కాకర కాయ కాదయ్యా, కీకర కాయ!

 


శాస్త్రవేత్త: ఏమయ్యా రైతయ్యా, ఇంకా ఎంతకాలం ఈ పాతకాలం పద్ధతుల్లో వ్యవసాయం? నీ ముందు పంటనించి తరువాతి పంటకు నువ్వే విత్తనాలు తయారు చేసుకుంటావా? వేప కషాయం, వెల్లుల్లి కషాయం ఇలా కషాయాలు నువ్వే చేసుకుని పురుగు మందులుగా వాడతావా? ఇలా అయితే అయినట్టే వ్యవసాయం. నేను బాగా చదువుకున్న శాస్త్రవేత్తని. ఎక్కువ దిగుబడి వచ్చే ఉపాయాలు నేను చెబుతాను,పాటించు. 


రైతయ్య: సరే సారు. అట్నే చేత్తా.

శాస్త్రవేత్త: నేను అభివృద్ధి చేసిన విత్తనాలు మార్కెట్‌లో కొనుక్కుని వెయ్యి.

రైతయ్య: సరే సారు. అట్నే చేత్తా.

శాస్త్రవేత్త: తెల్ల పురుగులకు డుమాక్రాన్‌ పురుగు మందు కొనుక్కొచ్చి వెయ్యి.

రైతయ్య: సరే సారు. అట్నే చేత్తా.

శాస్త్రవేత్త: ఎర్ర పురుగులకు లమాక్రాన్‌ వెయ్యి.

రైతయ్య: సరే సారు. అట్నే చేత్తా.

శాస్త్రవేత్త: పచ్చ పురుగులకు టమాక్రాన్‌ వెయ్యి.

రైతయ్య: సరే సారు. అట్నే చేత్తా.

శాస్త్రవేత్త: నల్ల పురుగులకు ముమైత్‌ ఖాన్‌‌ వెయ్యి.

రైతయ్య: సరే సారు. అట్నే చేత్తా.

కొన్నాళ్ళయ్యాక- 

రైతయ్య : 


 చెప్పిన పురుగు మందులన్నీ జల్లినా సారు.
విత్తనాలు కొనుక్కొచ్చి ఏసినా సారు.

కొత్త పురుగులొచ్చినై. 
విత్తనాలు సచ్చినై. 
ఖర్చులు మోపెడైనై సారు,
అప్పులు నెత్తి మీద తడిసిన కట్టెలైనై.

ఈ పురుగుల మందులన్నీ కలిపి నేనే తాగి సత్తన్నా సారు..

శాస్త్రవేత్త: పాత పంటనుండి విత్తనాలు చేసుకుని కొత్త పంటకి వాడుకుని, పురుగు మందులు వాడకుండా కషాయాలు జల్లి వ్యవసాయం చేసే పద్ధతి ఉత్తమమని, అలా పండించిన పంటకు ఎక్కువ ధర వస్తుందని వీడిని ఎడ్యుకేట్‌ చేద్దామని వచ్చా.
 ఇంతలోనే వీడు చచ్చాడు. 
సరే,ఏం చేస్తాం. నేను వేప కషాయానికి,వెల్లుల్లి కషాయానికి పేటెంట్ కి అప్లై చేసా. ఆ సంగతి ఏమైందో చూడాలి. వస్తా!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన