మాట మంత్రమే!

 జీవితానుభవం నుండి వచ్చే మంచి సారవంతమైన మాటలు ప్రతి మనిషి నోటినించీ ఎప్పుడో అప్పుడు వెలువడతాయి ఆశ్చర్యంగా.అప్పుడవి చటుక్కున అందుకుని దాచుకుని,సందర్భం ఎదురైనప్పుడు ఆ మాటను ఒక సలహాగా జ్ఞాపకం చేసుకోవచ్చు. 


విపరీతంగా దానధర్మాలు చేసి బీదరికంలోకి జారిన చిత్తూరు నాగయ్య గారు, “నా జీవితం పదిమందికి గుణపాఠం కావాలి” అనేవారట. అలా అనగలగడానికి మనిషికి ఎంత ఔన్నత్యం ఉండాలి? 

ఓ ప్రముఖ నటీమణి ఓ Interview లో తన వైవాహిక జీవితం గురించి ప్రస్తావిస్తూ, “నేను కూడా నిలుపుకోలేక పోయాను” అంటే- అనుభవంలోంచి వచ్చిన ఆమె పరిణితికి అచ్చెరువొందుతూనే అయ్యో అనుకున్నాను. 

కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన జీవిత చరిత్రలో తనకు కోపం వచ్చినప్పుడు ఎదుటి వారిని తీవ్రముగా దూషించే బలహీనత ఉన్నదని వ్రాసుకున్నారు.

 “లోధ్ర” కేసరి గారు, “ధన పిశాచమావహించి” తోటను,అందమైన బంగ్లాను అమ్మివేసితినని చింతించారు. 

“ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదమ్మా” అనేది మా తాతమ్మ. భారతీయ సంస్కారం! 

“ఎవ్వరి మాటలు పట్టించుకోనవసరం లేదు” అన్నారొక మిత్రులు. అది దూషణమైనా,భూషణమైనా.

“తప్పొప్పులు ఎంచుకుంటూ టిక్కులు పెట్టుకుంటూ పోతే ఎవరూ మిగలరు” అన్నారొకసారి మా గురువు గారు.

ఇలాంటివి ఇంకా ఎన్నో. 
 
ఆణిముత్యాలు ఏరుకుని భద్రంగా దాచుకుంటాను,మనసుకి అవసరమైనప్పుడు ఔషధంలా ఇస్తూ ఉంటాను.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన