Hello my dear wrong number!
తుమ్మెద అత్యాసక్తితో రెల్లు పూవుపై వాలి మకరందం తాగే ప్రయత్నంచేసినా దానికి రసం ఎలా లభించదో,తగని వారితో చేసే స్నేహం అంతే లాభిస్తుంది.
—- వాల్మీకి రామాయణం.
గత చాలాకాలంగా కొత్తగా ప్రబలిన ఒక ఆచారాన్ని గమనిస్తున్నా. అదేమిటంటే “I can only respond” అనే ఆచారం. ఈ ఆచారాన్ని పాటించేవాళ్ళని పింగ్‌పాంగీయులు అనొచ్చు. మనం ఎంత లావు మెస్సేజు ఇచ్చినా వీరినుంచి ఠకీమని సమాధానాలు వస్తాయి -
yes,no,interesting,wonderful,Thank you ల్లాంటివి.
20యేళ్ళు,ఆలోపు పిల్లలైతే మరీ కురచవి -
Tq,Ttl,kk,ok,wc,Tx,SRK,WDK etc.,
SRK,WDK అంటే ఏమిటని నన్నడక్కండి. నాకూ తెలీదు. 😄
ఇలా పొడి పొడిగా respond అవడాన్ని మాట్లాడ్డం అంటున్నారు! ఈ పింగ్‌పాంగ్ సమాధానాలు కూడా ఇవ్వకపోవడాన్ని మాట్లాడ్డం మానెయ్యడమంటున్నారు!!
ఎవడికి కావాలయ్యా నీ ఎండిపోయిన వడియాల్లాంటి పొడి పొడి పింగ్‌పాంగ్ సమాధానాలు? అని అనాలనిపిస్తుంది. కానీ,అనలేం. అంటే పిన్నలకీ పెద్దలకీ అదేదో దెబ్బ తినిపోయి కోపాలొచ్చేస్తాయి! పెద్దవాళ్ళు అహంకారం వల్ల, చిన్నవాళ్ళు అజ్ఞానం వల్ల ఇలా ప్రవర్తిస్తారని సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి రావొచ్చు.
వారి సంగీత సాహిత్యాలు చూసి నేనెంతో అభిమానించిన వారూ ఈ పింగ్‌పాంగ్ క్లబ్బులో మెంబర్లే అని తెలుసుకుని ఆ మత్తు వదుల్చుకోవడానికి చాలాకాలం పట్టింది. ఇది starting point అని, తరువాత తరువాత ఏమైనా మంచి మాటలు, తమ జీవితానుభవంనుంచి మనకు పనికొచ్చే మాటలు చెబుతారేమో అనుకుంటా కానీ ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా తరతరాలకీ తరగని విలువలు అన్నట్టు అవే పింగ్‌పాంగ్లు!
తనతో మాట్లాడాలని ఇదవుతున్న ఆ ఎదుటి మనిషి మీద తూష్ణీభావమా లేక వారి సంభాషణాసామర్థ్యం అంతమాత్రమేనా? రెండూ కావొచ్చు. వీరి ఆకారాలను చూసి ఎదుటివారు ఏదో మనోవికారాలను పొందుతున్నారన్న భావనా కావొచ్చు. 😊
అన్నింటికీ సమాధానాలు ఇచ్చేవాళ్ళు కొన్నాళ్ళయ్యాక దేనికీ సమాధానం ఇవ్వరు. కాబట్టి ఎవరి మీదనైనా మనకు అతి అభిమానం కలిగితే వారిని అతిగా పలకరించడమే మందు!
బెంగుళూరులో ఓ పెళ్ళికి వెళ్ళాం. ముందు ఏవో మిఠాయిలు అవీ వచ్చాయి. Appetisers లాంటివి వచ్చాయి. వచ్చినవి వచ్చినట్లు తినేసి ఇంక అన్నం, కూరలు, పప్పు,సాంబారు వస్తాయని ఎదురు చూస్తున్నాం. కాసేపయ్యాక ఆకులు ఎత్తేసేవాళ్ళు వచ్చారు! అంతేనట వాళ్ళ భోజనం! ఇంటికొచ్చే దారిలో ఓ హోటల్ దగ్గర ఆగి మళ్ళీ పూర్తిగా భోం చేసి వెళ్ళాల్సి వచ్చింది!
ఈ పింగ్పాంగ్ సంభాషణల్లో మన ఆశింపులు ఇలాంటివే. ఈ పింగ్‌పాంగ్ సంభాషణాచతురుల మీద నా వ్యామోహం పూర్తిగా చచ్చి అసలు సంభాషణ అంటేనే విరక్తి వచ్చింది. ఈ half backed potatoes లాంటి పొడి పొడి response లు ఇస్తూ ఎన్నేళ్ళైనా మనల్ని నాలుగు గీతల అవతల నిలబెట్టే వాళ్ళు మనకి ఆప్తులు,ఆత్మీయులు ఎలా అవుతారు?
ఇంట్లో వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం ఇస్తామా? లేదు. కానీ మనం ఇచ్చే ఒక్క సమాధానం అర్థవంతంగాను,ఆత్మీయంగాను మరియు చాలాసార్లు మార్గదర్శిగాను ఉండదూ?
ఉల్లిపాయలాగా అనేక పొరల వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న ఈ పింగ్‌పాంగ్ నవనాగరీకులను సగౌరవంగా చెత్తకుప్పలో నిమజ్జనం చేసా. అలా నిమజ్జనం చేసానో లేదో ఇలా నా మనశ్శాంతి తిరిగొచ్చింది.
ఇప్పుడు సంభాషణ కావాలంటే శ్రీపాద వారితో మాట్లాడతా,ఇంద్రగంటి వారితో మాట్లాడతా, ఎక్కిరాల వారితో మాట్లాడతా,వేద ఋషులతో మాట్లాడతా,హిమాలయ పరమ గురువులతో మాట్లాడతా.
వీరంతా ఎప్పుడు నేను వారితో మాట్లాడతానా అని టేబుల్ మీద కూచుని నాకోసం ఎదురు చూస్తుంటారు! 🙂🌼