కవిత్వం గురించి కవిత

 

ఒక్కోసారి కవిత్వ పాదం ఒకటి తడుతుంది కానీ ముందుకు సాగదు, ఎంత ధ్యానించినా. అపుడు బుద్ధి బయటకు వస్తుంది,నేను సహాయం చేస్తానని. తన తెలివితేటలతో రకరకాల సలహాలు ఇచ్చి మిగిలిన పాదాలను పూర్తి చేస్తుంది. కానీ అంతా ఏదో అతుకుల బొంతలా మనకే లోలోపల అనిపిస్తూ ఉంటుంది. సహజంగా లేదని, కవితాధార కాదని, ఎలాగోలా పూరించామని కొరతగానే ఉంటుంది. అంటే కవిత్వపు గువ్వ తలపోతల వల్ల ఎగిరిపోయిందన్న మాట.  


దాన్ని గురించే ఈ కవిత-



ఆగిన పాట

.................


విరగ గాచి

​కనులు మూసి

​వేచి ఉంటాను


పసిమి వన్నెల

కవిత గువ్వ

వచ్చి వాలి


గొంతు ఎత్తి

ఉండి ఉండి

పాట పాడితే

పులకలెత్తి

పూలు రాల్చాను


పాట మాని

ఊరికే అది

కొమ్మకొమ్మకి

దూకుతోంటే

కులాసాగా

పొడుస్తోంటే


పాట ఆగితే

నిద్ర లేచే

తలపోతలు

నాగుబాములు


పొంచి పొంచి

పాకి వచ్చి

ఒక్క పట్టున

మింగబోతే


పాము చెవుల

చిట్టి గువ్వ

వదిలి నన్ను

ఎగిరిపోతో


ఎన్నడూ ఇక

తిరిగి రానని

కేక వేసింది.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన