వాయించడ్రా భజంత్రీలు!


 వెంకోజీ: ఈనెల మన  ఒక్క పొద్దుకి పెళ్ళి మంత్రాల మీద ఓ వ్యాసం రాద్దామనుకుంటున్నానోయ్‌!


భాషేష్‌: మంత్రాలు,తంత్రాలు మనకేమొచ్చు గురూజీ?

వెంకోజీ: పెద్ద ముండావాడిని కాబట్టి పెద్ద మనిషిని కూడా అయి ఉంటానని ఈమధ్య నన్ను పెళ్ళి పెద్దగా పిలుస్తున్నారోయ్‌. ఆ అనుభవంతో పెళ్ళి మంత్రాలన్నీ cut copy paste చేసి తాత్పర్యాలతో ఓ వ్యాసరూపం ఇస్తా. 

భాషేష్‌: ఆ మంత్రాలు ఎక్కడైనా దొరుకుతాయి కదా గురూజీ? అలా మంత్రాలు గుదిగుచ్చితే వ్యాసం ఎలా అవుతుంది? 

వెంకోజీ: వ్యాసంలా కనిపించేటట్టు built up ఇస్తానోయ్‌. దీని మీద పాఠకుల్నించి ఎంత ప్రతిస్పందన వస్తుందో నువ్వే చూస్తావుగా.

అలా ఆ నెల “పెళ్ళినాటి ప్రమాణాలు” అన్న వెంకోజీ వ్యాసం ఒక్కపొద్దులో ప్రత్యేక వ్యాసంలా ప్రకటింపబడింది.
 
అనుకున్నట్టుగానే ఆస్థాన పాఠకులంతా స్పందించారు.

తాతాచారి: పెళ్ళి గురించి మావాడు రాసిన వ్యాసం చదివి నాకు వెంఠనే పెళ్ళి చేసుకోవాలని సరదా పుట్టింది సుమండీ. అంత బాగా వ్రాసాడు మావాడు. వాడిని నేను, నన్ను వాడు ఎంత పొగిడినా తక్కువే. 

ఇంతకీ ఈ పెళ్ళి మంత్రాలు ఎవడికీ అర్థం కావు. ఎందుకంటే మనకు సంస్కృతం రాదు. మనకి తెలుగూ రాదు. తెలుగు ప్రొఫెసర్ని నాకే తెలుగు సరిగ్గా రాదు. ఇంక మీకేం వస్తుంది? కాబట్టి మంత్రాలన్నీ ఇంగ్లీషులో పెట్టాలని ఓ పేద్ధ పుస్తకం రాసా. దానికే నాకు బీభత్స ఆకాడెమీ అవార్డు ఇచ్చారు. 
ఈ మహత్తర వ్యాసం ప్రకటించినందుకు వెంకోజీ గాడికి మరోమాటు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

భాషేష్‌: వ్యాసం చాలా బాగుంది. 

అసలు “పెళ్ళి” అన్న పదం పెళ్‌+ఇళ్‌ అన్న గాలపాగోస్‌ భాషా కుటుంబపు పదాల కలయిక వల్ల ఏర్పడింది.

 “పెళ్‌” అంటే “ఫెళ్ళుమని” అని అర్థం. “ఇళ్‌” అంటే “మార్పు“ అని. ఫెళ్ళుమని జీవితంలో వచ్చే మార్పే “పెళ్ళి” అన్న మాట. 

అలాగే పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు పరంబైనప్పుడు పెళ్ళి మంత్రాలు పుడతాయి. వాటి పుట్టుపూర్వోత్తరాల గురించి మరోమాటు వ్యాసం రాసి వదులుతా.

పనిలేని మజ్ను: హేంటి,వెంకోజీ గారు,ఉన్నట్టుండి నాస్తిక్‌,నాన్‌-జంధ్యం బాచి‌ నించి బ్రామిన్‌ అయుపోయారా హేంటి? పెళ్ళి certificates జారీ చేస్తున్నారా హేంటిప్పుడు? అసలు పెళ్ళెందుకు,పెళ్ళి? 

నాస్తిక రెబలయ్య: మేము పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ పంతుళ్ళని పిలవడం, మంత్రాల తంతు ఏమీ పెట్టుకోం. అయ్యన్నీ time waste యవ్వారాలు. 

ఈ రోజునించీ ఈమె ఇతనికి భార్య. ఇతను ఈమెకి భర్త. అని స్టేజీ మీద ప్రకటించి చెత్త కాయితాల దండలు మార్పిస్తాం. తర్వాత వెంటనే ఆ దండలు చెత్త సామాన్లకి ఉల్లిపాయలిచ్చే వాడికిచ్చేసి ఆ ఉల్లిపాయలతో సాంబారు కాచి పెళ్ళికొచ్చిన వాళ్ళకి వడ్డిస్తాం. అదే మా పెళ్ళి.

లిబరల్‌ లింగమ్మ: పెళ్ళి లేదు,గిళ్ళీ లేదు. Only కిళ్ళీ. సారీ, only సహజీవనం. అదే మన మోటో. 

ఫెమినిస్ట్ మంగమ్మ: అసలు  పెళ్ళి మంత్రాల అర్థాలు తెలిస్తే ఆడోళ్ళు ఉరేసుకుంటారు. ఈ పిల్లని అందంగా చెయ్యమని ఇంద్రుడిని ప్రార్థించే మంత్రం ఒక్కటి చాలు. ఆడవాళ్ళు సిగ్గుతో చచ్చిపోవడానికి. హవ్వ! 

వీర స్పర్ధయ్య: మేం మా సొంత మంత్రాలు తెలుగులో రాసుకుని మా పెళ్ళిళ్ళలో మా కులం పంతుళ్ళ చేత చదివించుకుంటాం. మీ మంత్రాల కన్నా మా మంత్రాలే గొప్ప.

ఫొటోగ్రాఫర్‌ పోజయ్య:  పెళ్ళి మంత్రాలు చదివే పంతులు అన్నింటికీ అడ్డమే. అసలు పెళ్ళి చేయించేదే నేను. నేను ఎన్నిసార్లు ఎన్ని రకాలు పోజులిమ్మంటే పెళ్ళి తంతుతో సంబందం లేదు, నా కెమెరాకి పోజివ్వాల్సిందే. మొన్నొక పెళ్ళిలో తాళి కట్టే పొటో సరిగ్గా రాలేదంటే కట్టిన తాళి విప్పించి మళ్ళీ కట్టించా. పంతుళ్ళని తీసేసి ఆ డబ్బులేవో నాకిత్తే మొత్తం పెళ్ళి నేను చేయిపిత్తా.

పెళ్ళి పురోహితుడు: బాబూ, మీ పత్రికలో పెళ్ళి మంత్రాలు ప్రకటించారని ఎవరో చెప్పగా ఇప్పుడే చూచాను. బాబూ, మంత్రాలు, వాటి అర్థాలు తప్పుల తడకలుగా ఉన్నాయి. వ్రాసిన వారి అర్హత ఏమిటో తెలుసుకోగోర్తాను. ఇంకా ఇక్కడి వ్యాఖ్యలు చదివి నా బుర్ర తిరిగిపోయింది. 
అసలు వీరంతా భారతీయులేనా? హిందువులేనా? అని గొప్ప అనుమానం వచ్చింది. ఎంత గొప్ప అర్థం కలవి మన మంత్రాలు. పెళ్ళి మంటపం మీదకు దేవతలను ఆహ్వానించి వారి సమక్షంలో జరిపించే గొప్ప ఉత్సవం వివాహం.

తను చేసుకోబోయే కన్య పట్ల తనకు అనురక్తి కలిగేలా, తన కంటికి అందంగా కనిపించేలా చేయమని ఇంద్రుని ప్రార్థించడం గొప్పగా కనిపిస్తోంది కానీ తప్పుగా ఎందుకు కనిపిస్తుందో నాకర్థం కాలేదు. 

దయచేసి పెళ్ళి మంత్రాలను, పెళ్ళి చేయించే బ్రహ్మ గారిని గౌరవించండి. అప్పుడే పెళ్ళి తంతుకి సార్థకత.

పనిలేని మజ్ను,నాస్తిక రెబలయ్య, లిబరల్‌ లింగమ్మ,ఫెమినిస్టు మంగమ్మ తదితరులు: 

నీకీ సీన్లో డైలాగులు లేవయ్యా పంతులు! నోటికి చెయ్యడ్డం పెట్టుకుని అవతలికి పో. 

వెంకోజీ: ఈ వ్యాసం సహృదయులైన పాఠకులైన పనిలేని మజ్ను, లిబరల్‌ లింగమ్మ తదితరుల కోసం వ్రాయబడ్డది. పంతులు గారి వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఇటువంటి తిరోగమన వ్యాఖ్యలు మా ప్రొగ్రెసివ్‌ పత్రిక నియమాలకు విరుద్ధం కనుక పంతులు గారి వ్యాఖ్యను తొలగిస్తున్నామని తెలియచేయటానికి పత్రికా సంపాదకులమైన మేము మిక్కిలి విచారిస్తున్నాం.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన