హలో,కార్సికా!

 

ఈమాటు ప్రపంచ తెలుగు మహాసభలు కార్సికా ద్వీపంలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది క్రౌంచద్వీపంలోని ఓ మెగా తెలుగు సంస్థ. 


ఇక నిర్వాహకుడు పెద్దిరాజు గారికి ఫోన్లు రావడం ప్రారంభమైంది.

హలో!హలో! నేను అవధానరాజ,అవధాన గండభేరుండ,అవధాన వ్యాఘ్రాన్ని మాట్లాడుతున్నా. ఇన్ని చెప్పి నాపేరు చెప్పడం మరచా. నేను కీర్తివ్యామోహ రావుని మాట్లాడుతున్నా. హలో!హలో!

అచ్చ ఇంగ్లీషులో అవధానం నా ప్రత్యేకత. దానికి రూపశిల్పిని నేనే. ఇంగ్లీషు ప్రపంచ భాష. ఏదేశం వెళ్ళినా అంతా ఇంగ్లీషే. అందుకే ఈ బ్రహ్మాండమైన ఆలోచన నాకు కలిగి అచ్చ ఇంగ్లీషు అవధానాన్ని రూపొందించా. పృచ్ఛకులంతా ఆంగ్లంలో ప్రశ్నలడుగుతుంటే నేను తెలుగు ఛందస్సులో ఆంగ్లభాషలోనే పద్యం చెబుతా. ఇది అన్నిచోట్లా బాగా క్లిక్కయ్యింది. 

నేను మొట్టమొదటగా దీన్ని ఆఫ్రికన్‌ ఏనుగుల సఫారీలో చేసా. నా టింగ్లీష్‌ పద్యాలు విని ఏనుగుల గుంపు ఒకటి నాకు సన్మానం చేయడానికి ఘీంకరిస్తూ వచ్చింది. ఆ విషయం అర్థం కాని పృచ్ఛకులంతా కకావికలురై పరుగులు తీసారు గానీ నేను చాలా తెలివైన వాడిని కనుక టింగ్లీషులో ఏనుగుల మీద సీస పజ్జాలు చెప్పి, వాటితో ఫొటో దిగి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ఫాన్సుకి WhatsApp లో వెంటనే పంపా. అలా అన్నిచోట్లా ఇప్పటివరకూ 499 అవధానాలు చేసా. మీరు నన్ను ఎలాగూ ఆహ్వానిస్తారు కనుక కార్సికా ద్వీపంలో నా 500 వ అచ్చ ఆంగ్ల అవధానం చరిత్రలో నిలిచిపోతుంది. టిక్కెట్ పంపుతున్నారుగా?

పెద్దిరాజు: అలాగేనండీ,తప్పకుండా.

హలో!హలో! నేను భాషేష్ కరిచేల. నన్ను నేనే భాషాశాస్త్రవేత్తగా ప్రకటించుకుని నా సొంత నిఘంటువులు తిరగేసి అందరి సందేహాలు తీరుస్తూ భాషాసేవ చేస్తుంటా. మీకు తెలుసుగా. మీ ఊరు అమలాపురం పక్కనే మాఊరు ఆముదాల వలస. 

ఆముదాల వలసకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? అసలు ఆ ఊరి వారంతా సిరియానించి వచ్చారు. వారంతా వస్తూ వస్తూ ఆముదాలను వెంట తెచ్చి పంట వేసారు. అలా వలస వచ్చిన వారు అక్కడ ఆముదాలు పండించడం చేత ఆ ఊరికి “ఆముదాల వలస” అన్న పేరు వచ్చింది. మీ ఊరు అమలాపురం పేరు ఎలా వచ్చిందో చెబుతా. 

మీ ఊరివారంతా పర్షియాలోని “మల్‌” అనే ఊరినించి గుర్రాలేసుకుని ఐదువేల యేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినా ఆ ఊరి మీద బెంగతో “ఆ మల్‌ పూర్‌” అనుకుంటూ ఉండేవాళ్ళట.

 “పూర్‌” అంటే డిబ్రూ భాషలో “పోదాం” అని. అంటే, “ఆ మల్ కు పోదాం” అన్న అర్థంలో  “ఆ మల్‌ పూర్‌”,”ఆ మల్‌ పూర్‌” అని వాళ్ళంతా రోజూ అనుకుంటూ అనుకుంటూ ఉండేవారట.
 అదే అలా అలా “అమలా పురం” అయింది. 

కాకినాడ వాళ్ళంతా కార్సికా ద్వీపంనించి వచ్చారని నేనో రీసర్చి పేపరు రాస్తున్నా. మీరు నన్ను పిలిస్తే కార్సికాలో నా భాషావిశ్వరూపం చూపిస్తా.

పెద్దిరాజు: అలాగేనండీ,తప్పకుండా.

హలో!హలో! నేను వెవ్వెవ్వే వెంకోజీని మాట్లాడుతున్నా. 

ఏమయ్యా,పెద్దిరాజు, కార్సికాలో సభ పెడుతూ నన్నూ, తాతాచారిని పిలవాలని తెలీదూ? మేమిద్దరం నీకన్నా ఇరవైయేళ్ళు ముందొచ్చాం ఈ దేశానికి. 

ఈ దేశానికి రాగానే నేను మొదట చేసిన పని జంధ్యం ఉత్తరించి అవతల పారెయ్యడం. నేనో పెద్ద కమ్యూనిస్టుని. అందుకే ఈ దేశానికొచ్చా. మాతాత మా బామ్మని మామిడికాయ పప్పు చెయ్యి, కొబ్బరి పచ్చడి చెయ్యి అని చంపుకు తినేవాడు. అది చూసే నేను రెబలయ్యా. 

అందుకే ఇక్కడికొచ్చాక ఒక ఫెమినిస్టుని పెళ్ళి చేసుకున్నా. 

దానికీ నాకు రోజూ తగాదాలే. కొబ్బరి పచ్చడి మాట దేవుడెగురు, బ్రెడ్డు మీద జాం కూడా నేనే రాసుకోవాలి. అదేమంటే నీకు చేతుల్లేవా అనేదా అక్కు పక్షి.

దాన్ని ఎలాగోలా వదిలించుకుని ఓ తెల్లపిల్లని చేసుకున్నా. అది నీ ఇండియన్‌ గోల నాకొద్దు అని మూణ్ణెల్లకే పోయింది. ఇక ఈ పెళ్ళిగోల మనకొద్దు అని ఏదో సహజీవనంతో కాలక్షేపం చేస్తున్నా. 
ఇంతకీ నాకు లేడీస్‌ అంటే చాలా ఇది. “కార్సికా ద్వీపపు కన్యకామణులు” అనే పుస్తకం మొదలెట్టా. సభనాటికి పూర్తి చేసి తెస్తా. మనం అక్కడ విడుదల చేద్దాం. ఏమంటావ్‌?

ఇంతకీ తాతాచారిని మర్చిపోకుండా ఆహ్వానించు. వాడీ మధ్య ఓ బ్రహ్మాండమైన పరిశోధనాపత్రం ఒకటి తయారు చేసాడు,”బ్రౌన్‌ శోధనలో బొక్కలు” అని. ఇప్పుడు బ్రౌన్‌ దొర పంతుళ్ళకి రూపాయి అర్ధా ఇచ్చి ఊళ్ళ మీదకెళ్ళి తాటాకులన్నీ తెమ్మన్నాడా? వాళ్ళు ఆంధ్రదేశమంతా తిరిగి ఒక్కో రచనకు రకరకాల versions తిసుకొచ్చి కుప్పలు పోసి ఉండి ఉంటారు కాబట్టి ఆ రచనలకు సంబంధించిన కాలనిర్ణయం అంతా తసిబిసి అయిపోయి ఉండవచ్చునని మనవాడు కనుక్కున్నాడు. ఆ బొక్కలన్నీ కలిపి పత్రం తయారు చేస్తున్నాడు. అది కార్సికాలో సభలో చెబుతాడు. సరేనా? మనలో మనమాట, ఇది తప్పనో,కాదనో చెప్పడానికి బ్రౌన్‌ దొర బతికిలేడుగా? సరే మరి. మా ఇద్దరికీ టిక్కెట్లు బుక్‌ చేయించు. తాతాచారికి ఆస్త్మా. నాకు పైల్సు. అయినా ఫ్లయిట్‌లో కుర్ర పిల్లలు కాఫీలు, టీలు అందిస్తుంటారుగా. అవి తాగుతూ ఎల్లాగొల్లా అక్కడికొస్తాం. ఓకేనా?

పెద్దిరాజు: సరే స్వామీ. అలాగే. మీ ఇద్దరికీ ఓ నమస్కారం.

హలో! హలో! పెద్దిరాజు గారు నేను నూటొక్క శతకకర్త శతకేశ్వర్రావుని. 
మీరు కార్సికా ద్వీపంలో తెలుగు సాహితీ సభ పెడుతున్నారని తెలిసి నా తనువు పులకించింది. హృదయం పరిమళించింది. 

కార్సికా ద్వీపం అంటే ఏమిటి? మహానుభావుడు నెపోలియన్ జన్మస్థలం. వెంఠనే కాగితం,కలం తీసుకుని నిమిషానికి ఒక పద్యం చొప్పున నెపోలియన్‌ మీద వంద పద్యాలతో “కార్సికా ద్వీపకళిక” అనే శతకం రాసిపడేసా. దాన్ని మహానుభావుడు నెపోలియన్ కి అంకితమిచ్చా. మీరు దీన్ని కార్సికాలో విడుదల చేయించి, నాకు “అభినవ తెలుగు నెపోలియన్” అన్న బిరుదు దయచేస్తే దాన్ని నా తెలుగు హృదయం మీద తగిలించుకుంటా.

పెద్దిరాజు గారు ఫోన్‌ ఆఫ్‌ చేసి బీపీకి,గుండెపోటుకి,షుగరుకు కలిపి నాలుగు మందు బిళ్ళలు ఒకేసారి వేసుకుని సోఫాలో కూలబడ్డాడు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన