తెలీదు బామ్మర్దీ!
పకోడీల మీద, పానీపూరీ మీద పద్యాలు కట్టొచ్చు.
అదంతా కవిత్వమేనంటావా బావా?
తెలీదు బామ్మర్దీ.
వచనాన్ని ముక్కలు ముక్కలు చేసి పొయ్యిలో పెడితే, సారీ, పేపరు మీద పెడితే కవిత్వమైపోతాదా బావా?
తెలీదు బామ్మర్దీ.
అవధానంలో పద్యం కట్టడమే కదా అసలుకి చెయ్యాల్సింది.
మరా పజ్జాల్లో కవిత్వం ఉంటాదంటావా బావా?
తెలీదు బామ్మర్దీ.
పడికట్టు పదాల పందెం కోడి అవార్డుల కవితల్లో కవిత్వం ఉంటాదంటావా బావా?
తెలీదు బామ్మర్దీ.
పుట్టిన రోజు పద్యాలు, షష్టిపూర్తి పద్యాలను కవిత్వం అనొచ్చునంటావా బావా?
తెలీదు బామ్మర్దీ.
అన్నింటికీ తెలీదు అంటావే బావా? నిజ్జంగా తెలీదా?
తెలీదు అంటే ఒక్క మాటలో పోద్దిరా. తెలుసంటే దాని మీద కొండవీటి చాంతాడంత కవిత్వం చెప్పాలి. మన కవిత్వం తెలుసుగా.
వామ్మో, అర్థమైంది. ఇప్పుడు బూతులొద్దులే బావా.