ఊరురాఊరురారా! -part-2


 మైకిని: తెలుగు సంస్కృతిని దేశానికి ఆవల ఉన్న మీరెలా కాపాడుకుంటున్నారు?


వీరాభిమాన్రావు: నేను చిన్నప్పటినించీ తెలుగు స్టార్‌ వీరాభిమానిని. నా అసలు personality వేరే ఉంటుంది గానీ పైకి అచ్చు తెలుగు స్టార్‌ లాగే నడుస్తా,కూచుంటా,చేతులు తిప్పుతా.
 
ఇంకా నేను తెలుగు స్టార్‌ తెలుగు పాటలు స్టేజీ మీద పాడి తెలుగు స్టార్‌ ని ఎవరూ మర్చిపోకుండా ప్రచారం చేస్తుంటా.
తెలుగు స్టార్‌ సినిమాల మీద తెలుగులో వ్యాసాలు రాస్తా,ఉపన్యాసాలిస్తా. అలా విదేశంలో ఉన్నా తెలుక్కి ఎంతో సేవ చేస్తున్నా.

మైకిని: సీనియర్‌ సినిమా జర్నలిస్టు అయిన మీరు అలనాటి తారలను గూర్చిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటూ చాలా బిజీగా ఉంటున్నారు. ఎలా అనిపిస్తోంది?

పొన్నగంటి పాపాల భైరవుడు: చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కదమ్మా. నాలాటి తెలిసిన పెద్దవాళ్ళు చెప్పకపోతే ఏ అగ్ర హీరోకి ఏ హీరోయిన్‌తో ఎఫైరుండేదో, ఏ అగ్ర హీరోకి ఏ అగ్ర ప్రొడ్యూసర్ తో ఎందుకు గొడవొచ్చిందో, ఏ హీరోకి, ఏ హీరోకి పడేది కాదో, ఏ హీరోయిన్‌కి పెళ్ళి పెటాకులు ఎలా అయిందో ఇవన్నీ ప్రజలకు ఎలా తెలుస్తాయమ్మా. 
మనం చెప్పాలి కదమ్మా. ఆ రోజుల్లో ఇవన్నీ నేను జాగ్రత్తగా నోట్‌ చేసి పెట్టడం వల్ల ఈరోజు అవన్నీ చెప్పగలుగుతున్ననమ్మా. జనాలకి చాలా ఆసక్తి కదమ్మా. 

మైకిని: మీ తకిటతథిమి తెలుగు సంఘం వారు చేసే సాంస్కృతిక సేవ ఏమి?

ప్రచారార్భాట రావు: మేం ప్రతి సంవత్సరం లక్షలు ఖర్చు పెట్టి సినిమావాళ్ళని తెత్తాం. సినిమా పాటల షో చేత్తాం. అంతా సినిమాయే కాదు,అపార్దం చేసుకోమాకండి. మేం ఇండియాలో పేద జానపద కళాకారులకు కిట్లు పంచి ఫొటోలు దిగుతాం. ఒక్కో కిట్‌లో కిలో బియ్యం,వంద గ్రాముల కంది పప్పు,నాలుగు ఎండు మిరపకాయలు,రెండు మసాలా పాకెట్లు ఉంటాయి. 

మైకిని: బాబు, ఉగాదిని మీరు ఎలా సెలిబ్రేట్‌ చేసుకుంటున్నారు?

తెలుగు బాలుడు: మేం పిల్లలం అంతా సినిమా పాటలకు డాన్స్ చేస్తున్నాం. తరువాత ఆంటీస్‌ రెండు సినిమా పాటలకు డాన్స్ చేస్తున్నారు. తరువాత అంకుల్స్ ఆంటీస్‌ సిన్మా పాటలు పాడ్తారు.

మైకిని: బాబు, జానపద గేయాలు గానీ, హరికథ,బుర్రకథ ఇలాంటివి ఏమైనా తెలుసా నీకు? 

తెలుగు బాలుడు: అవేంటి ఆంటీ? సినిమా టైటిల్సా?

మర్నాడు “హరికథ,బుర్ర కథ అన్నవి సిన్మా టైటిల్సా అని అడుగుతున్న తెలుగు బాలుడు” అన్న thumbnail తో ఆ వీడియో వైరల్‌ అయితే, టీవీ ఛానళ్ళలో బ్రేక్‌ఫాస్ట్ బాచ్‌ అంతా కూచుని “సమాజంపై సినిమాల ప్రభావం” అన్న అంశం మీద మధ్య మధ్య బ్రేక్స్ లో సినిమా పాటలు వేస్తూ చర్చించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి