Stock answer తో కొట్టు బే!

 ఒక్కపొద్దు పత్రికా కార్యాలయానికి ఆ నెల వచ్చిన ఉత్తరాలను అన్నీ కట్టగట్టి తెచ్చాడు భాషేష్‌. వెవ్వెవ్వే వెంకోజీ,తాతాచారి ప్రతి నెలా ఉండే రోటీనేగా అన్నట్టు మొహాలు పెట్టుకుని కూచున్నారు.


ఉత్తరం1: అయ్యా,తమరి పత్రికలో తమరి ఆస్థాన రచయిత గారి హేతువాద శాస్త్రీయ ప్రగతిశీల ఇంకా ఏమోమో అయిన వ్యాసము చదివితిని. అందులో శివుడికి పాలతో అభిషేకము ఎందులకు? బీదలకు ఇవ్వుము. రామాలయము ఎందులకు? ఆసుపత్రి కట్టింపుము వంటి ఇత్యాది సూక్తిముక్తావళిని చూచి అచ్చెరువొందిని.

పొద్దున్నే బ్రాందీతో మొహం కడుక్కునే నాస్తికనాయాళ్ళైన తమకు అభిషేకాల గురించి,ఆలయాలను గురించి ఎందుకుగా తలకు మాసిన సన్నాసుల్లారా? మీరు మందు పార్టీలు మానేసి పాలు కొని పంచండిరా, మీ మిలియన్‌ డాలర్‌ ఇళ్ళు అమ్మి కట్టించండిరా ఆసుపత్రులు. మోకాలికి బట్టతలకు ముడిపెట్టే నెల తక్కువ వెధవల్లారా… 

మర్యాదగా మొదలెట్టి తిట్లల్లోకి దిగాడండోయ్‌!  వ్యాఖ్యలు అభ్యంతరకరమని,హిందూ మతోన్మాది అని stock answer పడేయ్‌! అన్నాడు వెవ్వెవ్వే వెంకోజీ చిరాగ్గా.

అభిషేకం concept అరేబియానుండి వచ్చిందని, వాళ్ళు ఎండకి ఆరారగా తల మీద నీళ్ళు పోసుకునే వారని, అదే అభిషేకం అయిందని నేను ఆ thread ని continue చేస్తా. అప్పుడింక జనాలు దాని మీద కొట్టుకు చావడమే. పచ్చడి పచ్చడి చేస్తా అన్నాడు భాషేష్‌ ఉత్సాహంగా. 
 
ఏదో ఏడువు అన్నట్టు చూసి రెండో ఉత్తరం తీసాడు వెంకోజీ.

ఉత్తరం2: అయ్యా, మీ పత్రికలో హిందూ దేవుళ్ళు కల్పితాలన్నట్టు ఏవేవో అధారాలు చూపిస్తున్నట్టు పకడ్బందీగా వ్యాసాలు వ్రాస్తున్నారు. మరి ఇతర మతాల గురించి, వారి దేవుళ్ళ గురించి ఎందుకు అలాంటి డిటెక్టివ్‌ వ్యాసాలు వ్రాయరు?

వెంకోజీ: stock answer: ఎవరైనా తాను పుట్టి పెరిగిన మతాన్ని గురించే వ్రాయగలుగుతారు. మిగిలినవి మనకు తెలీదు,మనకు సంబంధం లేదు.

ఉత్తరం3: మీ పత్రికలో వస్తున్న కథల్లో  బ్రాహ్మణ ఆడపిల్లలకు  ఇతర మతస్థులకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఎందుకు? తల్లిదండ్రుల మానసిక క్షోభ మీకు పట్టదా? ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టిన పిల్ల చేత ఆవు మాంసం తినిపిస్తే మీకు ఆనందమా?

వెంకోజీ: stock answer: సమాజం కన్నా, కుటుంబం కన్నా వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యం. వ్యక్తి స్వేచ్ఛని హరించే అన్ని సంప్రదాయాలను,కట్టుబాట్లను ఛట్‌పట్‌ మని తెంచి అవతల పారెయ్యాలి.

నేను వ్యక్తి స్వేచ్ఛ గురించి జర్మనీ మేధావి డానియల్‌ జాకోబ్‌ ఏమన్నాడో, హిందూ సమాజ కట్టుబాట్ల గురించి రష్యా మేధావి పడవోయ్‌ ఏమన్నాడో quote చేస్తూ thread continue చేస్తా అన్నాడు భాషేష్‌ ఉత్సాహంగా.

వెరీ గుడ్‌ అన్నాడు తాతాచారి మెచ్చుకోలుగా. 

ఉత్తరం4: తాతాచారీ, ముక్కోటి ఆంధ్రులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో, నువ్వు తెలుగులో ఆచార్య పీఠం అధిష్టించి సాహితీలోకం నెత్తిన కూచున్నావు. నీ జన్మలో ఏదో ఒక సాహితీ ప్రక్రియలో ఓ శుద్ధమైన రచన చేయలేకపోయావు. దైవప్రేరణతో రచనలు చేసామని మన పూర్వీకులు చెప్పుకోవడం ట్రాషా? సన్నాసి. నువ్వు మాత్రం నీ రచనలు భూతప్రేతాల ప్రేరణతోనో, మోహినీ పిశాచి ప్రేరణతోనో రాసినట్టున్నావు. 
తెలుగు ఆచార్య పదవిలో ఉండి తెలుగేమీ గొప్ప భాష కాదని చెబుతావు. బ్రౌన్‌ దొర తెలుక్కి చేసిందేమీ లేదని వాగుతావు. నువ్వొక హైనావి. ఇంతకంటే అనడానికి నాకు సభ్యత అడ్డొస్తోంది.

వెంకోజీ: stock answer: వ్యక్తిగత విమర్శలను సహించము. విమర్శ రచనలకు మాత్రమే పరిమితం చేయవలసిందిగా పాఠకులకు మళ్ళీ ఓసారి గుర్తుచేస్తున్నాము.

ఉత్తరం5: వెంకోజీ, నువ్వో బుర్ర తక్కువ సంపాదకుడువి గానీ నీకా విషయం తెలీదు. డబ్బాలో గులకరాళ్ళు పోసినట్టు వాగడమేగానీ నీ దగ్గర సరుకు లేదు.  పోయినసారి నేను రాసిన ఉత్తరానికి ఎవరైనా తాము పుట్టి పెరిగిన మతం గురించే వ్రాస్తారని, హిందూ ధర్మం మీద నీ అవాకులను,చెవాకులను సమర్థించుకున్నావు. మరి ఎక్కడో జర్మనీ వాడు రాసిన పుస్తకాలు చదివి ఆ దరిద్రమంతా ఇక్కడ కక్కుతావుగా? నీ పక్కింటి వాడి పుస్తకం ఏమిటో చదివి విమర్శించే దమ్ము నీకు లేదా? నీకు తెలివి ఉంటే stock answer కాదురా, సరిగ్గా సొంత జవాబివ్వు.

వెంకోజీ: అబ్బో, వీడెవడో గట్టివాడే. వీడిని ఇంకోలా డీల్‌ చెయ్యాలి. ముందు సంపాదకుడిని అవమానించాడని గొడవ చేద్దాం. మారు పేర్లతో దాడి చేద్దాం. 
నేను రెడ్డి,చౌదరి,శాస్త్రి పేర్లతో రాస్తా. భాషేష్‌ గౌడ్‌,ఖాన్‌,పఠాన్‌ పేర్లతో రాస్తాడు. వాడి భాషను తిడుతూ పనిలేని మజ్నూని కూడా రంగంలోకి దించుదాం. 
దాంతో వాడు క్షమాపణ చెప్పి దిగొస్తాడు. తరువాత వాడి రచన ఒకటి మనమే అడిగి తీసుకుని ప్రచురించి, మళ్ళీ మారుపేర్లతో వాడి రచనను దుయ్యబడదాం. దాంతో వాడి ఆత్మవిశ్వాసం చచ్చి మళ్ళీ ఇటు రాకుండా ఏ వింధ్య పర్వతాల వైపుకో వెళ్ళిపోతాడు. ఏమంటారు?

వాకే,వాకే. తెలిసిందేగా అన్నట్టు తల వూపారు మిగిలిన ఇద్దరు.

మడి-గడి లో అచ్చుతప్పులకు క్షంతవ్యులం, పోయినసారి అప్పుతచ్చులకు క్షంతవ్యులం-
ఇలా మిగిలిన stock answers రాసుకుని ఎవరిళ్ళకు వాళ్ళుపోయారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి