అగ్గిపుల్ల-సబ్బు బిళ్ళ-సుబ్బ లక్ష్మి
సుబ్బ లక్ష్మి అందర్లాంటి గృహిణే కానీ ఆవిడలో ఓ కవి గాడు ఉండి ఆవిడని నానాక ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. చూసి చూసి ఓరోజు సుబ్బ లక్ష్మిలోని అంతరాత్మ కవిగాడిని కూర్చోబెట్టి క్లాస్ పీకడం ప్రారంభించింది.
రేయ్, ఎప్పుడు చూసినా ఓ కవిత రాయి, కథ రాయి, పుస్తకం చదువు అని సుబ్బ లక్ష్మి ని వేపుకు తింటూ ఉంటావ్. ఆవిడ పాపం నీ గురించి సవాలక్ష పనులు పక్కన పెట్టి, ఓ కవితో,కథో రాస్తుంది. నువ్వు అంతటితో ఊరుకోవు. ఇంకా బాగా రాలేదు,ఇంకా మెరుగులు దిద్దు అని సణుగుతూ ఉంటావ్.
చందమామను చూస్తే ఆగిపోతావ్. పూలను చూస్తే ఆగిపోతావ్. పక్షులను చూసి నిలబడిపోతావ్. ఎట్టరా నీతో? సుబ్బ లక్ష్మి ఇంటో పని చేసుకోవద్దా?
పాపం ఇంట్లో ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటూ ఉంటే సాహితీ సభకి వెళ్దామని నస పెడతావ్. వెళ్ళిన వాడికి ఊరికే ఉండకుండా ఏదో ఒక తింగరి పని చేస్తావ్.
మొన్నోసారి వక్త గారు విసిరిన చెణుకుకి అన్ పార్లమెంటరీగా విరగబడి నవ్వడమే కాక పక్కనున్న సాహితీజీవి వైపుకి ఆ నవ్వుని పాస్ చేసావ్. ఆయన గారు పక్కన భార్య ఉండడంతో సుబ్బ లక్ష్మి నవ్వు చూసీ నవ్వాలా వద్దా అన్నట్టు మొహం ఇబ్బందిగా పెడితే పక్కనున్న ఆయన ఇల్లాలు నేనిక్కడే ఉన్నాను సుమీ అన్నట్టు, బాగున్నారా? అని అక్కడినుంచి సైగ చేసి, ఆ తరువాత మీ ఆయన ఏడీ? మీ పిల్లలు ఎక్కడ? అని అక్కడినించి ఆవిడ చేసే సైగలకి ప్రతి సైగలతో విడమర్చి చెప్పేటప్పటికి అక్కడ వక్త ఏం చెప్తున్నాడో అది మిస్సైపోయి ఆ ప్రసంగంతో నాన్ సింక్ అయిపోయింది.
సాహితీ సభలో కనిపించిన సాహితీజీవిని చూసి చిన్నప్పుడు నువ్వు గోళీలాడుకున్న స్నేహితుడిని చూసినట్టు అలా ఎక్కువెక్కువ సంతోషం చూపించకురా నాయనా, కొన్ని సామాజిక మర్యాదలుంటాయి, దాని ప్రకారం నడువరా అంటే వినవు. ముందు సాహితీ జీవి గారి భార్య గారిని పలకరించి ఆవిడని ప్రసన్నం చేసుకోవాలి. ఆ తరువాత కూడా మీరు రాసిన కవిత/వ్యాసం/కథ నాకు చాలా నచ్చిందని ఆ జీవితో నేరుగా అనరాదు. మీవారు చాలా బాగా వ్రాస్తారని ఆ జీవి పక్కనున్న ఇల్లాలితో అంటే, భర్త బలవంతం మీద సాహితీ సభకు వచ్చిన ఆ ఇల్లాలు కొంత సంతోషించే అవకాశం ఉంది.
సాటి సాహితీ జీవిని చూడగానే ఏమో ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది గానీ ఆ జీవి కాగితం మీద సాహితీ జీవుడు. బయట సామాన్య సంసార జీవుడు. ఈ తేడా నీకు అర్థం అయ్యేలా చెయ్యడానికి నాకు ఇన్నేళ్ళు పట్టింది.
ఆమధ్య ఆయనెవరో వక్త నాకు ఊర్వశిని చూడాలని ఉంది అని జోక్ చేస్తే, నువ్వు నాకు కూడా వరుణుడిని, ఇంద్రుడిని,చంద్రుడిని చూద్దామని ఉందని జోక్ చేద్దామనుకున్నావ్. సమయానికి నేను అలెర్ట్ అయ్యి వారించబట్టి సరిపోయింది.
మొన్నామధ్య రచయిత్రుల సమావేశానికి వెళ్ళి అత్తల మీద, దుత్తల మీద మీరు రాసేవన్నీ చెత్త కథలు, రూటు మార్చుకోవాలని సందేశం ఇచ్చావ్. దాంతో సుబ్బ లక్ష్మి అమ్మమ్మ పుట్టక ముందు నించీ కతలు రాస్తున్న ఆ వృద్ధ నారీమణులంతా సుబ్బ లక్ష్మి ని కొరకొరా చూస్తూ ఉన్న రెండ్రోజులు రుసరుసలాడి పోయారు.
ఎవరేం రాస్తే నీకేంట్రా? నీ కతలేవో నువ్వు పడక. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతులు మార్చుకోవు.
ఆ మధ్య లెఫ్టీ భయ్యాల సభకు వెళ్ళి మీరంతా కలిసి తెలుగు కవిత్వాన్ని బ్రష్టు పట్టించారని అర్థం వచ్చేటట్టు మాట్టాడావు. అది నిజమే అనుకో. అయినా అన్నిచోట్లా నిజాలు చెప్పుకుంటూ పోతే ఎట్టా బతుకుతావురా? ఆ సభకు అధ్యక్షుడు, లెఫ్టీ భయ్యాస్ గాంగ్ లీడర్ అయిన వీరంగం జెప్ఫా, ఇప్పటిదాకా మీరు విన్నది మైకు శబ్దం మాత్రమే అన్నాడు తనలోపలి పేక మేడలు కూలుతుండగా. తెలుగు సాహితీరంగం ఎటుపోతే మనకేమిరా? నీ కవిత్వమేమో నువ్వు రాసుకోక?
మనకెందుకొచ్చిన తంపుల్రా నాయనా ఇదంతా. నేను దగ్గరుండి అడుగడుగునా కాపాడబట్టి సరిపోయిందిగానీ లేకపోతే నీవల్ల సుబ్బ లక్ష్మి ఏమైపోయేదో? నామాట విన్రా నాయనా! పద్ధతిగా ఉండు. సుబ్బ లక్ష్మి సుబ్బ లక్ష్మిలాగా ఉండాల. అమితాబ్ బచ్చన్ లాగో, చిరంజీవిలాగో ప్రవర్తిస్తానంటే కుదరదురా నాయనా!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి