సంక్రాంతి



నల్లని నీ చేతులు 
 మెత్తని మన్ను 
బొంత కింద 
చిన్నారి కలలను 
నిద్ర పుచ్చుతాయి

అవి కలల్లో
కులాసాగా
ఎదుగుతాయి
పగటి ఎండలో
రాత్రి చలిలో
జోగుతాయి

ఆనక  తాపీగా
కాంతుల కాయలు
విచ్చుతాయి
చిరు చిరు 
నవ్వుల ధాన్యాలు 
చిలుకుతాయి
చిలుక ముక్కుల
మొగ్గలు కులుకుతాయి


ఎండు గడ్డి 
మేజోళ్ళ
తల్లి భూదేవికి
ఊరి గాలి
దారి చూపుతోంటే
దుమ్ము రేగుతోంటే

గణగణ గంటల
నీ జోడెడ్ల బండెక్కి
అన్నా,

చివరికవి
నీ ఇంటి
గరిసెలో
మెల్లిగా ఒత్తిగిల్లి
సేద తీరుతాయి
మాగన్ను నిద్రలో
మునుగుతాయి

నిద్రలో ధనలక్ష్మి
గాజుల గలగలకు
కలకలలాడుతూ
అవి నలుదెసలా
సరిగెలు జల్లుతాయి
మించులు చిప్పిల్లుతాయి!

 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన