WhatsApp బీర్బల్?
బీరేంద్ర ప్రసాద్ కి బీరంటే ప్రాణం.
“బీర్బల్స్” Whatsapp group వాళ్ళు తనని సభ్యుడిగా చేర్చుకోవడం అతన్ని ఎంతో అనందపరిచింది.
ఉత్సాహంగా బీరు మీద postలు పెట్టడం ప్రారంభించాడు.
“ఈజిప్టు బీరుకి,మెసపటేమియా బీరుకి గల పోలికలు-భేదాలు”
”బీరులో ఈగ పడితే ఎలా?”
”బంగాళా దుంపలతో ఇంట్లోనే బీరు చేసుకోవడం ఎలా?” వంటివి.
లైకులు,లవ్వులు,మెచ్చుకోళ్ళు వచ్చి పడ్డాయి.
బ్రహ్మానందభరితుడై ఇంకా కొత్త కొత్తగా-
“బీరుతో సాంబారు కాయడం ఎలా?”
”బీరు మాత్రమే తాగి 30 రోజులు బ్రతకడం ఎలా?”
వంటి వినూత్న postలు పెట్టడం మొదలు పెట్టాడు.
ఈసారి ఇంకా లైక్స్,లవ్స్,నమస్కారమ్‌స్,కామెంట్స్ వెల్లువలా రాసాగాయి.
అలా ఓ నెల గడిచిందో లేదో బీరేంద్ర కు బీర్బల్స్ group admin నించి ఫోన్ వచ్చింది.
WhatsApp Admin: మీరు చాలా ఎక్కువ messages పెడుతున్నారని group సభ్యులు complaint చేస్తున్నారు. ఇకనించీ ప్రతి సభ్యుడు రోజుకొక్క message కన్నా పెట్టరాదని rule పెట్టాం.
బీరేంద్ర: చాలామంది నేను పెట్టే messages కి positive గా respond అవుతున్నారు కదండీ.
Admin: వాళ్ళందరికీ కూడా warning ఇవ్వడం జరిగింది. ఇకనించీ ప్రతి సభ్యుడు ఒక్క message కే లైక్ కొట్టాలి. లవ్వులని disable చేసాం. ప్రతి సభ్యుడు రోజుకి ఒక్క message కే comment పెట్టాలి. Admin పెట్టే ప్రతి message కి మాత్రం తప్పకుండా like కొట్టాలి.
బీరేంద్ర: సరేనండీ,అలాగే ( నీరసంగా).
ఆ రోజునించీ బీరేంద్ర జాగ్రత్తగా రోజుకి ఒక్క message మాత్రమే post చేయడం మొదలు పెట్టాడు.
ఓ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా, బీరు తాగడం వల్ల పొట్ట వస్తోందని, ఈ పుట్టిన రోజు నుండి వారంలో ఒక రోజు బీరు తాగరాదని దీక్షబూనానని బీరువోకుండా వ్రాసి post చేసాడు.
అంతే! అప్పటిదాకా ఏ బీరువాలో దాక్కున్నారో బీరువాదులు, బీరు మానేస్తాననడం బీరుల లక్షణం కాదని, ఇది కేవలం బీరు తయారు చేసే కార్మిక వర్గాల బొర్ర కొట్టడానికి బీరాబర్ కుట్ర అని బరబరా comments వ్రాసి పడేసారు. ఆ comments చదివి బీరేంద్ర బావురుమన్నాడు.
మరుసటి రోజు Admin నుంచి phone వచ్చింది.
Admin: మీరు పెట్టిన post అభ్యంతరకరంగా ఉంది. ఇది బీర్బల్స్ కే అవమానం. మీ post చదివాక నేను రెండు పూటలు బీరు తాగలేకపోయా. అసలు మన group description చూసారా మీరు? “బార్ బార్ బీర్! హజార్ బార్ బీర్!” తెలుసుగా? మీరు తక్షణం group సభ్యులందరికీ క్షమాపణ చెబుతూ message పెట్టండి.
బీరేంద్ర: అయ్యో, అలాగా. మీకు ఇప్పుడే క్షమాపణ చెబుతున్నా. Group లో ఉన్న ప్రతి సభ్యుడికీ పేరు పేరునా క్షమాపణ చెబుతా అన్నాడు వచ్చే ఏడుపుని ఆపుకుంటూ.
ఆ తరువాత Group అంటే విరక్తి పుట్టి తన బీరేదో తను తాక్కుంటూ బతకసాగాడు బీరేంద్ర. ఓ రోజు సరదా పుట్టి,
కొట్టు కొట్టు
బీరే కొట్టు
కొట్టిందంత
ఎక్కేటట్టు
ఓ చిన్నోడా!
అన్న పేరడీ పాట రాసి,తానే పాడి Group లో post చేసాడు.
మరుసటి రోజు Group Admin నుంచి phone వచ్చింది.
Admin: మీరు పెట్టిన పాట గురించి మన group మహిళా సభ్యులనుండీ, గే సభ్యులనుండీ అభ్యంతరం వచ్చింది. మీరా పాటలో “ఓ చిన్నమ్మా” అని ఎక్కడా పాడలేదు. ఓన్లీ చిన్నోడా అనడం వల్ల వారంతా offend అయ్యారు. మీరు వారందరికీ గుంపగుత్తగా క్షమాపణ చెప్పాలి.
బీరేంద్ర: అలాగేనండీ. అది నా పొరబాటే, అలాగే చెబుతా. మీకు కూడా చెబుతా.
అలా కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ఖాళీగా ఉండి, ఏమీ తోచక, “భారత దేశంలో ప్రాచీన మత్తుపానీయాలు” అన్న అంశం తీసుకుని, కాళీ,కాలభైరవుడు మద్యపాన ప్రియులని, మన దేశంలో కల్లు,సారా,గంజాయి,నల్ల మందు,భంగు వంటివి దేశవాళీ మత్తుమందులనీ, ఇవి కొన్ని రకాల వ్యాధులకి మందుగా వాడ్డం కూడా ఉందనీ, రామాయణ,మహాభారతాల్లో కూడా మద్యం ప్రస్తావన ఉందనీ-ఇలా రకరకాల సంగతులు మెదడులో బీరులై పారగా అన్నీ రాసి post చేసాడు.
బీరువాదులంతా alert అయిపోయి, ఈ post అగ్రవర్ణ,భూస్వామ్య, బూర్జువా post అని, బ్రాహ్మలు తమ మంత్రాలు ఎవరికీ అర్థం కాకూడదన్న కుట్రతో వీధిలో వెళ్ళే ప్రతి వాడికీ మద్యం తాగబోయించే వారనీ, అలాగే ఆడవారు మద్యం తాగకుండా మెగా కుట్ర చేసారనీ ఇది బ్రాహ్మనికల్ మేల్ పేట్రియాట్రీ చేసిన మోసం అని ఢమఢమా పోస్టుల వర్షం కురిపించారు.
మరుసటి రోజు Admin నించి బీరేంద్రకు ఫోను వచ్చింది.
Admin: మీ post గురించి నాకు 96 private messages, 69 public mails వచ్చాయి. నలుగురు flight వేసుకుని మా ఇంటికి వచ్చేసారు. మన బీర్బల్స్ లో దూరిన ఈ అగ్రవర్ణ దురహంకారి ఎవరని వారంతా నన్ను బీరు పట్టుకుని ప్రశ్నించారు. మీరు మీ post ను తీసివేయడమే కాక అందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
బీరేంద్ర ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాడు. రాత్రికి కసికసిగా బీరు తాగి బీర్బల్స్ group నుండి exit అవడమే కాక group ని ఫోన్ నుంచి delete చేసి పారేసి హాయిగా నిద్ర పోయాడు.
మరుసటి రోజు Admin నుండి ఫోన్ వచ్చింది.
Admin: చూడండి బీరేంద్ర గారు, మన బీర్బల్స్ అంతా ఒకే కుటుంబం. మీలో చిన్నతనం ఇంకా పోలేదు. చిన్న విషయానికి మీరలా అలిగి వెళ్ళిపోతే ఎలా? మిమ్మల్ని మళ్ళీ group లో add చేస్తున్నాం.
బీరేంద్ర: (బీరానంద పడిపోతూ) అలాగేనండీ,తప్పకుండా.
మళ్ళీ బీర్బల్స్ లోకి కొత్త పెళ్ళికొడుకులా ప్రవేశించాడు బీరేంద్ర.
మరుసటి రోజు ఆఫీసు నుండి వచ్చాక group లో పోస్టులు ఏమైనా ఉన్నాయా అని చూడబోతే you are removed from group అన్న message చూసి తెల్లబోయాడు.
ఈసారి తనే group admin కి ఫోన్ చేసాడు.
బీరేంద్ర: నిన్ననే మనమంతా ఒక కుటుంబం అదీఇదీ అని డైలాగులు కొట్టారు? మరెందుకు తీసేసినట్టు నన్ను? (కోపంగా).
Admin: సభ్యుల్ని మేమే తీసెయ్యాలిగానీ వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోతే Admin కి అవమానం. అందుకే అలా వెళ్ళిపోయిన వాళ్ళని బుజ్జగించి తీసుకొచ్చి ఆ తర్వాత మేమే తీసేస్తాం. మా బీరుతో మేమే ఒక సభ్యుడిని బీరేస్తే మిగతా వాళ్ళు బీరు దగ్గర పెట్టుకుంటారు.
బీరేంద్ర కోపంగా ఏదో మాట్లాడబోయేంతలో అప్పటిదాకా బీరాలు పోతున్న Admin ఫోన్ పెట్టేసాడు.
బీరేంద్ర మళ్ళీ ఫోన్ చేయబోతే నంబరు బ్లాక్ అయినట్టు ఫోన్ బీర్ బీర్ అంది.
దాంతో బీరేంద్రకు బీరన్నా, whatsapp groups అన్నా పరమ అసహ్యం వేసి, అన్నీ బంధాలు వదిలేసి, హిమాలయాల వైపుకి బీరుపోయాడు.