సాహితీ భేతాళ ప్రశ్నలు


ఎప్పటివలే విక్రమార్కుడు శ్మశానంలో చెట్టు మీద నుంచి భేతాళుడిని దించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. 


అప్పుడు భేతాళుడు విక్రమార్కునితో- “హాయిగా అంతఃపురంలో నీ శయ్యాగారంలో హంసతూలికాతల్పంపై నిదురించవలసిన ఈ సమయంలో ఈవిధంగా శ్మశానంలో నడుస్తున్న నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తోంది,విక్రమార్కా! నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు కొన్ని సాహితీ ప్రశ్నలు వేస్తాను. వాటికి సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీ తల వెయ్యి వక్కలవుతుంది,జాగ్రత్త!” అంటూ ఇలా అడగసాగాడు.


“మహాకవి అరుణశ్రీ మూడో భార్య తాలూకు నాలుగో బామ్మర్ది పేరేమిటి?” ఇది నా మొదటి ప్రశ్న అన్నాడు,కన్ను కొడుతూ. 


విక్రమార్కుడు భుజాన ఉన్న భేతాళుడి వైపు కోపంగా చూసి,తిరిగి మౌనంగా నడవసాగాడు. 


ఎందుకయ్యా అంత కోపం? నీకు అంతఃపురంలో చాలామంది “ఆవిడలు” ఉంటారని, నీవు నచ్చే ప్రశ్న అడిగానయ్యా! అన్నాడు భేతాళుడు ఎగతాళిగా నవ్వుతూ. విక్రమార్కుడు మళ్ళీ కోపంగా చూసి ముందుకు నడవసాగాడు. 


సరే పోనీ, ఇది చెప్పు. ఆ తెలుగు పదాన్ని తిరగేస్తే స్వప్న సుందరి, మరగేస్తే పేడ పురుగు అన్న అర్థాలు వస్తాయి. ఏమిటా పదం? 


విక్రమార్కుడు చేతిలో ఉన్న కత్తితో తల బాదుకున్నాడు. నోరు తెరిస్తే వచ్చిన పని చెడుతుంది కనుక మాట్లాడకుండా తిరిగి నడక సాగించాడు. 


ఏమిటోనయ్యా,విక్రమార్కా. నీ అజ్ఞానాన్ని చూస్తే జాలి కలుగుతోంది నాకు. దీనికీ నీకు సమాధానం తెలిసినట్టు లేదని తెలుస్తూనే ఉంది. సరేలే, పర్వాలేదు. నా వద్ద ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. నన్ను మోసి మోసి పాపం ఆయాసపడుతున్నట్టున్నావు. నీకు శ్రమ తెలియకుండా ఈసారి ఒక చిన్న కథతో కూడిన ప్రశ్న అడుగుతాను,విను.


ఒక రోజు మహాకవి అరుణశ్రీ, లేజీ కవి భావుకశ్రీ పొలాల పక్కగా సైకిలు మీద డబుల్సు వెళుతుండగా సైకిలు టైరు పంచరు అయిందట. వెంటనే మహాకవి అరుణశ్రీ నోట్లోంచి, 


పదరా ముందుకు!

పదరా తోసుకు!

సైకిల్‌ పంచరు

అయ్యింది! 


అన్న మహా కవిత వెలువడిందిట.


నువ్వే తోసుకుంటూ స్వర్గం అంచులదాకా వెళ్ళు. నేనీ చెట్టు కింద పడుకుంటా,అన్నాడట లేజీ కవి భావుకశ్రీ.


ఈ చెట్టు కిందే 

ఆగిపోనా

ఎటులైనా

ఇచటనే

బబ్బుండి పోనా! అని పాడుకుంటూ.


ఆవిధంగా వారిద్దరూ కవితలు విసురుకుంటూ కాలక్షేపం చేస్తుండగా,అటువైపుగా వచ్చిన మరోకవి సైకిలు బాగుచేసి ఇచ్చాడట. ఆ కవి పేరేమిటో చెప్పగలవా,విక్రమార్కా?

నీకు సులువుగా ఉండేందుకు మరో విషయం కూడా చెబుతా. ఆ సదరు కవి అరుణశ్రీని పెద్ద బావ అని,భావుకశ్రీ ని చిన్న బావ అని పిలిచేవాడట. ఇప్పుడు చెప్పు, ఆ పంచరు కవి పేరేమిటి?


విక్రమార్కుడు నిస్సహాయంగా పళ్ళు నూరుకుంటూ భేతాళుడిని మళ్ళీ భుజం మీదకి సరిగ్గా సద్దుకుంటూ ముందుకు అడుగులు వేయసాగాడు.


హహ్హహా,విక్రమార్కా! నీ వాలకం చూస్తుంటే ఇదీ తెలిసినట్టు లేదు. సరే,పోనీ,ఓ తేలిక ప్రశ్న అడుగుతా.


“ఉదయం పూట పాకుతుంది,మధ్యాహ్నం దేకుతుంది,సాయంకాలానికి కుంటుతుంది” ఏమిటది?


విక్రమార్కా! ఏమిటయ్యా నోట్లోంచి మాట రాదే? సరేలే కానీ, నీ మౌనమే చెబుతోంది నీకు తెలుగు పొడుపు కథల్లో కూడా ప్రవేశం లేదని.


పోనీ కనీసం సినిమాలు చూస్తావుగా. ఈ ప్రశ్నకైనా సమాధానం చెప్పు మరి.


“బంగారు మేడలు-వెండి గోడలు” సినిమాలో  


“నీ చూపులే గునపాలు

నీ నవ్వులే గుదిబండలు” 


అన్న పాట రాసిన సినీ కవి ఎవరు?


నీకు సులువుగా ఉండేందుకు మరో విషయం చెబుతా. ఈ కవే “సుడిగుండాల్లో  సబ్బు బుడగలు” అనే సినిమాలో-


లిమ్కా పాప

లిమ్కా పాప

 లంచికొస్తావా?


లక్సు బాబు

లక్సు బాబు

రాను పోవోయి!


అన్న పాట,తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన పాట రాసాడు. ఈ పాటతోనే ఆ కవిగారికి “యాభై వేల రూపాయల కవి” అన్న పేరు వచ్చింది. విక్రమార్కా,ఇంత వివరంగా చెప్పాక కూడా నువ్వా కవి పేరు చెప్పలేకపోతే నీ బతుకే దండగ!


అప్పటికే సహనం చచ్చినా ఇంకో అరమైలు నడిస్తే మాంత్రికుడు ఉండే తావు వస్తుంది కదా అని  భేతాళుడిని అలాగే ఎలాగోలా మోసుకుంటూ మౌనంగా నడవసాగాడు. 


ఏమయ్యా,విక్రమార్కా! నీవేదో తెలివైన వాడివని, సాహితీ వాసనలు ఉన్నవాడివనీ అనుకున్నాను గానీ ఇంత అయోమయం మనిషివని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. 


సరేనయ్యా, నువ్వు వినాలే గానీ నా దగ్గర మూటల కొద్ది ప్రశ్నలున్నవి.


క్రౌంచ ద్వీపంలో  స్వయంప్రకటిత భాషా శాస్త్రవేత్త ఒకడు, షట్‌ + లట్‌ = హాంఫట్‌ అని కొత్త సూత్రం ప్రతిపాదిస్తున్నాడు, అది హూంఫట్‌ అవుతుందన్న 1 వ శతాబ్ది నాటి భాషావర్థనుడి ప్రతిపాదనకు భిన్నంగా. 


నీవు కాళిదాసాది నవరత్నాలతో సభ దీర్చి సాహితీ చర్చలు చేసేవాడవు. నీకు తెలియకపోతుందా? చెప్పు, హాంఫట్‌ సరి అయినదా? హూంఫట్‌ అవుతుందా?


ఇక ఎంతమాత్రమూ ఓపిక పట్టలేని విక్రమార్కుడు, “భేతాళా నీ గోలకు తాళలేకున్నాను. ప్రశ్నలా,ప్రాణాలా? అన్న స్థితికి తెస్తున్నావు. కాసేపు నోటికి తాళం వెయ్యలేవుటయ్యా!” అని అరిచాడు.


ఆవిధంగా విక్రమార్కుడు మౌనం వీడగానే భేతాళుడు తిగిరి ఎగురుకుంటూ చెట్టెక్కాడు.


( ఈ ప్రశ్నలకి సమాధానాలు ఏమిటని నన్నడక్కండి. ఉజ్జయిని శ్మశానంలో ముందుకెళ్ళి లెఫ్టు తీసుకుని, ఆ తరువాత రైటు తీసుకుంటే మీకో చెట్టు కనిపిస్తుంది. దానిమీద వేళ్ళాడుతూ భేతాళుడు ఉంటాడు. కావాలంటే అతగాడిని అడిగి తెలుసుకోగలరు.)












ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5