ఏటన్నాడేటన్నాడే రాంబాబు?

 

రెటమతం బాబు గారు, ఏం చేస్తున్నారండీ?


 ఈ రోజు ఉదయం ఓ స్టూడియోకి వెళ్ళా. అక్కడ చర్చకి వచ్చిన జ్యోతిష్కుడిని మీ జ్యోతిషం నిజంగా వచ్చి ఉంటే నాకిప్పుడు ఎక్కడ దురద పుడుతోందో చెప్పండి? అని ఛాలెంజ్‌ చేసా. అంతే! Success!
ఆ జ్యోతిష్కుడు తెల్లమొహం వేసాడు. దాంతో జ్యోతిశ్శాస్త్రం అంతా హంబక్‌ అని, జ్యోతిష్కులంతా మోసగాళ్ళని కేకలు వేసి బయటికి వచ్చా. 

మధ్యాహ్నం ఇంకో స్టూడియోకి వెళ్ళా. అక్కడ చర్చకి వచ్చిన పండితుల్ని, ఏదీ, మీ దేవుడు నిజంగా ఉంటే ఇప్పటికిప్పుడు స్టూడియోకి రప్పించి అందరికీ చూపించండి, చూద్దాం? అని సవాల్‌ చేసా. అంతే! ఢమాల్‌! చర్చకు వచ్చిన వాళ్ళందరి నోళ్ళు మూత పడ్డాయి! మళ్ళీ success! 

సాయంత్రం మరో స్టూడియోకి వెళ్ళా. అక్కడ చర్చకు వచ్చిన మంత్రగాళ్ళని దెయ్యాలు నిజంగా ఉంటే చూపించమని గట్టిగా ప్రశ్నించా. వాళ్ళు రాత్రికి మాఇంట్లోకి రెండు దెయ్యాలని వదులుతామని చెప్పేటప్పటికి అప్పటికి పైకి బింకంగా ఉన్నా లోలోపల కొంచెం భయం వేసింది. అందుకే ఎందుకైనా మంచిదని ఈ పూటకి ఇంటికి పోకుండా ఈ చెట్టు కింద పడుకున్నా.

జీడిపాకం భ్రమణయ్య గారు, ఏం చేస్తున్నారండీ?

నేనో టీవీ సీరియల్‌ కోసం నించుని, కూచుని,పడుకుని, బస్టాప్‌ లో, రైల్వే స్టేషన్‌ లో ఇలా ఎక్కడబడితే అక్కడ రాసేస్తూ ఉన్నా. హీరోయిన్‌ రాధ యాక్సిడెంట్‌లో  భర్త చనిపోయాడనుకొని మళ్ళీ పెళ్ళి చేసుకుంది. ఇంతలో మొదటి భర్త మళ్ళీ బ్రతికి వచ్చాడు. తొందరపడి మళ్ళీ పెళ్ళి చేసుకున్నానే అన్న పశ్చాత్తాపంతో రెండవ భర్తను దూరం చేసుకుంది. కానీ మొదటి భర్తకు యాక్సిడెంట్‌లో మతి తప్పి ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని తెలుస్తుంది. అప్పుడు రాధ రెండవ భర్త కోసం వెతకడం కోసం బయలు దేరుతుంది. అప్పుడు రాధకు యాక్సిడెంట్‌ అయి మతిపోయి తనను రక్షించిన యువకుడిని పెళ్ళి చేసుకుంటుంది. ఇంతలో రాధ ఆచూకీ తెలుసుకుని రాధ మొదటి భర్త, రెండవ భర్త అక్కడికి వస్తారు. ఇంత వరకూ సీరియల్‌ రాసా. ఆ తరువాత కథను ఎలా మలుపు తిప్పాలబ్బా అని ఆలోచిస్తున్నా.

భాషేష్‌ గారు, ఏం చేస్తున్నారండీ?

వేదాల్లో వెంకటేశ్వర స్వామి లేడు, వేదాల్లో గణపతి లేడు, రామాయణంలో వంకాయలు లేవు, భారతంలో టెంకాయలు లేవు ఇలా అనేక సంచలనాత్మక పరిశోధనా వ్యాసాలు రాసా. ఇప్పుడు డు,ము,వులు తెలుగు అక్షరాలు కాదు అని ఓ పరిశోధనాత్మక వ్యాసం రాస్తున్నా.

మీరేం చేస్తున్నారండీ, తాతాచారి గారు?

నా బీభత్స అకాడెమీ అవార్డుకి రోజూ దుమ్ము దులిపి కొబ్బరి నూనె రాసి మెరుగు పెడుతున్నా. నన్ను ప్రతి నెలా జాకీలేసి పైకి లేపడానికి మా చేతిలో పత్రిక ఒక్క పొద్దు ఉంది కాబట్టి దానికోసం, మీ పిల్లలకు తెలుగు అస్సలు నేర్పకండి అని ఓ వ్యాసం రాస్తున్నా. 


ఇదంతా వింటున్న మన రాంబాబు, తెలుగు కేతిగాళ్ళురా మీరంతా! అనేసి చక్కా పోయాడు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి