తాతా,ఊతునా?

 క్రౌంచద్వీపంలో తెలుగు ప్రొఫెసర్ గా కొలువు చేస్తున్న  తాతాచారి సూటూబూటు వేసుకుని తెలుగు వాళ్ళ తెలుగు సభలో ప్రసంగించడానికి డాబుగా వెళ్ళాడు.


అన్నింటికీ ఈలలు,చప్పట్లు కొట్టే సభికుల మందలో,
దురదృష్టవశాత్తూ  ఓ తెలివైన తెలుగువాడు కూర్చున్నాడు. 

తాతాచారి: తెలుగు కూతురులాంటిది. ఎవరి కూతురు వాళ్ళకి అందంగా ఉంటుంది. నీ కూతురు బాగోలేదని ఎవరూ అనరుగా. కాబట్టి తెలుగు అందమైన భాష అని మనలో మనం అనుకోవడమే. 
హిహ్హిహ్హీ.. 

చప్పట్లు, నవ్వులు.

తెలివైన తెలుగువాడు (మనసులో) : అదేమిటీ? భాష తల్లిలాంటిది కదా? కూతురులాంటిది అంటాడేమిటి? తల్లి ఎలా ఉన్నా అందమైనది కాదా? అనుకుని, ఇంకా నయం girl friend లాంటిది, ఎవడి girl friend వాడికి అందంగా కనిపిస్తుంది,అనలేదు. ఏదో తేడాగాడిలా ఉన్నాడే?

తాతాచారి: మనలో మనం తెలుగు అందమైనది,గొప్పది అనుకుంటే చాలదు, ఇంగ్లీషు వాళ్ళు, పోనీ  ఫ్రెంచివాళ్ళతో నిండి ఉన్న సభలోకి వెళ్ళి ఈమాట అనండి,చూద్దాం? ఎవడైనా ఒప్పుకుంటాడేమో? హిహ్హిహ్హీ.. 

చప్పట్లు, నవ్వులు.

తెలివైన తెలుగువాడు (మనసులో): ఎందుకు చెప్పలేను? ఎక్కడైనా చెప్పగలను. నా భాష గొప్పదని చెప్పుకోవడాన్ని ఎవ్వడైనా అర్థం చేసుకుంటాడు. ఒకడు ఒప్పుకోవడంతో పనేంటి అసలు? కొసవెర్రి కాకపోతే.

తాతాచారి: మనకు వేరే భాషలేవీ సరిగ్గా రావు కాబట్టి తెలుగు గొప్ప భాష అనుకుంటున్నాం.

చప్పట్లు, నవ్వులు.

తెలివైన తెలుగువాడు: హారి,వెర్రి పీనుగా!  ఒక తెలుగు ప్రొఫెసరు నోటినించి తెలుగును గురించి ఇలాంటి దగుల్బాజీ మాటాలా? ఎంత దౌర్భాగ్యం!

తాతాచారి: మనమంతా స్వార్థపరులం. అందుకే మనం ఈ దేశానికి వచ్చాం. మన పిల్లలు తెలుగులో పండితులవ్వాలని మనకేమీ లేదు. 

నవ్వులు.

తె.తె (మనసులో) : ఎవడు చెప్పాడ్రా నీకు? 

తాతాచారి: మన పిల్లలకు తెలుగు రావాల్సిన అవసరం లేదు. మనం తెలుగువాళ్ళం అని తెలిస్తే చాలు.

తె.తె (మనసులో): ఓరి త్రాష్టుడా! తెలుగు సభలో ఇదా నువ్వు చెప్పేది?

తాతాచారి: మనం మన పిల్లలకి తెలుగు నేర్పాలన్నా నేర్పలేం. ఎందుకంటే మనకే తెలుగు రాదు. హిహ్హిహ్హీ.. ఉదాహరణకు “మీ అమ్మ” అని ఎందుకు అనాలి? “నీ అమ్మ” అని ఎందుకు అనకూడదు? అని పిల్లలు అడిగితే మనం చెప్పగలమా? హిహ్హిహ్హీ…

తె.తె (మనసులో): ఓరి,అప్రాచ్యపు వెధవా! మా పిల్లలకి తెలుగు నేర్పుకోలేని వెధవలమని మాకే నువ్వు చెప్పడం. దానికి ఈ గొర్రెలు చప్పట్లు కొట్టడం. నువ్వో తెలుగు ప్రొఫెసరువి. తెలుగుకి ఏమి దరిద్రం పట్టిందిరా నాయనా!

తాతాచారి: మీ పిల్లలకి తెలుగు నేర్పక్కర లేదు. మనం తెలుగు వాళ్ళం అని చెబుతూ ఉంటే చాలు. కానీ, చెయ్యాల్సింది ఒకటుంది. మీరు మీ జేబులు ఖాళీ చేసి, మన క్రౌంచ ద్వీపంలో ఉన్న బర్కాలీ,టెక్కలీ,అనార్కలీ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీటాలు పెట్టడానికి డబ్బు పెట్టుబడి పెట్టాలి. పిల్లలకి తెలుగు నేర్పడం కన్నా అది చాలా ఈజీ. అందులో ఫ్రెంచివాళ్ళు,ఇటలీ వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు వచ్చి తెలుగు మీద పరిశోధన చేస్తారు.

తెలివైన తెలుగు వాడు ఇంక ఉండబట్టలేక తన కుర్చీలోంచి పైకి లేచి, థూ! ఇదో తెలుగు ప్రొఫెసర్ ఉపన్యాసమా? సిగ్గు లేదూ? అన్నాడు ఆవేశంగా.

అది చూసి, తెలుగు వాళ్ళకి తెలుగు గురించి ఆవేశం రాకూడదే? మీరసలు తెలుగు వారేనా? హిహ్హిహ్హీ.. అన్నాడు తాతాచారి ఏమాత్రం తొణక్కుండా.

మిగిలిన మందనుండి సపోర్ట్ లేకపోవడం చూసి తెలివైన తెలుగు వాడు అక్కడినుండి నిష్కృమించాడు. 

తాతాచారి ప్రసంగం ముగిసిన వెంటనే “తాతా,ఊతునా?” అన్న తెనాలి రామలింగడి నాటకాన్ని తెలుగు బడి పిల్లలు ప్రదర్శించడం విశేషం.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన