తాతాచారి కల



తాతాచారి తెలుగు నేలకు భారంగా అనేక సంవత్సరాలు బ్రతికి ఓ రోజు అందర్లాగే పైకి పోయాడు. ఈ “హఠాత్‌” ఘటనకు భాషేష్‌, వెవ్వెవ్వే వెంకోజీ, చండ్ర హింసారావు తదితర మిత్రులంతా వలవలవలా ఏడుస్తూ ఎలిజీలు వ్రాయడం మొదలు పెట్టారు. 

ఈ ఏడుపంతా పైన్నించి విని తాతాచారి చిరాకు పడ్డాడు. 

రేయ్‌! సన్నాసుల్లారా! నేను పైన అప్సరసలతో కాలక్షేపం చేయవచ్చునని ఆనందిస్తుంటే మీ దిక్కుమాలిన ఏడుపులేంట్రా? అని ఓ అరుపు అరిచేటప్పటికి మన జీరోలంతా మనకెందుకొచ్చిన గోల అని ఫేక్‌బుక్కులు మూసుకుని ఎవరిళ్ళకు వాళ్ళు పోయారు. 

తాతాచారి రాకను గమనించి, తన ఆస్థాన రంభా ఊర్వశి మేనక తదితర దేవతాస్త్రీలను తాను కాపాడుకోవాలి కనుక ఇంద్రుడు వెంటనే తాతాచారిని అడ్డగించమని ద్వారపాలకులను ఆజ్ఞాపించాడు. 

తాతాచారి హిహ్హిహ్హిహ్హీ అని చిన్న పిల్లాడిలా నవ్వు మొహం పెట్టి భూలోకంలో మనుషులను బుట్టలో వేసినట్టే స్వర్గలోక ద్వారపాలకులను బుట్టలో వేద్దామని రెండడుగులు వేసాడో లేదో ఇద్దరు జీవులు ఆ ద్వారాల వద్ద కేకలు వేస్తూ కనిపించారు.  

దగ్గరకెళ్ళి చూద్దుడు కదా, వారిలో ఒక జీవి మహాకవి అరుణశ్రీ, మరొక జీవి మహా రచయిత హలం. 

స్వర్గలోకంలోకి ప్రవేశం కల్పించాలని నినాదాలిస్తున్నారు.

“మరో ప్రపంచం” పిలిచిందని భూలోకంలో కేకలు వేసేవాడివి కదా, ఆ మరో ప్రపంచానికే వెళ్ళు అంటున్నాడో ద్వారపాలకుడు అరుణశ్రీతో.

“స్త్రీ” నీకు స్వర్గలోక ద్వారాలు తెరుస్తుందని బతుకంతా వ్రాస్తూ పోయావుగా. ఆ స్త్రీ ఎవరో ఆవిడ దగ్గిరికే వెళ్ళు అంటున్నాడు మరో ద్వారపాలకుడు హలంతో. 

అయితే మాకు స్వర్గప్రవేశం లేదన్న మాట. మరి విశ్వనాథను రానిచ్చారా? అని అడుగుతున్నారు ఇద్దరూ కోరస్‌గా.

ఆయన రామాయణ కల్పవృక్షం వ్రాసి విష్ణు సాయుజ్యం పొందాడయ్యా! 
అంటున్నారు ద్వారపాలకులు.

మరి, పుట్టపర్తి?

శివతాండవం వ్రాసి శివ సాయుజ్యం పొందాడు.

అంతా హంబక్‌! నేన్నమ్మను. అంటున్నాడు మహాకవి అరుణశ్రీ సిగిరెట్‌ వెలిగిస్తూ. పొగ తాగకపోతే దున్నపోతై పుడతానేమోనని లోలోపల భయపడుతూ.

ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న తాతాచారి వాళ్ళిద్దర్నీ పలకరిద్దామని ముందుకు రెండడుగులు వేసాడో లేదో, 
ఇద్దరు యమభటులు ప్రత్యక్షమై-
తాతాచారి జబ్బలు పట్టుకుని బరబరా ఇడ్చుకెళ్ళి నరకంలో యమధర్మరాజు సమక్షంలో నిలబెట్టారు.

చిత్రగుప్తుడు తాతాచారి చిట్టా విప్పి చదువసాగాడు.

చిత్ర: ప్రభూ, ఇతగాడు తెలుగు ఆచార్య పదవిలో ఉండి తెలుగును హేళన చేస్తూ సభల్లో ప్రసంగాలు చేసేవాడు.

యమ: తెలుగు ఆక్షరాలతో వీపు మీద వాతలు వెయ్యండి. రోజూ తెలుగు పుస్తకాలు తినిపించండి.

చిత్ర: తెలుగు కోసం జీవితాలను ధారపోసిన వారిని కించపరుస్తూ తెలుగు పత్రికల్లో వ్యాసాలు వ్రాసేవాడు ప్రభూ!

యమ: రోజుకి వెయ్యి సార్లు తెలుగు గుణింతాలు వ్రాయించండి. తెలుగు మురిక్కాలువ నీళ్ళు తాగించండి.

చిత్ర: భారతదేశ సంస్కృతిని అవహేళన చేసేలా, ప్రజలను తప్పుడు మార్గంలో వెళ్ళేందుకు ప్రోత్సహించేటటువంటి కథలు,రచనలు గొప్పవని పొగుడుతూ ఇతగాడు వ్యాసాలు వ్రాసేవాడు ప్రభూ!

యమ: ఔరా! యముండ! వీడిని భారతదేశానికి దూరంగా ఎడారి దేశాల్లో వ్రాయడానికి చెయ్యి, వాగడానికి నోరు లేని లొట్టిపిట్టగా పుట్టించి బతుకంతా సామాను మోయించండి. ఆ తరువాత సలసల కాగే బజ్జీల భాండీలో వేసి…

వద్దు! వద్దు! అని అరుస్తూ నిద్ర లేచాడు తాతాచారి.

ఏవిటా అరుపులు? సుబ్బయ్య హోటెల్‌ నుంచి ఇడ్లీ, గట్టి చెట్నీ తెచ్చాను. మొహం కడుక్కుని వచ్చి తిను అంది తాతాజీ  గార్ల్ ఫ్రెండ్‌.

హమ్మయ్య! ఇదంతా కలా? కొంచెంలో దడుపు జ్వరం తెచ్చుకుందును. అనుకుంటూ, ఇడ్లీలు తింటూ, జనం మర్చిపోకుండా ఉండాలంటే ఎప్పుడూ ఏదోటి రాస్తూ చలామణీలో ఉండాలి అన్న తన గురువు శుక్రాచార్య నీతి ప్రకారం, ఓ వ్యాసం వ్రాయడం మొదలెట్టాడు.

తాను మొదటి పానిపట్టు యుద్ధకాలంలో వ్రాసిన “బబితా విప్లవాల స్వరూపం”లో బబిత లిప్‌స్టిక్‌ వేయడం ఒక విప్లవం అని, బబిత కొప్పులో రోజ్‌ పెట్టడం ఒక విప్లవమని, బబిత సిల్క్ చీర కట్టడం ఓ విప్లవమని తాను ఎంత చెప్పినా ఆనాటి పాఠక జనం ఉత్త పాటక జనం కనుక తానలాటి గొప్పవాడి గొప్ప గొప్ప ఉద్దేశ్యాలను అర్థం చేసుకోలేపోయిందని, తన బబితను మరలా ఈనాటి పాఠకులకు గుర్తు చేస్తూ ఒక్క పొద్దు పత్రికకు వ్యాసం పంపితే- వెంకోజీ తదితరులు దాన్ని గురూచ్చిష్టంగా కళ్ళకద్దుకొని ప్రచురించి కామెంట్లతో చదువరులకు మెంటలెక్కించి వదిలారు.

 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన