హలో! కార్సికా! Part-2
టాబ్లెట్లు వేసుకుని తేరుకున్న పెద్దిరాజు గారు తిరిగి ఫోన్లు తీసుకోవడం మొదలు పెట్టాడు.
హలో!హలో! నేను తవికల్రావుని. మీకు తెలుసుగా నేను మినీ కవితల కవిని.
అల్రెడీ నానీలు,లాగూలు,మిడ్డీలు,చెడ్డీ లు వంటి పేర్లు తీసేసుకోబడడం చేత నేను వినూత్నంగా ఆలోచించి నా మినీ కవితలకు తెలుగుతనం వుట్టిపడేలా “ఓణీలు” అని పేరు పెట్టా.
సభలో నా ఓణీలను మీరే ఆవిష్కరించాలి. నా ఓణీలను పట్టుకుని కార్సికాకి నడుచుకునైనా వచ్చేస్తా.
పెద్ది: ఓకే. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ ఓణీలకు బోణీ మా సభలోనే.
హలో!హలో! నేను జెండర్ విషయాల మీద పోరాడుతున్న రచయిత్రిని.
కూచున్నా,నించున్నా,పని చేసినా ఆఖరికి బాత్రూంకి వెళ్ళినా జండరే.
అలాంటి జెండర్ భేదం తెలుగు భాషలో కూడా ఉంది. మగవాళ్ళు బూతులు రాస్తే చదవడానికి అందరికీ సమ్మగా ఉంటుంది. కానీ అదే ఆడవారు రాస్తే ఎందుకలా రాసేవని గోల చేస్తారు.
అందుకే ఆడవాళ్ళు సైతం బూతుకథలు నిర్భయంగా వ్రాసే వాతావరణం కోసం నేను పోరాటం చేస్తున్నా. అలా ఆడవారు రాసిన అయిదు బూతుకథలను కార్సికాలో చదివి ప్రపంచానికి చాటిచెబుతా.
పెద్ది: లేడీస్ రాసిన బూతుకథలా? భలే సరదాగా ఉంది. ఈ పోరాటంలో మేమంతా నీవెనకాల ఉన్నాం. నువ్వు తప్పకుండా రావాలి. టిక్కెట్లు పంపుతా.
హలో!హలో! నేను చాలా పెద్ద గురువుని,అవధానిని.
మీ సభలో అవధానం అరేంజ్‌మెంట్స్,అపాయింట్మెంట్ స్ గురించి మా శిష్యుల్ని కన్సల్ట్ చెయ్యండి.
అశ్వద్ధామ మాఇంటికి టీ తాగడానికి వస్తుంటాడు. మార్కండేయ మహర్షి రోజూ నాకు బజార్లో ఎదురౌతాడు. ఆఫ్‌కోర్స్ నాకు తప్ప ఎవరికీ కనబడడనుకోండి. నేను అమలాపురం వెళ్ళినప్పుడు అశ్వనీదేవతలు కనబడి బావున్నావుటోయ్, నీ అవధానాలు,విదేశీయాత్రలు ఎలా నడుస్తున్నాయ్? అని పలకరించారు. ఇంకా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కలిసినప్పుడు బోధిస్తాను. మిగతా వివరాలు నా శిష్యులు చెబుతారు.
పెద్ది: అలాగే,తప్పకుండా. మీ శిష్యులతో టచ్‌లో ఉంటా.
హలో!హలో! మీకు తెలుసుగా, నేను తెలుగు స్టార్ వీర ఫాన్ ని.
తెలుగు స్టార్ నడక,మాట,అలవాట్లు,ఆహార్యం,ఆఖరికి కళ్ళు తిప్పడం కూడా తెలుగు స్టార్ లాగే. తెలుగు స్టార్ సినిమాలే చూస్తా. ఆ పాటలే పాడతా.
ఇంతకీ నేను తెలుగు స్టార్ మీద ఒరియాలో వచ్చిన పుస్తకానికి మళయాళ అనువాదాన్ని గురించి మీ తెలుగు సభలో తమిళంలో ప్రసంగించదలుచుకున్నా. మీకు ఓకేనేగా?
తెలుగు స్టార్ పేరు వినగానే పెద్ది రాజు గారి బుర్ర పనిచేయడం మానేసి, ఏమంటే ఎక్కడ ఏమి ముంచుకొస్తుందోనని వెంఠనే ఓకే,ఓకే దానిదేముంది,భాషదేముంది,తెలుగే మిటి అసలు తెలుగు? తెలుగు,తమిళం,మళయాళం అన్నీ అక్కచెల్లెళ్ళే అంటూ అర్థంపర్థం లేకుండా ఏదేదే మాట్లాడి హడావిడిగా ఫోన్ పెట్టేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.