ఆలాగున

  ఆ మధ్య మా ఊరికి ఓ కవి కమ్‌ రచైత కమ్‌ సమీక్షకుడు విచ్చేస్తే మిగిల్న సాహితీ భాయీ బెహన్స్‌తో నేనూ వెళ్ళా వారి దర్శనానికి.


మేము ఓ ముగ్గురం లేడీస్‌ వెళ్ళేటప్పటికి కవిగారు షార్ట్ అనబడు ఒకానొక విదేశీ వస్త్ర విశేషం ధరించి ఉండిరి. 

అయ్యో పాపం చాలా ముందుగా ముందుగా వచ్చేసినట్టున్నాం, కవిగారు ఇంకా రెడీ కాక ముందే అనుకున్నా. ఇంతలో వెనకాల ఇంకా ఓ అరడజను మంది బిలబిలా లోనికి వచ్చారు. 

ఇప్పుడిక కవీజీ సభామర్యాదకు తగ్గట్టుగా వేషం మార్చుకుని వస్తారేమో అనుకున్నాగానీ వారికి ఏ కోశానా ఆ ఉద్దేశం ఉన్నట్టులేదు. 

ఇక్కడింత మంది ఆడవాళ్ళు ఉంటే ఈయన ఆలాగున ఏలాగు? అని తలపోస్తుంటే మిమ్మల్నెవర్నీ ఆడోరుగా భావించట్లేదేమో కవిగారు అంది అంతరాత్మ ఎగతాళిగా.

ఇంతలో నాలోని కవిగాడు నిద్రలేచి, 

నేను 
 షాటేశా చూడు
 షాటేశా చూడు
నా షాటొంక
చూడకుంటే
తీసేస్తా చూడు
జంబలకడి 
జారు మిటాయా”   అని పాడుకోడం మొదలెట్టాడు.

 రేయ్‌ రేయ్‌ రేయ్‌! సంస్కారహీనుడా! ఏంట్రా ఆ పాటలు? అని కవిగాడిని గదిమింది అంతరాత్మ. 

ట్రెండీగా ఉంటాదని లేటెస్టు పాటతో పేరడీ కట్టేను బయ్యా అన్నాడు కవిగాడు అపోలజెటిక్‌గా.

ఈమాటు పాట మార్చి,

నా షాటు చూడు
నాటు 
నాటు నాటు
నాటు నాటు
పిచ్చ నాటు

అని పాడి అంతరాత్మ వంక చూసేడు. ఇది కొంచెం బెటర్‌ అంది అంతరాత్మ.

ఆమాత్రానికే పొంగిపోయి, ఓ మూలకెళ్ళి పోయి,

మనసొక
రాగిచెంబు
దాన్ని రోజూ
చింతన అనే
చింతపండుతో
తోమాలి
పరిశీలన అనే
పీతాంబరి పౌడర్తో
పామాలి

అని తనలోతాను కవిత్వం కట్టుకుంటూ కూచున్నాడు.

కవిగారిని పలకరించలేదని జ్ఞప్తికి వచ్చి బాగున్నారా? అన్నా. వారు ఆముదం,ఆవు నెయ్యి కలిపి తాగినట్టు మొహం పెట్టారు. అంటే కవిగారి గుడ్‌ బుక్స్‌లో మనం లేమన్న మాట. 

సరే ఏం చేస్తాం క్షణ క్షణముల్‌ సాహితీ జీవుల చిత్తముల్‌ అనుకుంటూ నా కవితల పుస్తకాలు కొన్ని చేతిలో పెట్టా. వాటిని చూడకుండానే పక్కన సోఫాలో పడేశాడాయన. 

చూశావా బయ్యా! మన పుస్తకాలు ఎలా పక్కన పడేసాడో అన్నాడు కవిగాడు బాధగా. 

అరసికులకు కవిత్వం వినిపించే దౌర్భాగ్యం మాలిఖ మాలిఖ మాలిఖ అన్నాడెప్పుడో కవికుల గురువు. వెంఠనే ఆ పొత్తములు తీసుకుని సంచీలో వేసుకో, అసలే కాపీలు తక్కువగా ఉన్నాయి అని ప్రబోధించింది అంతరాత్మ. అట్లే చేసితిని. కవిగారి మోములో రంగులు మారుట క్రీగంట గమనించితిని.

ఇంతలో మరి కొంతమంది లేడీస్‌ వచ్చుట, వారి వెంట హగ్గులు తెచ్చుట జరిగెను. కవిగారి మోము ముద్దమందారము వలె విప్పారుట గమనించితిని. చూశావా బయ్యా, మనకేమో ఇగ్నోర్‌ బటన్‌ కొట్టాడు. వాళ్ళు రాగానే ఎలా ప్రసన్న వదనమ్‌ పెట్టాడో అన్నాడు కవిగాడు కచ్చగా.

రేయ్‌! ఆడోరికి పైపైన విలువున్నట్టు చూపిస్తారు గానీ లోలోపల ఏ విలవా ఉండదురా. ఈ జీవితసత్యాన్ని తెలుసుకున్నావనుకో, ఎక్కడికెళ్ళినా ఓపక్కన కూచుని కళ్ళముందు జరుగుతున్నదంతా ఓ డ్రామాలా భావించి ఆనందంగా ఇంటికి వస్తావ్‌. తెలిసిందా? అంది అంతరాత్మ.

కన్విన్స్‌ కాని కవిగాడు, 

ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలి అయినారు!

జన్మమెత్తితిరా 
అనుభవించితిరా!

అని ఏవేవో సంబంధం లేని పాటలు పాడుకోసాగాడు.

ఇంతలో కవిగారు ఒపన్యాసం ఓపెన్‌ చేసి ఓపెనింగ్‌ రిమార్క్స్‌ లో భాగంగా తాను కథల్ని ఎలా కైమా కొడతాడు, కవిత్వాన్ని ఎలా కుమ్మేస్తాడు, విమర్శల్ని ఎలా మిక్సీ పడతాడో వైనవైనాలుగా చెప్పడం మొదలు పెట్టాడు.

ఈ మనిషి తన బతుక్కి ఒక్క మంచి కథైనా రాసాడా బయ్యా? తాతాచారి చెంచాలా ఎలా కురిడీ కబుర్లు చెబుతున్నాడో? అన్నాడు కవిగాడు రగిలిపోతూ. 

రేయ్‌, అందుకేరా నిన్ను కవి అనేది.
 క్రికెట్‌కి కామెంటేటర్లు, నిర్వాహకులు, బౌలర్లు, మడమ తిప్పని బాటు గాళ్ళు ఇత్యాది జనం ఎలా అవసరమో సాహిత్యానికీ అలాగే రకరకాల వ్యక్తులు అవసరం. 

పోతన పద్యాల్లో పాల్కోవాలు, అన్నమయ్య పాటల్లో వెన్నముద్దలు ఇలాంటివి మాట్లాడుతూ దేశమంతా తిరిగేవారు, ఉగాది వచ్చింది, కోయిల కూసింది; సంక్రాంతొచ్చింది,సంబరాలు తెచ్చింది లాంటి కవిత్వాలు సీజనల్‌గా పండించే ట్రెడిషనల్‌ కవులు, మూడవ శ్రేణి కథల్ని, కాకరకాయల్ని మొదటి తరగతివిగా మభ్యపెట్టి అవార్డులు రివార్డులు కొట్టుకునే ఆషాఢబూతులు ఇత్యాదిగా ఉంటారు. వీరి సంఖ్యే ఎక్కువ. ఇప్పుడున్న వాళ్ళలో  ఒరిజినల్‌ వర్కు చేయగలిగే వాళ్ళని లెక్కపెట్టాలంటే ఒక చెయ్యి సరిపోతుంది. సమజైందా? అంది అంతరాత్మ కూ‌ల్గా. 

బోయనాలు,బొట్లు అయ్యాక పూటోలు దిగుడు అనే కార్యక్రమం జరగడం తప్పని సరి కనుక ఆ సదరు కార్యక్రమంలో ఏ తత్‌ షాట్ ధారితో గంభీరంగా, జీవితంలో ఏవిధంగానూ పనికిరాని ఛాయాచిత్రాలు కొన్ని దిగి ఇంటిబాట పట్టితిమి.

వికలమనస్కుడైన నాలోని కవిగాడు, 

టప్పులు
టిప్పులు
కొందరి
డప్పులు


చీరకో
మూరకో
చిటపటా
పటపటా
కటకటా 

అంటూ దారిపొడవునా ఏవో వెర్రిపాటలు పాడుకొంటూనే ఉన్నాడు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన