తాతాచారి భజన సమాజంలో రసాభాస
ఒక్క పొద్దు కార్యాలయంలో ఎప్పటివలే తాతాచారి భజన సమాజం వారి భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
నీ పాదాలే
మాకు శరణు
తాతాచారీ!
శరణు శరణు
తాతాచారీ!
తాతాచారీ!
…….
ఏమని
పాడుదును!
నీ లీలలేమని
పాడుదును!
తాతా, నీ లీల
లేమని పాడుదును!
…..
ఓ తాతాచారీ!
నీ లీలలన్నీ
నా నోట పాడి
నే పరవశింతు!
నే పులకరింతు!
చివరగా హారతి,తాతాచారీ! అన్న హారతి పాట, ఆ తరువాత అఖిల సాహితీ కోటి బ్రహ్మాండ నాయక శ్రీశ్రీశ్రీ తాతాచారి మహరాజ్ కి జై! అన్న జయ జయ ధ్వానాలతో భక్తులంతా భజన కార్యక్రమం ముగించి పిజ్జాలు, బర్గర్లు ప్రసాదంగాను, పానీయములు తీర్ధములుగాను స్వీకరించుతూ ఉండగా, హిహిహ్హీ అని ఎప్పటివలే
వెకిలిగా నవ్వుతూ తాతాచారి అక్కడ ప్రత్యక్షమైనాడు.
నా భజనలో నేను కూచోడం నాకు చచ్చేంత మోమాటం. అందుకే భజన అయ్యాక వస్తూంటా అన్నాడు, మళ్ళీ వెకిలిగా నవ్వుతూ. తాతాచారిని చూస్తూనే శిష్యబృందమంతా తాతాచారి కాళ్ళ మీద పడి ఆనందభాష్పాలు రాల్చారు.
ఈ నెల ఒక్కపొద్దుకి వ్యాసం కావాలి తాతా! ఐడియా చెప్పు అని వెంకోజీ అర్ధించడం తడవు, అదేదో సైన్మాలో హీరో - రాసుకోరా, సాంబా! అన్నట్టు చెబుతా, రాసుకోండి అని అభయ ముద్రలో కూచున్నాడు తాతాజీ.
అందరు కాగితాలు,కలాలు దగ్గర పెట్టుకుని సిద్ధంగా కూచున్నారు.
నేనొక సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నాను. జాగ్రత్తగా రాసుకోండి.
“మన ప్రాచీన కవుల వ్యక్తిత్వాల గురించిన గాథలన్నీ వారి రచనలు చదివి పాఠకులు అల్లుకున్న కల్పిత కథలే”. అన్నాడు.
ఈ సిద్ధాంతం వినగానే అక్కడున్న శిష్యబృందమంతా పైకి హర్షాతిరేకాలతో పరశిస్తూ నృత్యం చేసారు.
వెంకోజీ తన కోకిల స్వరాన్ని మరింత పెంచి కేకలు వేసి అతి కష్టం మీద వాళ్ళందరినీ కూచోబెట్టాడు.
నా ఈ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేయ్యడానికి కొన్ని ఉదాహరణలు చెబుతా రాసుకోండి, అంటూ ఆర్డరు వేసాడు తాతాజీ.
1. వాల్మీకి ఏదో ఒక అల్లిబిల్లి కథలాగా సర్దాగా రామాయణం రాసాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకు ఎవరో రాముడిని దేవుడిని చేసారు. అప్పుడు అర్జంటుగా వాల్మీకిని భక్తి అనే ఫ్రేములో బిగించాల్సి వచ్చింది జనాలకు. అప్పుడేం చేసారంటే, వాల్మీకి తపస్సు చేసి ఋషి అయ్యాడని, మహర్షి అయ్యాడని, అందుకే రామాయణం రాయగలిగాడని కట్టు కథలు కట్టుకున్నారన్న మాట.
శిష్యబృందం చప్పట్లతో తమ ఆమోదానందాలను తెలియజేసారు.
2. శ్రీనాథుడు రాజుల చుట్టూ, జమీందారుల చుట్టూ తిరుగుతూ ఆ తెలివితక్కువ మనుషుల్ని నువ్వు ఇంద్రుడివీ, చంద్రుడివీ అని పొగుడుతూ వాళ్ళ దగ్గర సన్మానాలు, సత్కారాలు పొందుతూ బాగా సంపాదించాడని, పాఠకులు అసూయతో రగిలిపోయి శ్రీనాథుడు చివరి దశలో అంతా పోగొట్టుకుని అధోగతి పాలైనాడని కతలు సృష్టించుకుని సాడిస్టిక్ గా ఆనందించారు.
మళ్ళీ శిష్యబృందం అంతా పైకి లేచి చప్పట్లు కొట్టి, వెంకోజీ కోకిల స్వరానికి భయపడి, సాంపిల్ గా కొన్ని గెంతులు మాత్రమే వేసి కూర్చున్నారు.
3. కాళిదాసు రకరకాల కావ్యాలు వ్రాసాడు కదా? మరి అతగాడిని భక్త కవిగా ఎలా తయారు చేయగలమబ్బా అని భారతదేశంలోని పాఠకులంతా కుమ్మక్కై ఆలోచించి, ఓకే, కాళిదాసు పేరులో “కాళి” ఉంది కాబట్టి ఇతగాడు కాళీ భక్తుడని కథలు అల్లుదాం అని నిర్ణయించుకుని, అలా బోలెడు కథలను దేశమంతా ప్రచారంలో పెట్టారు.
మళ్ళీ ఈలలు, అరుపులు, చరుపులు.
4. జయదేవుడి స్టోరీ కూడా డిట్టో. ఆయన గీత గోవిందాన్ని చదివి పాఠకుల మనస్సులు శృంగారంలో నాకు మల్లేనే ఓలలాడుతుండగా, మరి జయ దేవుడినీ, అతని రచనలను భక్తి ఫ్రేములో ఎటుల బిగించవలె? అని అఖిల భారత పాఠకుల సంఘమంతా గూడుపుఠాణీ చేసి ఆ జయదేవుడు కృష్ణ భక్తుడని, అతడికి కావాల్సినప్పుడల్లా కృష్ణుడు ప్రత్యక్షమౌతూ ఉంటాడని జాగ్రత్తగా కథలు అల్లారు.
మళ్ళీ ఈలలు, ముసి ముసి నవ్వులు, హర్షాతిరేకాలు.
ఇంత వరకే మనకు కథ తెలుసు.
ఈ పిచ్చి కూతలకు భారత సాహితీ మాత కన్నీరు పెట్టుకోవడం చూసి, కాళీ మాత ఉగ్రరూపం దాల్చి ఒక్కపొద్దు కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడున్న తాతాచారికి, అతని శిష్యగణానికీ దేహశుద్ధి చేసిందని ఎల్లమ్మ గుడిలో గణాచారి పూనకంతో ఊగిపోతూ అందరికీ చెప్పడంతో, అఖిల భారత పాఠక లోకానికి అసలు విషయం తెలిసింది.