మీరేంటో? మీ విదానాలేంటో?


 

ఏమీ తోచక ఫేస్బుక్‌ తెరిచాడు సామాన్య రావు. అక్కడి పోస్టులు చదవడం మొదలు పెట్టాడు కాలక్షేపానికి. 


ఫేస్బుక్‌ మేధావి1: మీరు చెప్పేదీ కరక్టే. ఆయన చెప్పేదీ కరక్టే. మీరు చెప్పేదాంట్లో పాయింటుంది, ఆయన చెప్పేదాంట్లో పాయింటుది. 👍

ఫేస్బుక్‌ మేధావి2: మీరు నిన్న పెట్టిన పోస్టు గురించి పనులు మానుకుని రాత్రంతా ఆలోచించా. మీరు చెప్పిన దాంట్లో సామాజిక కోణాన్ని అంగీకరిస్తున్నా. ఆర్థిక కోణాన్ని 60 శాతం మాత్రమే ఆమోదిస్తున్నా. రాజకీయ కోణాన్ని మీరు విస్మరించారని విమర్శించడానికి నాకు మన ఆత్మీయ కోణం అడ్డు వస్తోంది. 🙏

ఫేస్బుక్‌ మేధావి3: సాహిత్యంలో రచయిత్రుల అందానికి ప్రాముఖ్యత ఉంటుందన్న మాటను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేనైతే అందానికి అస్సలు ప్రాధాన్యత ఇవ్వను. పక్కన్నించి అందమైన అమ్మాయి వెళుతుంటే నేను చచ్చినా చూడను. ఎందుకైనా మంచిదని అందంగా లేని అమ్మాయిలతోనే friendship చేస్తా. పుస్తకం వెనక్కి తిప్పితే అక్కడున్న రచయిత్రి ఫొటో చూడాల్సి వస్తుందని, ముందు పుస్తకానికి అట్ట వేసేసి తరువాత పుస్తకం తెరుస్తా. 😌 

ఫేస్బుక్‌ మేధావి4: మీ పోస్టులో కిందనించి రెండో వాక్యము, పైన్నించి మూడో వాక్యము బాగున్నాయి. 👏

ఫేస్బుక్‌ మేధావి5: నీ రచనలు లేని సాహితీలోకాన్ని ఊహించలేను. నీకు నా తోడు,నీడా ఎప్పుడూ ఉంటాయి. నువ్వు రాసే వ్యక్తిగత విషయాలు రోజూ చదవడం నాకో హాబీ. నీ ప్రేమ కథలకు ఎడిక్ట్ అయ్యా. నీ రచనలు జర్మన్‌ రచయిత హెర్మన్‌ రచనలకి, హంగేరియన్‌ రచయిత బర్మన్‌ రచనలకి దగ్గరగా ఉంటాయి. Keep writing! 👍👍👏👌

ఇంత వరకూ చదవగానే సామాన్య రావుకి బుర్ర తిరిగి పోయింది. తలనెప్పి మొదలైంది. ఫేస్‌బుక్‌ logout చేసి టీవీ పెట్టాడు. అప్పుడు రావు రమేష్‌ వచ్చి చెప్పిన మాటకు సామాన్య రావు కార్పెట్‌ మీద పడి పొర్లి పొర్లి నవ్వాడు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన