భవత్‌ బీభత్స అకాడెమీ అవార్డు!

 ఈ సంవత్సరం తెలుగులో బీభత్స అకాడెమీ అవార్డు ఎవరికి ఇవ్వాలా అని వచ్చిన నామినేషన్ల జాబితా ముందేసుకుని పరిశీలిస్తున్నాడు అకాడెమీ సెక్రటరీ. 


ఇంతలో ఫోన్‌ మోగింది.


రక్తంతో
నడుపుతాను రిక్షాను
నా రక్తమే
నా రిక్షాకు
పెట్రోలు”

హలో సార్‌! నేను రెడ్‌ వీరయ్యని. 

నా కథలతో తాడిత పీడిత బడుగు బలహీన బీద సాదల ఇంకా ఇంకా చాలా పెద్ద జాబితా మీద అయిదు శతాబ్దాలుగా, సారీ, దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నా. 

ఈ పోరాటం ఆగదు!
నా ఆరాటం ఆరదు!
 
ఇన్క్విలాబ్‌ జిందాబాద్‍! 

ఇక నా “నెత్తుటి జ్వాలలు-పేగుల కేకలు” కి అకాడెమీ అవార్డు ఇవ్వకపోతే నామీదొట్టే! (ఖళ్‌‌ ఖళ్‌ మని దగ్గు).
 
మీ ప్రాంతానికి పోయినసారి ఇచ్చాంగా. మళ్ళీ మీ వంతు వచ్చేవరకూ ఆగాలి అని చెప్పి ఫోన్‌ పెట్టేసాడు సెక్రటరీ. 

మళ్ళీ ఫోన్‌ మోగింది.


  “సన్నజాజి 
  పందిరి కింద
  మెల్లమెల్లగా
  దూరి దూరి 
   పోయావంటే
   పాములుంటాయ్‌!”


హలో! నమస్కారమండీ. నేను స్వోత్కర్ష జల్పానందాన్ని. 

నేను రాసిన కోనసీమ కొబ్బరాకు కథలు చదివారా? కోనసీమ కొబ్బరచ్చు కథలు? కోనసీమ మడతకాజా కథలు? పోనీ కోనసీమ పూతరేకు కథలు? కోనసీమ సున్నుండ కథలు? మీరు చదివుండరులెండి.

నా పుస్తకాలు సంతాలీ,బెంగాలీ,టెంకణీ,కొంకణీ భాషల్లోకి అనువాదాలు చేయించా. అవన్నీ గరాజ్‌ నిండా, అటీక్‌ నిండా పేర్చా. మాయావిడ రోజూ తిట్లే. కానీ నేను పట్టించుకోను. ఆ తిట్లన్నీ నాకు పెసరట్లు.
నాకీసారి బీభత్స అకాడెమీ అవార్డిస్తే మాఇంటి హాల్లో పెట్టుకుని మాయావిడ నోరు మూయిస్తా.

నాకు సంస్కృతం వచ్చు. మీకొచ్చా? నాకు మళయాళం వచ్చు. మీకొచ్చా? నాకు కన్నడం సగం తెలుసు. అరవం పావు తెలుసు.ఒడియా ఒన్‌ ఫోర్త్ వచ్చు. మీకెంతొచ్చు? మీకవేవీ వచ్చుండవులెండి. 

ఇది విన్నారా?

ఆ రచయిత్రికి ఫిగరుందని పొగరు. 
ఈ రచయిత్రికి విగరుందని వగరు.
ఆ రచయితకి ఈ రచయిత్రి అంటే ఇది.  
ఈ రచయితకి ఆ రచయిత్రంటే అది. 
సభల్లో ఈ రచయిత్రి ఆ రచయిత పక్కన కూచుంటుంది. 
ఆ రచయిత ఈ రచయిత్రిని పొగుడుతాడు.
 ఇంకా…ఇంకా..

ఈ ఒన్‌ వే  ట్రాఫిక్ కి తట్టుకోలేని సెక్రటరీ ఈ సంవత్సరం కోనసీమ లిస్టులో లేదండీ. అయినా ప్రయత్నిస్తా అని ఫోన్‌ పెట్టేసాడు.

మళ్ళీ ఫోన్‌ మోగింది.

“దడ పుట్టిస్తా! 
నీకు దడ పుట్టిస్తా!
నా డాన్‌ అన్న పేరు చెప్పి దడ పుట్టిస్తా!
చెమట పట్టిస్తా!
నీకు చెమట పట్టిస్తా! 
నా డాన్‌ అన్న డాబు చూపి చెమట పట్టిస్తా!”


నేను వీరంగం పత్రిక జెఫ్ఫా డాన్‌ ని. 

మా పత్రికతో సాహితీ లోకాన్ని దడదడలాడిస్తున్నా. కథలతో,కవిత్వాలతో సంప్రదాయవాదుల నడ్డి విరగ్గొడుతున్నా. రాళ్ళేయిస్తున్నా. కీళ్ళు విరగ్గొడుతున్నా. ముక్కు పగలగొడుతున్నా. నా దాడికి తట్టుకోలేక ముగ్గురు రచయితలు చీమలమందు తాగారు, నలుగురు ఫినాయిల్‌ తాగారు. అయిదుగురు సాహితీరంగానికి వెన్ను చూపి పారిపోయారు.

పండగల మీద,పబ్బాల మీద,రాముడి మీద, రక్షాబంధనం మీద, పెళ్ళిళ్ళ మీద,పెటాకుల మీద మొత్తం వ్యవస్థ మీద మటన్‌ బిర్యానీలాంటి కతలు రాపిస్తా.ప్రచురిస్తా.

 జంధ్యామార్కులను కారల్‌ మార్క్సుతో కరిపిస్తా. 

నా పత్రికలో వ్రాసేవారంతా మూర్ఖశిఖామణులైన నాన్‌ జంధ్యం బ్రామ్మిన్సే. అదే కామెడీ. నేను రష్యన్‌ నుంచి అరబ్బీలోకి అనువదించిన “గాజర్‌ కా హల్వా“ అనే పుస్తకానికి ఈసంవత్సరం అకాడెమీ అనువాద అవార్డు ఇవ్వాలి. లేకపోతే అకాడెమీ మీద రాళ్ళేయిస్తా. దడ పుట్టిస్తా. చెమట పట్టిస్తా.

ఆ రెండూ దేశభాషల జాబితాలోవి కాదు కదయ్యా. సరేలే, విదేశీ అనువాదాల కింద ఏదో ఒక అవార్డు పెట్టించి నీకిప్పిస్తా అన్నాడు సెక్రటరీ వణుకుతూ చెమటలు తుడుచుకుంటూ.

మళ్ళీ ఫోన్‌ మోగింది.

కుర్రాళ్ళోయ్‌!
కుర్రాళ్ళు!
వెర్రెక్కి ఉన్నోళ్ళు!
ఆటగాళ్ళు
పాటగాళ్ళు
అందమైన
వేటగాళ్ళు!”


హలో! ఏమయ్యా సెక్రటరీ! నేను వెంకోజీని. నాకు,మా తాతాచారికి మహాకవి అరుణశ్రీతో మందు కొట్టిన చరిత్ర, మహాకవికి సిగిరెట్‌ అందించిన చరిత్ర ఉన్నాయి. మా తాతాచారి మహాకవికి కాస్ట్లీ మందు తెప్పించి, సోడా కలిపిస్తే మహాకవి మెచ్చుకుని భుజం తట్టాడు. అదీ మా బాగ్రౌండ్‌.

మా తాతాచారి కన్నాంబ,కాంచనమాల హీరోయిన్లుగా ఉన్నప్పుడు మొదటి పుస్తకం రాసాడు. తర్వాత తెలుగు సాహిత్యాన్ని గాడి పొయ్యి మీదకెక్కించి మసాలాలు కలుపుతూ ఇప్పటిదాకా సాహితీవంట చేస్తూనే ఉన్నాడు. 

వంట చేసి చేసి వాడికి ఆస్త్మా వచ్చింది. 
ఫేస్‌టైం చేస్తా చూడు,ఎలా ఎగశ్వాస తీసుకుంటున్నాడో. మంచాన పడి ఉన్నాడు. రేపో మాపో నన్నొదిలేసి రంభాఊర్వశీమేనకలను చూడ్డానికి వెళతానంటున్నాడు పిచ్చి వెధవ. 

నువ్వు ఈ సంవత్సరం అకాడెమీ అవార్డు ఇవ్వలేదనుకో, వీడు మళ్ళీ పుట్టి తెలుగు సాహితీ సేవ చేస్తానని బెదిరిస్తున్నాడు.  ఈసారి మావాడికే రావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వింటున్నావా? నీది కాకినాడేగా? నాదీ కాకినాడే! మీ ముత్తాత కనకయ్య నాకు, తాతాచారికి జూనియరు. ముగ్గురు కలిసి రోజూ ముంజెలు తినేవాళ్ళం.

ఓ,అలాగా? అయితే ఈసారి అవార్డు తాతాచార్ల వారికే. మిగతా సభ్యులతో పోట్లాడతా. రూల్సన్నీ తుంగలో తొక్కుతా. రంగారాయుడు చెఱువులో కలుపుతా అన్నాడు సెక్రటరీ ఎమోషనల్‌ అయిపోయి కన్నీళ్ళు తుడుచుకుంటూ.

కట్‌ చేస్తే,

అవార్డు ఫంక్షనుకి సాయిలాపాయిలాగా వచ్చిన తాతాచారితో మీ ఆస్త్మా ఎలా ఉందండీ తాతగారూ? అనడిగాడు సెక్రటరీ అమాయకంగా.

తాతగారేమిటయ్యా,తాత గారు? 
అస్తమానం రావడానికి అదేమైనా ఉప్మానా?
ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు అస్మదీయ ఆస్త్మాని పిలుస్తూ ఉంటాం అని వెంకోజీ,తాతాచారి విఠలాచార్య సినిమాలో బ్రహ్మరాక్షసుల్లా హహ్హహా అని విరగబడి నవ్వుతుంటే సెక్రటరీ సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడిలా తెల్లబోయి స్టాట్యూలా నిలబడిపోయాడు.

ఆనక, ఒక్కపొద్దు పత్రిక తాతాచారి కాల్గేట్‌ యాడ్‌ ఫొటో వేసి బీభత్సంగా పొగడ్తల అగడ్తలు తవ్వి చతికిల పడితే, తెలుగు సాహితీ మాత చీపురుకట్టతో అకాడెమీ సెక్రటరీ వెంటపడి రాజధాని వీధి వీధీ పరిగెత్తించింది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన