద
ఘట్టనలో
మరణించిన
భృత్యుల
పేగులు
లాగుతోన్న
రాబందుల
కలకలలో
క్షతగాత్రుల
విలవిలలో

మహారాజు
మహారాణి
పరివారము
పడిపోగా
ఏనుగులు
గుర్రాలు
పండితులు
నాణ్యాలు
రాజ సభల
వైభవాలు
కలలాగా
కరిగిపోగ
వందలేళ్ళు
నిశీథిలో
భారంగా
గడిచిపోగ

చివరకు
మిగిలిందిదిగో
రాళ్ళూరప్పలూ
వాటి మధ్య
పడి మొలిచిన
మొక్కలూ
శిథిలాల్లో
నిద్రిస్తో
భిక్షుకుడో
సన్యాసో
ఆకటితో
అలమటిస్తో
డొక్కలెండిన
ఊర కుక్కో.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన