పోస్ట్‌! పోస్ట్‌!


 ఒక్కపొద్దు పత్రిక సంపాదక వర్గం- వెంకోజీ,భాషేష్‌,తాతాచారి అంతా ఎప్పటి వలెనే ఆ నెల పాఠకులనుండి వచ్చిన ఉత్తరాల కట్ట ముందు కూచుని ఒక్కో ఉత్తరం పరిశీలించడానికి  పూనుకుని సిద్ధమయ్యారు.


“అయ్యా,సంపాదకులు గారు, మీ పత్రికలో శ్రీ భాషేష్‌ గారు గణపతిపై వ్రాసిన “నాకే తెలియని ఏనుగు తల దేవుడు” అన్న వ్యాసం చదివి రచయిత వింత వితండవాదాలు చూసి ఖిన్నుడనైనాను. 

మచ్చుకు, “శుక్లాంబరధరం విష్ణుం” అన్నది విష్ణువు గురించని వారు లోకానికి బోధించబూనుకున్నారు. 

అది గాడిదగుడ్డు వాదమని,శుంఠాయత్వానికి నిదర్శనమని నొక్కివక్కాణిస్తున్నాను. 

విష్ణుం అంటే సర్వవ్యాపకుడన్న అర్థంలో అక్కడ వాడబడింది అని విజ్ఞులకు,ఆస్తికులకు కొన్ని వేలయేళ్ళుగా తెలుసును. 

ఇక “సర్వ విఘ్నోప శాంతయే” అన్నది చాలు ఆ శ్లోకం గణపతి గురించని. 

ఇంకా ఈ వ్యాసమంతా తప్పులతడకలు,ఉడకని పప్పులు. 

వేదాల్లో గణపతి ప్రస్తావన లేదని రాసిన రచయితకు బుర్రలో పెద్ద ఖాళీ ఉండి ఉండాలి. అప్రాచ్యుడని,నాస్తికుడని తెలుస్తోంది. ఇంకా…”

ఎవడో చాదస్తపు బ్రామ్మడు అవతల పారెయ్‌! అన్నాడు వెంకోజీ తల విదిలిస్తూ.

భాషేష్‌ మొహం గంటు పెట్టుకుని ఉత్తరాన్ని చెత్తబుట్టలో పారేసి రెండో ఉత్తరం తీసి చదవసాగాడు.

“అయ్యా, చెత్త పత్రిక చెత్త సంపాదకుడు గారు, “నాకే తెలియని ఏనుగు తల దేవుడు” అన్న చెత్త వ్యాసంలో గణపతి వేదంలో లేడని, రామాయణ భారతాల్లో లేడని ఏమోమో చెత్త వ్రాసారు. ఈ చెత్తంతా మా నెత్తిన పోసిన ఆ చెత్త రచయిత చెత్తశ్రీ అన్న కొత్త అవార్డుకు అన్ని విధాలా అర్హుడు…”

ఉత్తరం పూర్తి చెయ్యలేక చెత్తబుట్టలో దాన్ని గిరవాటు వేసాడు భాషేష్‌.

ఎవడో రైట్‌ వింగ్‌ కాషాయం గాడు, Don’t worry! అన్నాడు వెంకోజీ నిర్లక్ష్యంగా.

ఆశగా మూడో ఉత్తరం తెరిచాడు భాషేష్‌.

“సంపాదకులకు, మీ ఆస్థాన రచయిత పనిలేని మజ్ను గారు వ్రాసిన “నా ప్రియురాలు” కవిత చదివాను. అది సంపాదకుల ప్రత్యేక ఎంపికా?

  నా ప్రియురాలు
  కాకుల్ని తోలుతుంటే
 ఊర్వశిలా ఉంటుందా?

నా ప్రియురాలు
గాడిదల్ని కాస్తుంటే
రంభలా ఉంటుందా?

తమరి బొందలా ఉంది కవిత. ఇలాంటి తవికలు మళ్ళీ వేసారో మీ పత్రికా కార్యాలయానికి నేరుగా వచ్చి మా ఆవిడ చేసిన బంగాళాదుంప భౌభౌ ని మీ అందరి నోళ్ళలో కుక్కుతా. తస్మాత్‌ జాగ్రత్త!”

పనిలేని మజ్ను ఏమి రాసినా వెయ్యాల్సిందే అన్నాడు తాతాచారి అందరి మొహాల్లోకి చూస్తూ. మిగిలిన ఇద్దరూ థూ!థూ! అని మనసులో అనుకుని, పైకి నవ్వు మొహం పెట్టారు.

భాషేష్‌ నాలుగో ఉత్తరం చదవడం మొదలు పెట్టాడు.

“సంపాదకుడికి, ఎవడా తాతాచారి? చెత్తనాకొడుకు…” అని ఆపి తాతాచారి వంక చూసాడు భాషేష్‌.

అబ్బా, తిట్లు చదవకయ్యా! అన్నాడు తాతాచారి మొహం మాడ్చుకుని.


 “ఒంగోలెళ్ళాలి” కథ చదివి ఆడవాళ్ళు నేర్చుకోవాలా? ఆ ఛండాలం చదివి ఏం నేర్చుకోవాలిరా పింజారీ వెధవా!..”

అబ్బబ్బా! భాషేష్‌! తిట్లు చదవద్దన్నాను కదయ్యా! అని చిరాకు పడ్డాడు తాతాచారి. 

ఏం ఉత్తరాలయ్యా వెంకోజీ! కొంచమైనా మేనర్స్ లేకుండా? అని అరిచాడు వెంకోజీ వైపు తిరిగి.

ఎందుకు అనవసరంగా రైజవుతావ్‌? ఇలాంటి ఉత్తరాలు మనకేమైనా కొత్తా? ఇలాంటివెన్ని చూడలేదు? అన్నాడు వెంకోజీ ఆవులిస్తూ.

ఇంతలో “గే కోడలు” కథ వేసిన చెత్త నాయాళ్ళు ఎవర్రా ఇక్కడ? అని నలుగురు కర్రలు పట్టుకుని లోపలికి రాగానే భాషేష్‌ కంగారుగా చేతిలో ఉత్తరం కింద పారేసి కిటీకీలోంచి దూకి పారిపోయాడు. తాతాచారి తెలివిగా వెంకోజీని వాళ్ళ వైపుకి నెట్టి దొడ్డి దోవన పారిపోయాడు. 

వచ్చిన నలుగురూ చేత చిక్కిన వెంకోజీ బుర్ర రామకీర్తన పాడించి ఒక్కపొద్దు పత్రికని నోట్లో కుక్కి వెళ్ళారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన