కవిత్వానికి ప్రేరణ

 


 I will be the gladdest thing 
   Under the sun! 
I will touch a hundred flowers 
   And not pick one. 

I will look at cliffs and clouds 
   With quiet eyes, 
Watch the wind bow down the grass, 
   And the grass rise. 

And when lights begin to show 
   Up from the town, 
I will mark which must be mine, 
   And then start down!  (Edna Millay) 

ఇంత సున్నితమైన కవిత రాయగలగడానికి ప్రేరణ ఏమై ఉండొచ్చు?    

నిజమైన కవిత్వానికి నిజమైన ప్రేరణ-అనుభవాలు,జ్ఞాపకాలు వాటి గాఢత. 

కళాకారులకి కళను రగిలించడానికి అనుభవాలు కావాలి. అనుభవాల నించి కళలు,కావ్యాలు.అయితే కళలు,అనుభవాలు రెండూ మనిషిని ఊపేస్తాయి. 

తాత్కాలికంగానైనా గాఢ ప్రభావానికి లోనై రాస్తాడు లేకపోతే తన సునిశిత దృష్టి సోకిన చిట్టి పొట్టి విషయాల మీద కూడా రాయగలడు.రెండవదానికి  కొంత సున్నిత హృదయం కావాలి. అనుభవాలు అన్నీ కవిత్వంగా మారవు.ఎన్నో   ఏళ్ళ క్రితం కలిగిన అనుభవాలు,మర్చిపోయామనుకున్నవి ఆ తర్వాతెప్పుడో కవిత్వంగా బయటపడడం కద్దు. 

దైనందిన ఘటనలు,ప్రకృతి,బాల్యం,ప్రేమ,స్నేహాలు,పరిచయాలు,
వైఫల్యాలు,తాను చూసిన సమాజంలోని అన్యాయాలు జీవితంలోని పలు సందర్భాలు అన్నీ కవిత్వానికి ముడిసరుకులే. 

సున్నితమైన స్పందన కలిగిన కవి హృదయం ఇటువంటి కవిత్వాన్ని రాసుకోగలదు.ఎందుకంటే హృదయం సున్నితం అవడం వల్ల అనుభవాల,జ్ఞాపకాల గాఢత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.
అలా ఎందుకు రాస్తాడూ,కాగితాలని,సమయాన్ని వృధా చేసుకుని అంటే రాయడం అతని మనసుకి ఉపశాంతిగా ఉంటుంది కాబట్టి. 

అయితే రాసేదంతా కవిత్వమా అంటే అందులో మళ్ళీ బోలెడు విషయాలు చెప్పుకోవాలి.రూపం,పదాల ఎంపిక,భావాన్ని ప్రకటించే విధానం ఇలాగ  ఎన్నో ఉన్నాయి. 

కవి యొక్క మానసిక స్థాయిని బట్టి,ప్రతిభను బట్టీ కవిత్వం యొక్క స్థాయి ఉంటుంది.   

ఈ సహజమైన ప్రేరణకి అడ్డు పడగలిగేవి,కవిత్వ ధోరణిని కృత్రిమంగా మార్చగలిగేవి ఏవిటో చూద్దాం.

1.కవిగా గుర్తింపు: అహం, brand image 

మొదట్లో మనకోసం రాసుకున్న కవిత్వాన్ని ఇతరులకి చూపించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి పుట్టాక,ఎలా రాస్తే ఇతరుల మెప్పు పొందొచ్చో అర్ధం అవడం మొదలయ్యాక, సహజ ప్రేరణకి ఎర్ర దీపం వెలగడం మొదలయ్యే ప్రమాదం ఉంది.     

 యోగం,ధ్యానంలో ఒక విషయం చెబుతారు. కొంతకాలం సాధన చేసాక కొన్ని సిద్ధులు వస్తాయిట.దాంతో చాలామంది దేనికోసమైతే తపస్సు మొదలుపెట్టారో అది మానేసి సమాజంలోకి వచ్చి ఆ సిద్ధులు ప్రదర్శిస్తూ,మహిమలు చూపిస్తూ  తిరుగుతారట. కవిత్వం సిద్ధించిన కవి మెచ్చుకోళ్ళ కోసం ప్రదర్శనలో పెట్టే కవిత్వం ఇలాంటిదే.      

2.సిద్ధాంతాల ప్రభావం: 

మనం చదివిన పుస్తకాల్లోనివో,ప్రసంగాలో,ఆయా సిద్ధాంతాల పట్ల ఆకర్షణో కలిగి తనను కరుణించిన కవితాసుందరిని అయా భావజాలాల ఇనుప గొలుసులతో బంధించబోతే సహజమైన ప్రేరణ,ప్రేమ,మంచులా కరిగిపోయి కవితాసుందరి దిగులుతో చిక్కిపోతుంది.       

 3.పరిమితులు విధించుకోవడం:

నేను స్త్రీని,ఫలానా బాధిత వర్గానికి చెందిన వ్యక్తిని,ఫలానా మతానికి,కులానికి ప్రతినిధిని అనుకోవడము,ప్రతి సందర్భాన్నీ ఆయా పట్టకాల్లోంచి చూడడము,అలా చూడ్డం చేత అవే రంగుల్ని పులమడం అనాలోచితంగా జరిగిపోతూ ఉండడము కద్దు.     
     
4.జీవితంలోని మార్పులు,వయసు పెరగడం:

ఒకప్పుడు ఆకర్షించినవి,గాఢంగా ప్రభావం చూపినవి ఇక ఇప్పుడు కవిత్వానికి ప్రేరణగా నిలవకపోవడం వల్లా,ఇప్పుడు ఏమీ రాయలేకపోతున్నాననే ఆతృత వల్లా కవిత్వ రచన కోసం అనుభవాలను సృష్టించుకోవడం మొదలైతే అది సహజమైన ప్రేరణకాక తెచ్చిపెట్టుకున్న కృత్రిమ ప్రేరణ అయి చివరకు కృత్రిమమైన కవిత్వాన్నే సృష్టిస్తుంది.          

ఓ పేరు మోసిన నటుడు మనిషి పోయినప్పుడు శవం ఎలా ఉంటుందో, చుట్టూ ఉన్న బంధువులు సహజంగా ఏడ్చే ఏడుపులు,వారి హావభావాలు, తన నటనా వృత్తికి ఉపకరిస్తాయని, తెలిసిన వాళ్ళు ఎవరు చనిపోయినా  శవాన్ని  చూడ్డానికి వెళ్ళేవాడినని అందుకు ఇప్పుడు సిగ్గు పడుతున్నానని చెప్పగా ఎక్కడో చదివాను. 


ప్రేరణను నిలుపుకోవడం ఎలా? కొన్ని సూచనలు:  

ఏదో రసఘడియల్లోనే కవిత్వం అనికాక కవిత్వం ఒక జీవన విధానం అని గ్రహిస్తే సహజ ప్రేరణను జీవితాంతం నిలుపుకోవచ్చు.

కవిత్వానికి ప్రేరణ అల్లాఉద్దీన్ అద్భుత దీపం లాంటిది.అవసరం వచ్చినప్పుడే జీనీ ని పిలవాలి. ప్రతి విషయానికీ,ఎక్కడో ఏదో జరిగితే మన స్పందన కోసమే అందరూ ఎదురు చూస్తున్నట్టు, అస్తమానం కవిత్వం జీనీని పిలవకూడదు.మంచి నీళ్ళు తీసుకు రా,బజారుకు వెళ్ళి రెండు మైసూరు సాండిల్ సబ్బులు తీసుకు రా అని చిల్లరమల్లర పనులు చెప్పకూడదు.అనుభవం కోసమే అనుభవం కాదు.

కవి సర్వస్వతంత్రుడు. తనకు ప్రేరణ కలిగించిన ఏ విషయం మీదనైనా రాయగలడు. విశ్వ నరుడు కవి- పరిమితులు లేవు.ఊహలకి,భావాలకి.తన అంతరాత్మే తనకు సాక్షి.స్థలకాలాలు లేవు కవిత్వానికి.          

ఎల్లప్పుడూ మనసును నిర్మలమైన స్థితిలో ఉంచుకుని   జరిగినవి,జరగబోయేవి,జరుగుతున్నవి అన్నిటినీ ఎప్పటికప్పుడు వడబోస్తూ,మనలో పుట్టుకొచ్చే భావాలని సాక్షీభూతంగా చూడగలిగితే అది మంచి కవిత్వానికి దారితీసే సహజ ప్రేరణకు ఊపిరులూదుతుంది. 

ఇందుకు,మంచి కవి మిత్రులు,సరళమైన జీవన విధానం,ప్రకృతితో మమేకం అయ్యే మనసు తప్పక ఉపకరిస్తాయి. 

"Everything becomes simple if you immerse yourself in nature. Life’s complications melt away, leaving only the truth of the present moment, and the presence of what I call God. In this place we can see our soul reflected in every living thing, every gust of wind and splash of rain, and here we can find peace. This is our true home". మేరీ రేనాల్డ్స్ అనే ఐర్లాండు ఉద్యానవనాల రూపకర్త The Garden Awakening – Designs to Nurture Our Land and Ourselves అన్న తన పుస్తకంలో అన్న మాటలివి. 

నిరంతరం పుస్తకాలు- ముఖ్యంగా వచనం చదవడం (stirring your thoughts),నిరంతరం మనసులో  పసితనాన్ని, యవ్వనాన్ని నిలుపుకోవడం (should be young at heart ),మానవత్వాన్ని,కరుణ,దయ వంటి సత్వ గుణాలని నిరంతర సాధనతో నిలుపుకోవడం మంచి కవిత్వం సృష్టించడానికి దారితీసే సహజ ప్రేరణకు బలాన్నిస్తాయి.      

ముందు పది చేతుల మూర్తిగా దర్శిస్తే,భావిస్తే గురి కుదురుతుందిట. ఆ తరువాత రెండు చేతులతో ఉన్న మూర్తిని.తరువాత పసి బాలుని వంటి మూర్తిని.ఆ తరువాత దశలో బ్రహ్మ జ్ఞానం పొందుతారు అని రామకృష్ణ పరమహంస అంటారు.అలాగే ముందు కవిత్వం ఢమఢమ పదాలతో నిండి ఘనంగా మోగిపోవాలని భ్రమలు ఉన్నా ఆ తరువాత ముందుకు వెళ్ళేకొద్దీ అలతి పదాలతో సరళమైన పాదాలతో మంచి కవిత్వాన్ని సృష్టించడం చివరి, ఉన్నత దశగా తెలుస్తుంది.      

కవి వృద్ధుడు,సదా బాలకుడు,స్త్రీ,పురుషుడు అన్నిటికీ మించి సత్యాన్వేషి అని గ్రహిస్తే బాహ్య ప్రభావాలకు,ఆలోచనలకు తావివ్వకుండా సహజప్రేరణను సదా నిలుపుకుని మంచి కవిత్వాన్ని సృజించగలరు. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన