టమాటలు

 ఎప్పుడో చిన్నతనంలో ఒకసారి హైదరాబాదు రైల్వే స్టేషనులో చిన్న జియర్‌ స్వామి తన శిష్యులతో వెళుతూ ఎదురొచ్చారు. అంతమంది జనంలోను నమస్కరించాను అప్రయత్నంగా. వారు చిరునవ్వుతో అక్కడినించే ఆశీర్వదించారు. ఆనందించాను. 


మరొక సందర్భంలో ఒక ప్రముఖ పాత్రికేయులు బెంగుళూరు రైల్వే స్టేషనులో కనిపించారు. గుర్తు పట్టి దగ్గరకు వెళ్ళి పలకరించాను. ఆయన కొంత అహం ప్రదర్శిస్తూ వెళ్ళమన్నట్టుగా చెయ్యి ఊపుతూ మొహం పక్కకు తిప్పుకున్నారు. నాకు అవమానంగా అనిపించి కోపతాపాలతో ఇంటికి వచ్చి మాఅమ్మగారితో జరిగింది చెప్పాను. 

అవతలి మనిషి ఏ ఆరోగ్యంతోనో, మానసిక చింతలోనో ఉండి ఉండవచ్చు. పలకరించడం,మర్యాదగా నమస్కరించడం వరకే మనం చెయ్యాల్సింది. అవతలి వాళ్ళ ప్రతి స్పందనతో మనకు పనిలేదు అని అన్నారు. ఇది తరువాతీ కాలంలో జీవితంలో నాకు చాలా ఉపకరించింది. పూర్వ భాషీ చ రాఘవ అన్నది తరచూ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాను. 

ఎవరైనా అవమానిస్తే ప్రతీకారం చెయ్యాలా,భగవంతుడే శిక్ష విధిస్తాడులే అని ఊరుకోవాలా అని మా కాలేజీలో లెక్చరరుని అడిగానోసారి. భగవంతుడికే వదిలిపెట్టాలి, సగం నువ్వు చేసి సగం భగవంతుడిని చేయమంటే కుదరదు. అన్నాడాయన. ఆయనో భక్తుడు.ఆధ్యాత్మిక దృష్టితో ఇచ్చిన సమాధానమన్న మాట. 

ఇదే ప్రశ్నను ఉన్నత పదవులు నిర్వహించి పదవీ విరమణ చేసిన మా బంధువు ఒకరిని అడిగాను. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యాలి. నువ్వు మంచిదానివి కాబట్టి ఏమీ చెయ్యకుండా ఊరుకున్నావని అవతలివాడేం అనుకోడు. అన్నాడాయన. లౌకిక దృష్టితో చెప్పిన సమాధానమన్న మాట. 

వివేకాన్ని ఉపయోగించి,విషయాన్ని బట్టి, విషయ తీవ్రతను బట్టి, మన శక్తిసామర్థ్యాలను బట్టి పై రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. మాట పట్టింపుల వల్ల,ప్రతీకారాల వల్ల సాధారణంగా సమయం వృధా అవడమే కాదు, అవసరమైన,ఉన్నతమైన విషయాలపై వెచ్చించవలసిన మన శక్తి అనవసరంగా వృధా అవుతుందని నా అభిప్రాయం. ఇటువంటి విషయాలపై నిర్లిప్తత పెంచుకుంటున్న కొద్దీ సంతోషమే కలుగుతుందని అనుభవజ్ఞులు చెప్పిన మాట.

ఇటువంటివి సాహిత్యంలోనూ కనిపిస్తాయి,మాటల యుద్ధాలు. విశ్వనాథ తన శత్రువులను తన పుస్తకాల్లో పాత్రలుగా సృష్టించే వారని చెబుతారు. శ్రీపాద వారు తమ గురువులకు,  తిరుపతి కవులకు మధ్య పత్రికలలో జరిగిన వాదోపవాదాలను గురించి తమ “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” లో వివరించారు. త్రిపురనేని అసమర్థుని జీవన యాత్ర ఆ ఊళ్ళో కొందరు పెద్ద మనుషులకి కోపం తెప్పించిందిట.

వేటూరి వారు కూడా తన జీవితంలోని ఇలాంటి సాహితీ వివాదాలను గురించి తన “ప్రజ్ఞా ప్రభాకరం” లో ప్రస్తావిస్తూ, అవన్నీ తలచుకోవడమే రోత అంటారు. చారిత్రకంగా వారు ప్రతిపాదించిన విషయాలు అప్పటి సాహితీ పెద్దలకు ఉక్రోషం కలిగించగా,వారిని ఉద్యోగంలోంచి తీసివేయాలని వారు గొడవ చేసారట. బ్రహ్మీ కి బ్రహ్మీయే శత్రువని ఊరికే అన్నారా? 

బ్రహ్మీ అంటే గుర్తొచ్చింది. మిథునం సినిమా గురించి ఒక పేద్ధ కవి గారు, ఆ, ఇందులో ఏముంది,బ్రాహ్మల తిండి గొడవ తప్ప? అన్నాడు. బ్రాహ్మలకు ఇలాంటి పేరు కూడా ఉందని నాకు అప్పటి వరకూ తెలియదు. మిగతా వాళ్ళు భోజనాలు అవీ చేయరాండీ? అని అడుగుదామనుకున్నా,బాగోదులే అని ఊరుకున్నా. 

ఇంతకీ సంగతి ఏమిటంటే, మన బ్రహ్మీ పూర్వీకుల నుండి ఝాడీల్లో వస్తోన్న సంస్కృతాంధ్ర సాహితీ వాసనలను కాస్తో కూస్తో ఆఘ్రాణించి ఉన్నవాడు కనుక  తమ్ముడు ఇంటికి వస్తే పకోడీలు వేయించి పెట్టడమే కాదు, తమ్ముడు వచ్చెన్‌, ఘుమఘుమలాడు పకోడీలు వేయిస్తిన్‌ అని పద్యాలు వ్రాస్తాడు. తమ్ముడు వస్తే ఊళ్ళో మిగిలిన వాళ్ళు కోడిని కోస్తారు,కానీ వాళ్ళెవరూ పద్యాలు వ్రాయరు. కోడిని తింటే బలమొస్తాది. పకోడీలు  తింటే ఆయాసం వస్తాది. ఆ సంగతి కవి గారికి తెలియదు. ప్రపంచానికి కావాల్సింది పకోడీల రుచే అనుకుంటాడు తన లోకంలోంచి లోకాన్ని చూస్తూ.

ఈ కవిగారు పద్యాలు వ్రాయడమే కాదు, తన పాండిత్యం ప్రపంచానికి చాటిచెప్పాలని తనకున్న రెండెకరాలూ అమ్మి “పకోడీ పద్యాలు” అన్న పుస్తకం వ్రాసి ప్రపంచంలోకి తెస్తాడు. భార్యామణి కొంపలో చోటు లేదని మొత్తుకుంటున్నా ఈ పొస్తకాలన్నీ అటకలనిండా పేరుస్తాడు. ఇంతలో, మీ పకోడీ పద్యాలు బాగున్నాయి పంతులు గారు అని ఏ డబ్బున్న ఆసామో ఓ శాలువా కప్పిపోతాడు. ఆ శాలువా చూసుకుని ఆనందభాష్పాలతో  రెచ్చిపోతూ, వద్దురా నాయనా అని ఎవరెంత చెప్పినా వినకుండా గుత్తి వంకాయ పద్యాలు, ఆవకాయ పద్యాలు,ఆనపకాయ పద్యాలు అని రాసుకుంటూ పోతాడు. అదేమంటే తెలుగు వారి వంటల వైభవం, వారి రుచులు,అభిరుచులు అన్నీ తన పూర్వకవులనించీ గ్రంథస్థం చేయవలసిన బాధ్యత కవికులం మీదే ఉందని, దాని కోసం ఎంతకైనా తెగిస్తానని అంటాడు. కృష్ణదేవరాయలు కూడా వర్ణించాడు తెలుగు భోజన పదార్థాలను,
ఆయన రాజు అయితే నేను కవి రాజునంటాడు!

ఇంతలో ఇంకో కవి గారెవరో “ ఘాటు తగ్గిన పకోడీ పద్యాలు” అన్న శీర్షిక పెట్టి కవి గారి పద్యాలను విమర్శిస్తాడు, మాబాగా విమర్శించాననుకొంటూ. అప్పుటిదాకా విర్రవీగుతున్న కవి గారి బుర్ర మీద దెబ్బపడుతుంది. వెంటనే “పూర్ణం తగ్గిన పూర్ణం పద్యాలు“ అంటూ అవతలి కవిగారి మీద యుద్ధానికి వెళ్తాడు. దాంతో మొదలౌతుంది మాటల యుద్ధం. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన