నే చెప్పలే? చెప్పలే?చెప్పలే?

 పాఠకుడు: అయ్యా, భాషాశాస్త్రపరిశోధకులు గారు,మీ భాషావ్యాసాలు నాకు కొరకరాని కొయ్యలుగాను,మాయావిడ అప్పుడప్పుడూ చేసే రాళ్ళలాంటి మైసూరుపాకుల్లాగాను ఉంటవి. అయినా కష్టపడి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. మా ఇంటి పేరు “రావులపిండి” వారు. దాని పుట్టుపూర్వోత్తరాలు తెలియజేయగలరు.


భాషేష్‌: మీ పూర్వీకులు రేవుల వద్ద పిండి అమ్మేవారు కావచ్చును. “రేవుల” అన్న పదం కాలక్రమంలో “రావుల” అయి ఉండవచ్చును. లేదా మీ పూర్వీకులు పంజాబులోని “రావల్పిండి” నుండి వచ్చి ఉండవచ్చును.

పాఠకుడు: అయ్యో,అయ్యో, పిండి అమ్ముకోవడమేమిటి ? మేము తరతరాలుగా కోనసీమలో వేదపండితులమయ్యా నాయనా!

భాషేష్‌: మీరు రావల్పిండి నుండి నడుచుకుంటూ కోనసీమకు వచ్చి, కోనసీమ రేవుల్లో పిండి అమ్ముతూ ఆ తర్వాత ఎప్పుడో వేదం నేర్చుకుని ఉండవచ్చు. ఇంకా వివరాలు పంపండి, ఊహించి చెప్తా.

పాఠకుడు: ఓరి నీ భాషాశాస్త్రం తగలెయ్య! నా బొందలా ఉంది నీ వివరణ. కాస్త గాయత్రి చెయ్యి, నీ బుద్ధి దారిలోకొస్తుంది. 

భాషేష్‌: “గాయ్‌” అన్నది పర్షియానుండి, “త్రి” అనేది ధృవప్రాంతాల నుండి వచ్చిన పదాలు.

పాఠకురాలు: సినిమాల్లోను, వీడియోల్లోను, శృంగార సన్నివేశాల్లో అన్నమయ్య పాటలు,త్యాగయ్య పాటలు వాడ్డం గురించి ఏమంటారు? 

భాషేష్‌: అలాంటి క్లాసిక్సుని ఎవ్వరైనా,ఎలాబడితే అలా వాడుకోవచ్చని మెసపటేమియా మేధావి బాల్మర్‌ సిద్ధాంతీకరించాడు. 
కాబట్టి అది వాకే.

పాఠకురాలు: ఎలాబడితే అలా వాడ్డం ఏమిటండీ? వాటికో పవిత్రత లేదూ? అవి ఎవరి మీద,ఏ భావంతో చెప్పారో దృష్టిలో పెట్టుకోకుండా హీరోల మీద, హీరోయిన్ల మీద పాడ్డం ఏమిటండీ ఖర్మ?

భాషేష్‌: “పవిత్రత” అన్నది భారతీయ పదం కాదు. సైబీరియానుండి వచ్చిందని అజర్‌బైజాన్‌ మేధావి అల్మోరా సెలవిచ్చాడు. కాబట్టి అది మనకు వర్తించదు.

పాఠకయ్య: ఆవిడెవరో విదేశీయురాలు మన గ్రంథాలను తిడుతూ పుస్తకం రాస్తే మీరు సమర్థించారు. ఎందుకు? 

భాషేష్‌: తిట్టడం భావవ్యక్తీకరణ. ప్రజాస్వామ్య హక్కు. ఈ తిట్టుకోవడం పూర్వంనించీ ఉంది. వాటిని శాస్త్రచర్చలు,వేదాంత చర్చలు అనేవారు.

పాఠకయ్య: తిట్టడం శాస్త్రచర్చ ఎలాగవుతుందయ్యా స్వామీ? 

భాషేష్‌: “వసుధైక కుటుంబకమ్‌”, “ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి” అని మనవాళ్ళే చెప్పారు. అందుకని ప్రపంచంలో ఎవ్వరైనా మనల్ని ఎంతైనా తిట్టవచ్చు. మనం గమ్ముగా వింటూ ఉండాలి. ఎదురు మాట్టాడరాదు.

పాఠకయ్య: దున్నబోతే దూడల్లో, మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్టుంది నీ యవ్వారం.
 
రామాయణ మహాభారతాలనుండి,పురాణాలనుండి,
ఉపనిషత్తులనుండి సారాన్ని గ్రహించి ఆధ్యాత్మికంగా ఎదగాల్సిందిపోయి, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నావంటే నీది ఇదే మొదటి మానవ జన్మ అని తెలుస్తోంది. పరిణామక్రమంలో ఆధ్యాత్మిక స్థాయికి రావాలంటే ఇంకో వంద జన్మలు ఈజీగా పట్టేటట్టుంది.

భాషేష్: “ఆధ్యాత్మిక” అన్న పదంలో “ఆధ్‌” అన్న మూల ధాతువు ఆర్మీనియానుండి, “ఆత్మిక” అన్నది కొరియానుండి, 1 వ శతాబ్దంలో ఆర్కోగాలో అన్న విదేశీ యాత్రీకుడు తీసుకొచ్చి చోళుల రాజ్యంలో మొదట వదిలాడు. కాబట్టి ఆధ్యాత్మికానికి మనదేశానికీ ఏసంబంధమూ లేదు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన