ఓ మృత్యువు-కొన్ని ఆలోచనలు

 ఈ రోజుకు మా నాన్న గారు మరణించి సరిగ్గా పదిహేను సంవత్సరాలు. ఆత్మీయులు భౌతికంగా మరణించినా మన జ్ఞాపకాల్లో సజీవంగా ఉంటారు. 


మనం అభిమానించిన వారు మనని చులకన చేస్తున్నారని, మనం ఎంతో ప్రేమించిన వారికి మన మీద ప్రేమ ఏమీ లేదని తెలిసినపుడు మన స్నేహితులుగా వారు మన మనసులోంచి తొలగింపబడతారు. మనుషులుగా జీవించి ఉన్నా స్నేహితులుగా మరణిస్తారన్న మాట. లేదా ‘Best friends’ నించి ‘మామూలు పరిచయస్థులు’ గా మన మనసులో demote అవుతారు. 


భౌతికంగా వెళ్ళిపోయినా, మానసికంగా దూరమైనా ఇదంతా మనసుకు చాలా బాధాకరమైన ప్రక్రియ. 


అందుకే చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా అంటాడో కవి. అసలు మన మనసు ఎదుటి వారికి ఉచితంగా ఇవ్వడమెందుకు దాన్ని వాళ్ళు బద్దలు కొట్టారని వ్యధ చెందడమెందుకు? మన మనసును మన దగ్గరే ఉంచుకుంటే పోలా? 


మనసు చెప్పినట్టల్లా వింటే ఇంతే సంగతులు. 


అందుకే  సనాతన ధర్మం మనసు గినసు జాంతానై  నీ ధర్మం నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళిపో అని చెర్నాకోలుతో కొట్టినట్టే గట్టిగా అదిలించి చెబుతుంది. ప్రేమలు,అభిమానాలు మనసును బంధించి కర్మచట్రంలో ఇరికిస్తాయని హెచ్చరిస్తుంది. 


ఎవరో అన్నట్టు చనిపోయిన వాళ్ళ కోసం చనిపోబోయే వాళ్ళు ఏడుస్తున్నట్టు ఉంటుందీ లోకం సంగతి. 


ఇంతకీ ఏ మృత్యు వార్త విన్నా ఇస్మాయిల్‌ గారి         


‘ఇది మృత్యువు

  ఇంతటితో అన్నీ ఆగిపోతాయి’


అన్న కవితా పంక్తి గుర్తుకు రాక మానదు. 


ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్ 

   గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా! 

   యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో! 

   కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్


అన్న జాషువా పద్యమూ గుర్తుకు రాక మానదు. 


ఈమధ్య మీరేమిటీ అందరికీ నమస్కారాలు పెడుతున్నారు అని అడిగారో స్నేహితులు. దానికో కారణం ఉంది. 


మా నాన్నగారు 52 ఏళ్ళు నిండకుండానే చనిపోయారు. అలా చూస్తే నాకెన్ని వారాలు,వారాంతాలు ఇక మిగిలి ఉన్నాయి? 


ఇంతలోనే ఈ ద్వేషాలకి,అసూయలకి,అపార్థాలకి సై అంటే సై అంటూ సమాధానాలు ఇచ్చుకుంటూ, నీ తప్పా నా తప్పా అని విశ్లేషించుకుంటూ సమయం ఎందుకు వృధా చేసుకోవడం? 


చేసిన తప్పులకి,చెయ్యని తప్పులకి నాదే పొరపాటు అని క్షమాపణ చెప్పేస్తే ఎంత మనశ్శాంతి! అందరికీ ఎంత సమయం మిగిలి సంతోషం కలుగుతుంది! 


అదీ నాకు తండ్రి గారి అకాలమరణం నేర్పిన పాఠం.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన