కాశీ క్షేత్రంలో తాతాచారి జ్ఞానబోధ

 



కాశీ క్షేత్రంలో ఓ ఘాట్‌ లో సూటూబూటూ వేసుకుని దిక్కులు చూస్తున్న తాతాచారిని గుర్తు పట్టి ఎంతో ఆనందంగా అభిమానంగా పలకరించాడో సాహితీ అభిమాని. 

కాశీ విశ్వేశ్వరుడుని దర్శించుకోవడానికి వచ్చారా సార్‌ అని పలకరించాడు ఎంతో అభిమానంగా. 

నాకీ దేవుళ్ళు భక్తి ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవయ్యా.
 ఏదో ఇక్కడికి తెల్ల పిల్లలు వస్తారుగా వాళ్ళను చూస్తూ కాలక్షేపం చేద్దామని ఇక్కడికి టూరేశా. 

సార్‌, మీలో ఈ ఏంగిల్‌ కూడా ఉందా? అన్నాడు అభిమాని ఆశ్చర్యపోతూ. 

నువ్వు భయం భక్తి అన్నీ ఉన్న అమాయకుడిలా ఉన్నావయ్యా. నీకు బ్రెయిన్‌ వాష్‌ చెయ్యాల్సిందే. దా,ఇలా కూచో చెబుతా అన్నాడు తాతాచారి, తన పక్కన చోటు చూపిస్తూ, జ్ఞాన బోధ మొదలెట్టాడు.

జీవితంలో రెండే నిజాలు ఒకటి కామం, రెండోది డబ్బు. 

ఏంటి సార్‌, మీరనేది? 

  మరి? ఇంకా చెబుతా విను. 

నీతి, స్నేహం, న్యాయం, ధర్మం ఇవి నిజాలు కావు.  
తెలివితక్కువ చవటాయిలే  ఇవి ఉన్నాయని నమ్ముతారు. 

సార్‌?

అలా వాళ్ళు నమ్ముతారు కాబట్టి నువ్వు వాటిని నీ అవసరాల కోసం వాడుకోవచ్చు.


సార్‌?

 సంఘానికి సంస్కారం, సత్ప్రవర్తన లాంటివి ఏవీ అక్కర్లేదు. 

సార్‌?

 నువ్వు చెయ్యవలసిన పని అల్లా నీ తెలివితేటలు వాడుకుని నీకు నచ్చిన పని ఏదైనా సరే హాయిగా చేసేసి అది నీతా, అవినీతా, మంచా, చెడ్డా అనే శషబిషలు మానేసి హాయిగా వుండడమే.

సార్‌?

లౌక్యంతో, తిమ్మినా బమ్మిని చేసైనా సరే సుఖం సంపాదించాలి. తెలిసిందా?

సార్‌?

ఇంతలో పంచె, పిలక, చెవికి ఒంటి రాయి దిద్దులతో సంప్రదాయ వేషధారణలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి, 

గంగలో స్నానం చేస్తుంటే మీ మాటలు కర్ణాకర్ణిగా వినబడి పవిత్ర కాశీ క్షేత్రంలో కూర్చుని ఇలాంటి ధర్మ విరుద్ధమైన బోధలు చేస్తున్న గురువెవరా అని వచ్చాను. నువ్వుటోయ్‌,తాతాచారీ? నేను సుబ్రహ్మణ్య ఘనాపాఠిని.
 చిన్నతనంలో ఎదురు బొదురు ఇళ్ళల్లో ఉండేవాళ్ళం.
 నేను వేద విద్యలో ప్రవేశించాను. నువ్వు లౌకిక విద్యల్లో పడ్డావు. క్రౌంచ ద్వీపంలో ఆచార్య పదవి వెలగబెట్టావని విన్నాను. 

తొంభై యేళ్ళ తొక్కువై ఉండి ఇవా నీకన్నా చిన్నవారికి నువ్వు చేసే బోధలు? అన్నాడు కోపంగా.

హీహీ, నువ్వా సుబ్బూ, ఎలా ఉన్నావ్‌? హీహీ, చాలా బీదవాడిలా ఉన్నావ్‌. ముసలి వాడివైపోయావ్‌.  హీహీ, నేను చూడు, కొత్త పెళ్ళి కొడుకులా ఎలా ఉన్నానో. హీహీ, అంతా మనం చేసుకోవడంలో ఉంది. నువ్వు తెలివి తక్కువగా వేదం వల్లెవేసుకుంటూ, మళ్ళు దళ్ళు అంటూ స్నానాలు జపాలు చేసి చేసి కుంగి పోయావ్‌. నేను చూడు విద్వీపానికి పోయి కోట్లు వెనకేసి దర్జాగా ఉన్నా. హీహీ. అన్నాడు తాతాచారి తన చిన్ననాటి మిత్రుడి వంక హేళనగా చూస్తూ. 

దాంతో ఘనాపాఠి గారు ఆగ్రహోదగ్రుడై, నువ్వు స్వధర్మాన్ని  విడిచి పెట్టడమే కాక, తాచెడ్డ కోతి వనమెల్లా చెరచినట్టు ఇతరులను సైతం చెడగొడతావా? వేద పండితుడిని నన్ను హేళన చేసి వేదమాతనే అవమానిస్తావా? పవిత్ర కాశీ క్షేత్రంలో కూచుని ధర్మ విరుద్ధమైన మాటలు మాట్లాడే అపచారం చేసినందుకు కుక్కవై పో! అన్నాడు చేతిలోని నీళ్ళు తాతాచారి మీద జల్లుతూ. 

ఈ పిల్లి శాపాలకు నేను భయపడను, హీహీ అంటున్న తాతాచారి కాశీ క్షేత్ర మహిమో, వేద పండితుని శాపమో మరి ఢామ్మని కుక్క రూపంలోకి మారిపోయాడు. అది చూసి అభిమాని భయంతో అక్కడినించి పిక్కబలం కొద్దీ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. 

కుక్క రూపం పొందిన తాతాచారి, సరే, ఏదో ఒకటిలే. అంతా మనం చేసుకోవడంలో ఉంది. ఈ కాశీ వీథుల్లో లేడీ డాగ్స్ ఏమైనా కనిపిస్తాయేమో  కాలక్షేపం చేయడానికి,  అనుకుంటూ వాటిని వెదుక్కుంటూ అక్కడినించి బయలుదేరాడు. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

కుబెగ్గరేరా!