ఏటన్నాడేటన్నాడే రాంబాబు? -2
రంధ్రాన్వేషణమ్మ గారు, ఏం చేస్తున్నారండీ?
రామాయణం ఏ కీలుకి ఆ కీలు విరవడం అయిపోయింది. ఇప్పుడు మహాభారతం ప్రాజెక్టు తీసుకున్నా. అసలు మహాభారతం అంతా తప్పులతడకలు అని నేను కనిపెట్టా. అవన్నీ లిస్టు తయారు చేస్తున్నా.
ఇప్పుడు, మాటకి చెప్తా. మహాప్రస్థానంలో ద్రౌపది ఎందుకు పడిపోయిందంటే ధర్మరాజు ఏం చెబుతాడండీ?
ద్రౌపదికి అర్జునుడంటే ప్రేమ, అర్జునుడికి ఉప్మా ఎక్కువ పెట్టేది అంటాడండీ. ఇప్పుడు ఇంటో నలుగురు మనుషులుంటే వడ్డించేటప్పుడు కాత్త ఒక్క రవ్వ అటూ ఇటూ అవ్వుద్దా లేదా? అందరికీ సమానంగా పెట్టాలంటే ఎట్టవుద్దండీ?
అదంతా ఇప్పుడు నా పుస్తకంలో చెబుతున్నా. ముడొంతులు అయిపోయింది.
వీర భజనమ్మ గారు, ఏం చేస్తున్నారండీ?
నేను నన్నడక్కపోయినా అన్ని పుస్తకాలకు సమీక్షలు రాస్తుంటా. అడిగి మరీ ముందు మాటలు రాసి పెడుతుంటా. అందరినీ పొగడ్డం తప్ప నాకు ఇంకో మాట తెలియదు. విమర్శ అంటే రామ రామ అని చెవులు మూసుకుంటా. కాళి దాసును ఏ లెవల్లో పొగుడుతానో పప్పుల పెద్దమ్మ కథల్ని కూడా అంతకన్నా పై లెవల్లో పొగుడుతా. నా ఫేస్‌బుక్‌లో పది వేలమంది స్నేహితులున్నారు. అందులో సగంమంది నాచేత ముందు మాటలు రాయించుకున్న వారే. ఇప్పుడు కొండయ్య గారి కథలు నోబెల్ ఇవ్వాల్సిన స్థాయిలో ఉన్నాయని, మిరియమ్మ గారి కవితలు ఖేల్‌రత్న అవార్డు ఇవ్వాల్సిన లెవల్లో ఉన్నాయని సమీక్షలు వ్రాస్తున్నా.
సాహితీ సకలమ్మ గారు, ఏం చేస్తున్నారండీ?
నేనే పాటలు రాసి, నేను సంగీతం చేసి, నేనే పాడిన పాటలు YouTube లో నా ఛానెల్లో పెట్టా. మన తెలుగు వాళ్ళకి మంచి టేస్టు లేదు. పదికి మించి views రాలేదు. ఈసారి నేను రాసి, నా online పత్రికలో నేనే ప్రచురించుకున్న నా కథలను నేనే చదివి రికార్డు చేసి అందరికీ పంపా.కుళ్ళు మొహాలు. సగంమంది కూడా respond కాలేదు. ఇప్పుడు గోరింటాకు కథలు అని గోరింటాకు మీద వచ్చిన అన్ని కథలు కలిపి సంకలనం తెస్తున్నా. మీ దగ్గర గోరింటాకు మీద ఏవైనా కథలుంటే రేపు రాత్రి 12 గంటలా 49 నిమిషాల లోపల పంపాలి. లేకపోతే స్వీకరించబడవు. తెలిసిందా?
ఇవన్నీ విని, హహ, తెలుగు బంగారక్కలు! అనుకుంటూ పోయాడు మన రాంబాబు.