తెనుగుల సినిమా తెగులు


 


ఈమధ్య ఒక కొత్త విషయం తెలిసింది. సెన్సారు బోర్డు వారు ఉన్నది అభ్యంతరకర దృశ్యాలను కత్తిరించడానికి కాదుట! కేవలం అశ్లీలత/హింసాత్మకత స్థాయిని బట్టి వాటిని U,A లాంటి ఒక్కో అరలో పడెయ్యడమేనట వారి పని! కానీ పాకిస్థానును ఏమైనా అంటే వెంటనే ఆ దృశ్యాలు కత్తిరించేస్తారుట! హీరో హీరోయిన్లుకి ఒంటి పైన బట్టలు ఉంటే చాలు U certificate,ఆది మానవ స్వరూపాలైతే A certificate ఇచ్చి pass చేసి చేతులు దులుపుకుని ఇంటికి చక్కా పోతారట.


 కోట్లమందిపై ప్రభావం చూపే సినిమా గురించి ముగ్గురు నలుగురు అపరిణిత బుద్ధులకి అధికారం ఇవ్వడమా? 

ఇప్పుడు పెళ్ళి,పుట్టిన రోజు,పండగ ఏదైనా సినిమా పాట ఉండాల్సిందే. ఆ పాటలు నేర్చుకునే వాళ్ళు,పాడేవాళ్ళు.ఆ పాటలకి నృత్యాలు నేర్పించేవాళ్ళు,నేర్చుకునే వాళ్ళు ఎక్కడ చూసినా. 

“సంగీత్‌” అంటే మా కుటుంబం నృత్యప్రతిభ చూడుడి అనే కార్యక్రమం. అచ్చంగా గంధర్వలోకం. వయసుతో సంబంధం లేదు,అందరూ గంధర్వులే. మదిరా సంయుక్త నృత్యగాన హేల! అదో లీల. 

తగులుకున్న సచ్చినోడు మొగుడౌతాడా అని ఓ దిక్కుమాలిన సామెత ఉంది. అలాగే ఈ తగులుకున్న సినిమా సంస్కృతి మన తెలుగు జాతి సంస్కృతి ఎలా అవుతుంది? చిన్న పిల్లల చేత కూడా ఆ దరిద్రపు సినిమా పాటలకి డాన్సులు వేయించి ఆనందిస్తున్నారు తల్లిదండ్రులు,ఏమిటో ఖర్మ. 

ఆమధ్య ఎవరో జంట గాయకులు స్టేజీ మీద పాడుతున్నారు,రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు అనుకుంటూ. వేదిక మీద పాడేటప్పుడు కొన్ని మరీ ఇబ్బందికరంగా ఉండేవి పక్కన పెట్టొచ్చుగా,అక్కడికి వచ్చే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని?


కొయ్యబొమ్మలె చూచు కనులకు కోమలులు సౌరెక్కునా అన్నాడో కవిగారు. ఈ  సినిమా పాటల రుచి మరిగిన జనం బుర్ర కథ,ఒగ్గు కథ,హరి కథలాంటి మన అచ్చ తెనుగు కళలను ఆదరించడం దాదాపుగా మానేసారు. నా చిన్నతనంలో అంతర పాఠశాల బుర్రకథ పోటీలు నిర్వహించేవారు! మా ఉపాధ్యాయులు పిల్లలకు శిక్షణ ఇచ్చి పోటీలకు తయారు చేసేవారు!

ఈ వేదికల మీద పాటలు పాడే సోదరసోదరీమణులకు నా విన్నపం ఏమిటంటే, సినిమా పాటల మధ్యలో కనీసం ఒక లలిత గీతమైనా పాడమని. 

గిరిజన గీతాల కోసం నేనైతే హాయిగా ఆకాశవాణి ఆదిలాబాద్‍ వింటాను. వారీ కార్యక్రమాలతో ప్రాచీన సంస్కృతి పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన