తెలుంగు తలైవర్‌ కి జై!

 


పదేళ్ళ తరువాత జైలునించి విడుడలైన ఖైదీ రుద్రయ్య తన కూతుర్ని కలవడానికి లారీలో వెళుతూ, డాలస్‌కి, హ్యూస్టన్‌ కి మధ్యలో ఓ మామిడి తోటలో “తెలుగు కవిత్వ సభ” అన్న బానర్‌ చూసి, ఆహా, తెలుంగు విని ఎంత కాలమై పుడుస్తాందని, కాసేపు కవిత్వం విని పోదామని, లారీ ఆపుకుని వినడం ప్రారంభించాడు. 


ముందుగా సభకి అధ్యక్షుడైన జెఫ్ఫా భాయి లేచి, నేను నలభై యేళ్ళుగా కవిత్వం రాస్తున్న ముదిరి పోయిన‌ కవిని. తెలుగు దేశంలో ఉన్న అవార్డులన్నీ ఇప్పించుకున్నా. ఆవార్డు పొందిన నా కవిత “సెంటర్లో శవం” వినిపిస్తా.

సెంటర్లో
శవం ఒకటి
ఉంది
కళ్ళు ఉబ్బి
రక్తం గడ్డకట్టి
చర్మం మొద్దుబారిన
ఆ శవం వెనకాల
మరో శవం ఉంది.
కళ్ళు ఉబ్బి
రక్తం గడ్డకట్టి
చర్మం మొద్దుబారిన
ఆ శవం వెనకాల
మరో శవం ఉంది
మరో శవం ఉంది

అని కూర్చున్నాడు.

చప్పట్లు ఉదారంగా మోగాయి. తాతాచారి తన శిష్యుడిని చూసుకుని మురిసిపోయాడు.

తరువాత వృద్ధ కవి PVG లేచాడు. తన “పేలని తుపాకీ” ని చదవసాగాడు.

రాముడొక రాజు మాత్రమే
నేనొక మతిమాలిన
మనిషిని మాత్రమే
రాముడు అడవికి వెళ్ళాడు
నేనూ అడవి వెళ్ళాను
రాముడు బాణం వేసాడు
నేను తుపాకీ పేల్చాను
నా తుపాకీ పేలలేదు
ఇంటికి వచ్చాను

అదెందుకు
పేలలేదా అని
ఇప్పటి వరకూ
ఆలోచిస్తూనే ఉన్నాను
చిస్తునే ఉన్నాను
చిస్తూనే ఉంటాను
ఈ పోరాటం ఆగదు

అని కూర్చున్నాడు.

మళ్ళీ చప్పట్లు గొప్పగా మోగాయి. 

మరో కవి మారెల్లయ్య లేచాడు. 

బూతులు కూడా కవిత్వమే అని నేను ప్రూవ్‌ జేయ్‌టాన్కి వచ్చినా. ఎంద్కు రాయ్‌గూడదు బయ్‌? నేనొక కైత జదూతా వినుండ్రి.

మాదా  *ద్‍
బెహన్ ‌ *ద్‍
బర్సాత్‌ మే బిల్లీ
బిల్లీ కా లఫడా
చోరోంకా ఫడ్డా
కమీనోంకా మేలా
బేవకూఫ్‌ సాలె
సాలోంకా జడ్డా
గధోంకా అడ్డా!

అని పూర్తి చేయగానే చండ్ర హింసమ్మ, జెఫ్ఫా భాయి, పారాయణయ్య, PVG లేచి నిలబడి చేతులు నెప్పెట్టేంత వరకు చప్పట్లు కొట్టి అభినందించారు.

తర్వాత చండ్ర హింసమ్మ లేచి బీభత్స అవార్డు పొందిన తన బుక్కునించి ఒక కైత తీసి అరుస్తున్నట్టు చదవసాగింది-

వాడు 
అన్నం పెట్టమన్నాడు
గరిటె తిరగేసి వడ్డించా
వాడు
పప్పు వెయ్యమన్నాడు
మాడిపోయిన పప్పు
వాడి మొహాన కొట్టా
వాడు
కూర వెయ్యమన్నాడు
ఉప్పు లేని కూర
విసిరి కొట్టా
వాడు
కొట్టబోయాడు
కొర్రు కాల్చి
వాత పెట్టా
…..

ఇంకా ఎక్కువ చదివితే భరించలేమని అందరు చప్పట్లు మోగించి ఆవిడని స్టేజీ దించి ఊపిరి పీల్చుకున్నారు.


తరువాత అజీర్తి మొహంతో పారయణయ్య వచ్చి, “కింకిలి” అంటే తెల్సా? జెప్తారా? ఎవ్వరికి దెల్వదు. ఎంద్కంటే మీరంతా అగ్రవర్ణ అహంకార బూర్జువా పెటీ బూర్జువా కాబట్టి. 

అక్కడున్న వారంతా అంగీకరిస్తున్నట్టు చప్పట్లు కొట్టారు.

ఇదంతా వింటున్న అక్కడి తోటమాలి, బాబూ, “మింజిలి” అన్న పదం విన్నారా? మా గిరిజన ఏజెన్సీలో వాడ్తాం అన్నాడు ఉత్సాహంగా, ఇదేదో మాండలీకల ఆటన్నట్టు.

ఆ పదం ఎప్పుడూ వినని పారాయణయ్య మొహం జేవురించింది.
అది చూసి పుర్ర చేతి వయ్యాకరణులంతా టీం మెంబరు రెస్క్యూ కై వెంఠనే రంగంలోకి దిగి, తోచకపోతే తోట పని చేసుకోవయ్యా. సభలో నీకేంటి పని? తోటమాలివి తోటమాలిలాగుండు! ఎక్కువ మాట్టాడమాక! అని కేకలేసి బయటికి పంపించారు.

పగ చల్లారని పారాయణయ్య, జెఫ్పా భాయితో, రేపు వీడిని వీరంగం పత్రికలో బద్నాం చేద్దాం. నిర్వాహకులతో చెప్పి వీడికి రెండు నెల్లు జీతం కట్‌ చేయించు అన్నాడు.అదెంత పని అన్నట్టు తలూపాడు భాయి.

ఆ తర్వాత తన “పేగు కాలింది” కవిత చదివి తనకు తానే చప్పట్లు కొట్టుకుని కిందికి దిగాడు.

లారీలో కూచుని ఇదంతా చూస్తున్న ఖైదీ రుద్రయ్య, డేయ్‌, తమిళనాడు తెలుంగువాడు డా! ఇదిదా తెలుంగు కైత? ఎన్న డా? సోంబేర్స్! బేవార్స్! అనుకుంటూ, పక్కన  వారిస్తున్న  తంబికి సమాధానం చెప్పి,లారీ దిగితే, కవుల గుండెల్లో ముందు జంతర్‌మంతర్‌, తర్వాత డిష్షుం డిష్షుం. 

అప్పటి వరకూ కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడి ఏడ్చుచున్న తెలుగు సాహితీ మాత, ఆ దృశ్యము చూచి కిలకిల నవ్వి ఖైదీ రుద్రయ్యకు “తెలుగు వీర నాయక” అన్న బిరుదును ప్రదానం చేసి కన్నీరు తుడుచుకుంది.

తోటమాలి ఖైదీ రుద్రయ్యకి, పక్కనున్న తంబికి చెరి నాలుగు మామిడి పళ్ళు ఇచ్చి ఆనందభాష్పాలు రాల్చాడు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన