మాటల మహిమ చెప్ప తరమా?

 1. యారానా

  

ఎన్ని సార్లు 

మాట్లాడినా 

ప్రతి సారీ మాటలు 

కొత్తగా తడబడతాయి


కిటికీ పక్కన  పువ్వులు 

కళ్ళు నులుముకుని 

ఆవలిస్తాయి 

 

వెన్నెల మొగ్గల 

మంచు      

కురుస్తూనే ఉంటుంది

ఇంటి బయట 


నిద్ర పోగొడుతున్నందుకు 

క్షమాపణలు కోరుతూనే  

నేనతన్ని 

రాత్రంతా  

నిద్ర పోనివ్వను


2. పుప్పొడి


మాటలెప్పుడో ఆగిపోయాయి
నక్షత్రాలు తళతళలాడాయి
ఒక్కసారి తాకగానే –
వెయ్యి పువ్వులు విచ్చుకున్నాయి
ఎన్ని ధవళరాత్రులు వచ్చివెళ్లినా
నా చేతివేళ్ళకింకా అదే పుప్పొడి.



3. మాట


దారంతో పువ్వు కుడుతోంటే
చిక్కు ముడి పడ్డట్టు
ఎగురుకుంటూ వెళుతోంటే
కళ్ళల్లో నలుసు పడ్డట్టు
షికారుగా పోతోంటే
జోడు ఒకటి తెగినట్టు

అప్పుడు గబుక్కున
నువ్వన్న  మాట
నీ గొంతులో విసురు

మైసూరు పాకులాంటి
నా మనసు ను 
కసుక్కున కోస్తుంది.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన